Siddaramaiah: మా ప్రభుత్వం సుస్థిరమే.. భాజపా నేతకు సీఎం సిద్ధరామయ్య కౌంటర్‌!

కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలుతుందంటూ భాజపా ఎమ్మెల్యే జార్కిహోళి చేసిన వ్యాఖ్యలకు సీఎం సిద్ధరామయ్య కౌంటర్‌ ఇచ్చారు.

Updated : 31 Oct 2023 18:24 IST

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలబోతోందంటూ భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి సోమవారం చేసిన వ్యాఖ్యల్ని సీఎం సిద్ధరామయ్య తిప్పికొట్టారు.  తన ప్రభుత్వం స్థిరంగానే ఉంటుందని.. పతనమయ్యే అవకాశమే లేదన్నారు. గతంలో మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ సర్కార్‌కు జరిగిన మాదిరిగానే కర్ణాటకలోనూ జరుగుతుందన్న జార్కిహోళి మాటలకు సిద్ధరామయ్య మంగళవారం గట్టి కౌంటర్‌ ఇచ్చారు.  కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం స్థిరంగానే ఉంటుందని.. ఒక్క భాజపా నేత చెప్పినంత మాత్రాన ప్రభుత్వం పతనం కావడం సాధ్యం కాదన్నారు. 

ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటే విచక్షణతో బెయిల్ ఇవ్వొచ్చు: కీలక అంశాలను పేర్కొన్న హైకోర్టు

మరోవైపు, కర్ణాటకలో ‘ఆపరేషన్‌ కమలం’ ఊహాగానాలు కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాజపా ఎమ్మెల్యే జార్కిహోళి నిన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం బయటి నుంచి కాకుండా ఆ పార్టీలోపలి నుంచే ముప్పు ఎదుర్కొంటుందని.. ప్రభుత్వ పతనానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అండ్‌ కంపెనీ కారణమవుతుందన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఇది పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో అజిత్‌ పవార్‌ చర్య తరహాలో ఉంటుందన్నారు. 2019 మాదిరిగానే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా ‘ఆపరేషన్‌ కమలం’ చర్యల్లో నిమగ్నమైందన్న కాంగ్రెస్ ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు.  2019లో జేడీ(ఎస్)-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టిన వారు మరోసారి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ చేసిన ఆరోపణల్ని సైతం ఆయన తోసిపుచ్చారు. ఆపరేషన్‌ కమలం గురించి భాజపా ఎప్పుడూ మాట్లాడలేదని.. దానికి బదులుగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ‘డ్రామా కంపెనీ’యే అలాంటివి మాట్లాడుతోందన్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ముప్పు ఉందంటూ జార్కిహోళి చేసిన వ్యాఖ్యలపై సిద్ధరామయ్య పైవిధంగా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని