ధోనీ నుంచే అలా నేర్చుకున్నా: ప్రియమ్‌ గార్గ్‌

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీపై అండర్‌ 19 కెప్టెన్‌ ప్రియమ్‌గార్గ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఒత్తిడి పరిస్థితుల్లోనూ మహీ జట్టును ముందుండి నడిపిస్తాడనే...

Published : 18 Jul 2020 00:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీపై అండర్‌ 19 కెప్టెన్‌ ప్రియమ్‌గార్గ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఎలాంటి ఒత్తిడి పరిస్థితుల్లోనైనా మహీ జట్టును ముందుండి నడిపిస్తాడనే విషయం తెలిసిందే. ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించడమే కాకుండా కీలక సమయాల్లో ఎలా ప్రశాంతంగా ఉండాలో తెలుసు. అలాగే జట్టు సభ్యుల నుంచి అత్యుత్తమ ప్రదర్శన బయటకు తీసుకురావడం కూడా అతనికే చెల్లింది. ఇటీవల ఐసీసీ అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు సారథ్యం వహించిన ప్రియమ్‌.. ధోనీపై అభిమానాన్ని చాటుకున్నాడు. 

‘నేనెప్పుడూ ధోనీ సర్‌‌ను అనుసరిస్తాను. ఆయన నాకు ఆదర్శప్రాయుడు. బ్యాటింగ్‌, కెప్టెన్సీ విషయాల్లో ఆయన అడుగుజాడల్లో నడుస్తా. ఎలాంటి సందర్భంలో అయినా ప్రశాంతంగా ఉండి, పరిస్థితులకు తగ్గట్టు ఆడటం ఆయన నుంచే నేర్చుకున్నా. తన బ్యాటింగ్‌తో పాటు మ్యాచ్‌ను మలుపు తిప్పే కెప్టెన్సీ నిర్ణయాలు, ఫీల్డింగ్‌ సెట్‌ చేయడం లాంటి వీడియోలు చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా’ అని చెప్పాడు. అలాగే మహీ చాలా సందర్భాల్లో జట్టును ఒంటి చేత్తో ఆదుకున్నాడని, ప్రధాన బ్యాట్స్‌మన్‌ ఔటైన ప్రతీసారి ఆ బాధ్యత తనమీద వేసుకొని జట్టును నడిపించాడని ప్రియమ్‌ గుర్తుచేసుకున్నాడు. ఇక కెరీర్‌ ఆరంభంలో పాకిస్థాన్‌ మీద ధోనీ ఆడిన ఇన్నింగ్స్‌ తనకు చాలా ఇష్టమని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని