Congress: ‘మోదీ 51 నిమిషాల ప్రసంగంలో.. 44 సార్లు కాంగ్రెస్‌ పేరు’

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(Modi) చేసిన విమర్శలపై కాంగ్రెస్(Congress) స్పందించింది. ఆయన విమర్శలను చూస్తుంటే.. భాజపా పాలిత రాష్ట్రంలో అభివృద్ధే జరిగినట్లు కనిపించడం లేదని వ్యాఖ్యలు చేసింది. 

Published : 26 Sep 2023 18:00 IST

దిల్లీ: కొద్దినెలల్లో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో పర్యటించిన ప్రధాని మోదీ(Modi).. కాంగ్రెస్‌(Congress)పై ధ్వజమెత్తారు. మోదీ ప్రసంగం మొత్తం తమ పార్టీ పేరుతోనే నిండిపోయిందని హస్తం పార్టీ సీనియర్ నేత పవన్‌ ఖేడా(Pawan Khera) విమర్శించారు.

‘ప్రధాని మోదీ తన 51 నిమిషాల ప్రసంగంలో కాంగ్రెస్ పేరును 44 సార్లు ప్రస్తావించారు. 18 ఏళ్లపాటు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలో పదేపదే కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. దానర్థం.. మధ్యప్రదేశ్‌లో ఇన్నేళ్లపాటు మీ ప్రభుత్వం చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించలేదనేగా’ అని విమర్శలు చేశారు.

‘మామ’ మనసులో కుర్చీ టెన్షన్‌.. అసెంబ్లీ సీటుపై సస్పెన్స్‌!

రానున్న అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం భాజపా రెండు విడతల్లో ఇప్పటికే 78 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ ఇంకా ఈ ప్రక్రియను మొదలుపెట్టలేదు. దీనిపై స్పందిస్తూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని, అన్ని చూసుకొని ముందుకు వెళ్తామని ఖేడా అన్నారు. గెలుపు పట్ల ఆందోళనగా ఉన్నవారు ఏం చేస్తారో చూడనివ్వడంటూ వ్యాఖ్యలు చేశారు.

సోమవారం భోపాల్‌లో జరిగిన కార్యకర్త మహాకుంభ్‌ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తుప్పు పట్టిన ఇనుములా మారిపోయిందన్నారు. ‘ఈ రాష్ట్రంలో గత 20 ఏళ్లుగా భాజపా అధికారంలో ఉంది. అంటే ప్రస్తుతం మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువత అదృష్టవశాత్తూ కాంగ్రెస్ పాలనను చూడలేదు’ అంటూ ఎండగట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని