Revanth reddy: ధరణి నిషేధిత జాబితాలో ఈ భూములు లేవు: రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వం వేల మంది రైతులకు భూములు పంచిపెట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Updated : 12 Jun 2023 20:11 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం వేల మంది రైతులకు భూములు పంచిపెట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మండల వ్యవస్థ వచ్చాక భూరికార్డులన్నీ మండలాలకు బదిలీ అయ్యాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం భూముల వివరాలను పారదర్శకంగా రికార్డు చేసిందని చెప్పారు. డిజిటలైజ్‌ చేసేందుకు భూభారతి పేరుతో పైలట్‌ ప్రాజెక్టును తీసుకొచ్చామన్నారు.

‘‘రంగారెడ్డి జిల్లాలోనే 15 వేల ఎకరాలు భూదాన్‌ భూములు ఉన్నాయి. భూదాన్ భూములన్నీ అసైన్డ్‌ భూములే. భూదాన్‌ భూములను కాపాడాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కలెక్టర్‌కు లేఖ కూడా రాశారు. కందుకూరు మండలం తిమ్మాపూర్‌లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాం. ఆ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు జరగకూడదు. ధరణి నిషేధిత జాబితాలో ఈ భూములు లేవు. అన్నీ తొలగించారు’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

‘‘యాజమాన్యపు హక్కులు లేని వారికి లక్షల ఎకరాలను కాంగ్రెస్ పంచింది. పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు భూ వివరాలు గ్రామంలోనే ఉండేవి. కాంగ్రెస్ పాలనలో పారదర్శకంగా భూ రికార్డులు ఉండేవి. 2004లో కాగితపు రికార్డులు భూ భారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటలైజ్ చేసింది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 23వేల ఎకరాల భూదాన్ భూములున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గ్రామమైన తిమ్మాపూర్‌లో భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతుంటే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? తన గ్రామ భూములపై అప్పట్లో లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? 

రూ.వెయ్యి కోట్ల భూములు కేటీఆర్ అనుచరులు కొట్టేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా భారాస నేతలతో కలిసి తిమ్మాపూర్ భూములను దోచుకుంటున్నారు. కలెక్టర్లని కేటీఆర్ కీలు బొమ్మలుగా మార్చారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టరేట్ల ముందు వేలాది మందు రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధరణి సమస్యలు క్లియర్ కావాలంటే 30శాతం కమిషన్ ఇవ్వాల్సిందే. ధరణి రద్దు చేసి ప్రజలకు ఇబ్బందులు లేని పాలసీ తెస్తామంటే కేసీఆర్‌కి ఏడుపు ఎందుకు? రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో కూడా ధరణి బాధితులు తమ ఆవేదన తెలియజేశారు. కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తుందని, ధరణి రద్దు చేస్తే రైతు బంధు, రైతు బీమా రాదని కేసీఆర్ తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు. ధరణిని రద్దుచేసి ప్రజలకు ఉపయోగపడే నూతన విధానం తెస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ భూములపై విచారణ జరిపిస్తాం’’ అని రేవంత్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని