తెదేపా, జనసేన, భాజపా మధ్య పొత్తు ఖరారు: కనకమేడల

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, భాజపా కలిసి పోటీ చేస్తాయని తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్‌ తెలిపారు.

Updated : 09 Mar 2024 16:08 IST

న్యూదిల్లీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం (TDP), జనసేన (Janasena), భాజపా (BJP) కలిసి పోటీ చేస్తాయని తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్‌ (Kanakamedala Ravindra Kumar) తెలిపారు. భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం మరోసారి భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో సుమారు 50 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో.. ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. సమావేశ వివరాలను  కనకమేడల మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని తెదేపా, భాజపా, జనసేన నిర్ణయించాయని తెలిపారు. 

ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు?

కనకమేడల: ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అందరూ ఒక అవగాహనకు వచ్చారు. ప్రస్తుతం ఎన్డీయేతో పొత్తు ఖరారైంది. తదుపరి కార్యాచరణ ఏంటనేది చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

తెదేపా క్యాడర్‌కు ఏం చెప్పబోతున్నారు?

కనకమేడల: పొత్తుల్లో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో కొన్ని జనసేన, భాజపాలకు వెళ్తాయి. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని అనుకుంటున్నాం. కొంతమందికి ఇబ్బంది వచ్చినా, పార్టీ నాయకత్వం, చంద్రబాబునాయుడు సర్ది చెబుతారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని పంపించేయడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి పొత్తు అవసరమన్న భావన అందరిలోనూ ఉంది. ప్రజలు, పార్టీల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలని చంద్రబాబు కూడా చెప్పారు.

పొత్తు ప్రకటనపై సంయుక్త విలేకరుల సమావేశం ఉంటుందా?

కనకమేడల: లేదు. కేవలం ప్రకటన మాత్రమే చేస్తారు.

సీట్లు త్యాగం చేయడం వల్ల పార్టీలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కదా!

కనకమేడల: అలా ఏమీ లేదు. తాత్కాలికంగా కొంత అంతృప్తి ఉంటుంది. పరిస్థితులు అర్థం చేసుకుని, మసులుకునే నాయకులకు పార్టీ, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించే విధంగా చంద్రబాబు మాట్లాడారు.. ఇంకా మాట్లాడుతున్నారు.

పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలు అని ప్రచారం జరుగుతోంది మీరేమంటారు!

కనకమేడల: ప్రచారం ఏదైనా జరగవచ్చు. కానీ, పార్టీలో మెజార్టీ క్యాడర్‌కు అన్యాయం జరగకుండానే సీట్ల సర్దుబాటు ఉంటుంది. వాళ్ల బలాబలాలు, గెలుపు ప్రాతిపదిక తీసుకుని, మూడు పార్టీలు పొత్తుకు అంగీకరించాయి. దాని బట్టే సీట్ల షేరింగ్‌ ఉంటుంది.

ఎన్డీయేతో పొత్తు అధికారం కోసమా? రాష్ట్ర ప్రయోజనాల కోసమా?

కనకమేడల: అధికారం కోసమైతే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రయోజనాల కోసమే. జగన్మోహన్‌రెడ్డి పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించడమే ప్రధాన ధ్యేయం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడటం కోసమే ఈ పొత్తు.

భాజపా ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదా! మరి ఈ పొత్తు మీకు ఇబ్బంది కలిగించదా?

కనకమేడల: మేము ఉన్నప్పుడు భాజపా నుంచి రాబట్టాల్సినవి చాలానే రాబట్టాం. దీనిపై వ్యాఖ్యలు చేయడం అప్రస్తుతం. సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెబుతాం. ఈ ఐదేళ్లలో జగన్మోహన్‌రెడ్డి అన్నీ పక్కన పడేసి, వ్యక్తిగత స్వలాభం, కేసుల కోసం ఏమీ అడగలేక నిస్సహాయ స్థితిలో నిలబడ్డాడు. అది ఆయన దౌర్భాగ్య స్థితి. దాన్ని మాపై నెట్టడానికి తెదేపా పొత్తుల విషయం మాట్లాడుతున్నారు. గతంలో మేము చేసిన పనులను 2019 నుంచి 2024 మధ్య తిరగదోడారు తప్ప, ఏమీ చేయలేదు. 

ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు!

కనకమేడల: చర్చలు ఫైనలైజ్‌ అయిన తర్వాత వాళ్లకు పోగా, మిగిలిన స్థానాల్లో తెదేపా పోటీ చేస్తుంది. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. వచ్చే సమావేశంలో అన్నీ ఫైనలైజ్‌ అవుతాయి.

సంక్షేమం పథకాలు గెలిపిస్తాయని వైసీపీ అంటోంది!

కనకమేడల: అంత ధైర్య ఉంటే, మా పొత్తుల గురించి వాళ్లెందుకు కంగారు పడుతున్నారు. 24 గంటలూ చంద్రబాబు జపమే చేస్తున్నారు. 20ఏళ్ల కిందట చంద్రబాబు ఏదో అవినీతి చేశారని ఇవాళ పత్రికలో బ్యానర్‌గా వేసుకున్నారు. వాటిపై విచారణ జరిగింది. 26 ఎంక్వైరీ కమిషన్‌లు వేశారు. ఏదీ రుజువు కాలేదు.

ఏయే అంశాలతో ఈ కూటమి ప్రజల మధ్యకు వెళ్తుంది?

కనకమేడల: పార్టీ పరంగా మేము ఇప్పటికే కొన్ని అంశాలను చెప్పాం. కూటమి తరఫున ప్రణాళిక విడుదల చేస్తాం. వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ఈ కూటమి ఐక్యత వెనుక ఉన్న ఉద్దేశం కూడా చెబుతాం. మేము ఏం చేయబోతున్నామో ముందే చెబుతాం. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని కూడా తెలియజేస్తాం.

ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందా?

కనకమేడల: ఆ వివరాలన్నీ తర్వాతి సమావేశంలో చెబుతాం.

సీట్ల పంపకాల విషయంలో తెదేపా హ్యాపీగా ఉందా?

కనకమేడల: భాజపా భారీ డిమాండ్లు పెట్టిందనేది కేవలం ఊహాజనిత వార్తలు. వాటన్నింటికీ  ఈరోజు తెరపడింది. చాలా స్పష్టతతో కూటమి ముందుకు వెళ్తుంది. 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని