WTC Final: ఇదేం అంపైరింగ్‌ తమాషా బాబోయ్‌!

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఫైనల్లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఆటగాళ్లు అప్పీల్‌ చేయకున్నా, సమీక్ష సమయం దాటేసినా మైదానంలోని ఇద్దరు అంపైర్లు బ్యాట్స్‌మన్‌ ఔటయ్యాడా లేదో తెలుసుకొనేందుకు మూడో అంపైర్‌ను సంప్రదించారు. దాంతో ఇదేం అంపైరింగ్‌ తమాషా బాబోయ్‌!....

Published : 21 Jun 2021 01:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఫైనల్లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఆటగాళ్లు అప్పీల్‌ చేయకున్నా, సమీక్ష సమయం దాటేసినా మైదానంలోని ఇద్దరు అంపైర్లు బ్యాట్స్‌మన్‌ ఔటయ్యాడా లేదో తెలుసుకొనేందుకు మూడో అంపైర్‌ను సంప్రదించారు. దాంతో ఇదేం అంపైరింగ్‌ తమాషా బాబోయ్‌! అంటూ కొందరు మాజీ క్రికెటర్లు, అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 40వ ఓవర్‌ను ట్రెంట్‌ బౌల్ట్‌ విసిరాడు. ఆఖరి బంతిని విరాట్‌ కోహ్లీ లెగ్‌సైడ్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి అతడి బ్యాటుకు తగలకుండానే కీపర్‌ చేతుల్లో పడింది. బ్యాటుకు తాకినట్టు స్వల్ప శబ్దం వినిపించడంతో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను బౌల్ట్‌ సంప్రదించాడు. సమీక్ష తీసుకోవాలని కోరాడు. సందిగ్ధంలో ఉన్న కేన్‌ 15 సెకన్ల సమయం ముగిసినా సమీక్ష అడగలేదు.

ఏం జరిగిందో ఏమోగానీ! హఠాత్తుగా మైదానంలోని అంపైర్లు మైకేల్‌ గాఫ్‌, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ చర్చించుకొని మూడో అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బరోను సంప్రదించారు. బ్యాటుకు బంతి తగిలిందో లేదో చూడాలని సమీక్ష కోరారు. దీంతో ఒక్కసారిగా అందరూ గందరగోళంలో పడ్డారు. డీఆర్‌ఎస్‌ అడగకుండానే అంపైర్లు సమీక్ష కోరడమేంటని ఆశ్చర్యపోయారు. వెంటనే విరాట్‌ కోహ్లీ వారివద్దకు వెళ్లి ఇదేంటని ప్రశ్నించాడు. మొత్తంగా సమీక్షలో అతడి బ్యాటుకు బంతి తగల్లేదని తేలింది. టీమ్‌ఇండియా సారథి ఊపిరి పీల్చుకున్నా అడక్కుండానే సమీక్ష తీసుకోవడమేంటని విమర్శలు మొదలయ్యాయి.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని