తెదేపాకు 17 లోక్‌సభ సీట్లు.. ఇండియా టుడే సర్వే

IndiaToday survey: ఏపీలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటబోతోంది. 17 లోక్‌సభ స్థానాల్లో విజయ దుందుభి మోగించబోతోందని ‘ఇండియా టుడే’ అంచనా వేసింది.

Updated : 08 Feb 2024 18:51 IST

IndiaToday survey | దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు (YSRCP) గట్టి షాక్‌ తగలబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ (TDP) 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకోబోతోంది. వైకాపా 8 స్థానాలకు పరిమితం కానుంది. ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరిట ఇండియాటుడే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను గురువారం వెల్లడించింది. 2023 డిసెంబర్‌ 15 నుంచి జనవరి 28 వరకు సర్వే నిర్వహించినట్లు తెలిపింది.

2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన వైకాపా.. 22 లోక్‌సభ స్థానాలనూ గెలుచుకుంది. తెదేపా 3 స్థానాలకే పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కానున్నాయని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. 45 శాతం ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీ 17 లోక్‌సభ స్థానాలను గెలుచుకోబోతోందని పేర్కొంది. వైకాపా 41 శాతం ఓటింగ్‌తో 8 స్థానాలకు పరిమితం కానుందని తెలిపింది.

ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ ఈసారి 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే పేర్కొంది. 17 లోక్‌సభ స్థానాలకు గానూ భాజపాకు 3, భారాసకు 3, మజ్లిస్‌ 1 సీటు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. గత ఎన్నికల్లో భారాసకు 9, భాజపాకు 4, కాంగ్రెస్‌కు 3, మజ్లిస్‌ ఒక సీటు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తూ ఏడు స్థానాలు పెంచుకోనుందని సర్వే అంచనా వేసింది. భారాసకు భారీగా సీట్లు తగ్గనున్నట్లు తెలిపింది. భాజపా ఒక ఎంపీ సీటు కోల్పోనుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని