Telangana News: పోలీసు శాఖలో నియామకాలపై సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

పోలీసు ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని డిమాండ్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ లేశారు. పోలీసు నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న అర్హత వయస్సును మరో మూడేళ్ల పెంచుతూ నిర్ణయం తీసుకు....న్న

Published : 18 May 2022 01:29 IST

హైదరాబాద్: పోలీసు ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని డిమాండ్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ లేశారు. కేవలం మూడేళ్ల వయోపరిమితిని పెంచడం ద్వారా నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచాలని డిమాండ్ చేశారు.

‘‘తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, భవిష్యత్తు బంగారమవుతుందని భావించిన యవత.. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొంది. చదువులు పక్కన పెట్టి, విద్యా సంవత్సరాన్ని త్యాగం చేసి భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుని ఉద్యమంలో  భాగస్వామ్యులయ్యారు. తెలంగాణ లక్ష్యం కోసం మొక్కవోని దీక్షతో పోరాటాలు చేసిన నిరుద్యోగులకు గద్దెనెక్కిన కేసీఆర్‌ ప్రభుత్వం అన్నీ మర్చిపోయి ఏమీ చేయలేదు.  నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడంతో ఇప్పుడు ఉద్యోగాల కోసం తిరిగి ఉద్యమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఏనిమిదేళ్లుగా తెరాస ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇటీవల కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన ఉద్యోగ ప్రకటనలో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే వయో పరిమితి పెంచింది. దానిని మరో రెండు సంవత్సరాలు పెంచాల్సిన అవసరం ఉంది. వయోపరిమితి పెంచకుంటే 4లక్షల మంది దరఖాస్తుదారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన యువతకు 5 ఏళ్ల పాటు వయోపరిమితి పెంచాలి. ఓవైపు నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నారో.. లేరో.. తెలియడం లేదు. నిరుద్యోగులు కోరుతున్నట్లు వయో పరిమితి మరో రెండేళ్లు పెంచాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుంది’’ అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని