Afghanistan: అఫ్గాన్‌ వీరులు.. అట్టడుగు నుంచి అద్భుతం దిశగా..

పొరుగు దేశానికి శరణార్థులుగా వెళ్లి క్రికెట్‌ నేర్చుకుని.. పసికూనగా ప్రపంచకప్‌లో అడుగుపెట్టి తమకు ఆట నేర్పిన జట్టుకే షాకిచ్చింది. అట్టడుగు నుంచి అద్భుతం వైపు సాగుతున్న ఆ జట్టు ప్రయాణం స్ఫూర్తిదాయకం. 

Updated : 31 Oct 2023 15:25 IST

ప్రపంచకప్‌లో సూపర్‌ ఆట

1995లోనే ఆ జట్టు క్రికెట్‌ బోర్డు ఏర్పాటైంది. 2015లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌లో ఆడింది. తొలిసారి మెగా టోర్నీలో ఒకే ఒక్క విజయం నమోదు చేసింది. 2019 ప్రపంచకప్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. అలాంటి జట్టు 2023 ప్రపంచకప్‌లో మరోసారి అడుగుపెట్టింది. చిన్నజట్టుగా ముద్రపడ్డ ఆ జట్టు.. మహా అయితే నెదర్లాండ్స్‌ లాంటి కూనపై గెలిచి ఓ విజయం సాధిస్తుందనే అంతా అనుకున్నారు. కానీ ఆ జట్టు అదరగొడుతోంది. అద్భుతమైన పోరాటంతో.. అసాధారణ ప్రదర్శనతో సంచలన విజయాలు సాధిస్తోంది. ప్రపంచకప్‌లో మేటి జట్లకు షాకిస్తూ సెమీస్‌ వైపుగా సాగుతోంది. ఆ జట్టే.. అఫ్గానిస్థాన్‌ (Afghanistan). అట్టడుగు నుంచి అద్భుతం వైపు సాగుతున్న ఆ జట్టు ప్రయాణం స్ఫూర్తిదాయకం. 

అలా మొదలైంది.. 

అఫ్గాన్‌ల క్రికెట్‌ ప్రయాణమే చిత్రంగా ప్రారంభమైంది. పాక్‌కు శరణార్థులుగా వెళ్లిన అఫ్గానిస్థాన్‌ ప్రజలు అక్కడే క్రికెట్‌ ఆడటం మొదలెట్టారు. అక్కడే అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (ACB) ఏర్పాటైంది. స్వదేశానికి వెళ్లాక కూడా అఫ్గానిస్థాన్‌ ప్రజలు క్రికెట్‌ ఆడటం కొనసాగించారు. కానీ అఫ్గానిస్థాన్‌లో క్రికెట్‌పై నిషేధం విధించిన తాలిబన్లు 2000లో మినహాయింపునిచ్చారు. ఆ తర్వాతి ఏడాదే ఐసీసీ సభ్యదేశంగా అఫ్గానిస్థాన్‌ గుర్తింపు పొందింది. వివిధ దేశాల్లోని దేశవాళీ జట్లతో మ్యాచ్‌లతో అఫ్గానిస్థాన్‌ తొలి అడుగులు వేసింది. 2007లో ఏసీసీ టీ20 కప్‌ గెలవడం కీలక మలుపు. 2010లో ఐర్లాండ్‌తో తొలి టీ20 ఆడింది. అదే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఆడింది. 2011 వన్డే ప్రపంచకప్‌ అర్హత టోర్నీలో ఆ జట్టు విఫలమైంది. కానీ వన్డే హోదా సాధించింది. తొలి వన్డేలో స్కాట్లాండ్‌తో తలపడింది. 2015 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఆ జట్టు.. ఆ టోర్నీలో స్కాట్లాండ్‌పై గెలిచింది. అదే ఏడాది జింబాబ్వేపై విజయంతో తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో అడుగుపెట్టింది. 2017లో ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం పొందిందా జట్టు. 2019 ప్రపంచకప్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ ఓడింది. కానీ అదే ఏడాది ఐర్లాండ్‌పై విజయంతో తొలి టెస్టు విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బంగ్లాదేశ్‌నూ టెస్టు మ్యాచ్‌లో చిత్తుచేసింది. 

అదరగొడుతూ.. 

అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్థాన్‌ జట్టు అంచెలంచెలుగా ఎదుగుతోంది. ర్యాంకింగ్స్‌లో టాప్‌-8లో నిలవడం ద్వారా భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది. శ్రీలంక, వెస్టిండీస్‌ లాంటి జట్లు క్వాలిఫయర్స్‌ ఆడాల్సి రాగా.. నేరుగా టోర్నీకి అర్హత సాధించడం అఫ్గానిస్థాన్‌ ప్రతిభకు నిదర్శనం. కానీ ఈ టోర్నీ బరిలో దిగినా అఫ్గానిస్థాన్‌పై పెద్దగా అంచనాల్లేవు. బంగ్లాదేశ్, భారత్‌తో తొలి రెండు మ్యాచ్‌ల్లో అఫ్గాన్‌ ఓడిపోయింది. ఆ తర్వాత డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌. అతి భయంకరంగా ఉన్న ఇంగ్లాండ్‌ను ఆ జట్టు తట్టుకోవడం కష్టమే అనిపించింది. కానీ అనూహ్యం. అద్భుత ప్రదర్శనతో, ఆల్‌రౌండ్‌ ఆటతీరుతో ఇంగ్లాండ్‌పై అఫ్గాన్‌ మొట్టమొదటి విజయంతో షాకిచ్చింది. కానీ ఈ గెలుపు గాలివాటమన్న వాళ్లూ లేకపోలేదు. ఏదో కలిసొచ్చి గెలిచిందన్నారు. కానీ పాక్, శ్రీలంకపై వరుస విజయాలతో అఫ్గాన్‌ వీరులు సత్తాచాటారు. ఇంగ్లాండ్‌పై గెలుపు గాలివాటం కాదని నిరూపించారు. పెద్ద జట్లను ఓడించే సామర్థ్యం ఉందని ప్రపంచానికి తెలిసేలా చేశారు. 

ఒక్కడు కాదు.. 

అఫ్గాన్‌ జట్టు అనగానే వినిపించే పేరు రషీద్‌ ఖాన్‌. ఈ యువ లెగ్‌స్పిన్నర్‌ చిన్న వయసులోనే అమోఘమైన నైపుణ్యాలతో ఎంతో గుర్తింపు పొందాడు. ప్రపంచవ్యాప్తంగా లీగ్‌ల్లో ఆడుతూ అదరగొడుతున్నాడు. అదే అనుభవంతో జాతీయ జట్టు ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక సీనియర్‌ ఆటగాడు మహమ్మద్‌ నబి కూడా జట్టు ప్రగతిలో తనవంతు సాయం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు అఫ్గాన్‌ జట్టు అంటే రషీద్‌, నబి మాత్రమే కాదు. ఇప్పుడా జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. బౌలింగ్‌లో స్పిన్నర్లు ముజీబుర్‌ రెహ్మాన్, నూర్‌ అహ్మద్, పేసర్లు నవీనుల్‌ హక్, ఫజల్‌హక్‌ ఫరూఖీ.. బ్యాటింగ్‌లో గుర్బాజ్, జాద్రాన్, రహ్మత్‌ షా, కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌.. ఇలా మంచి ఆటగాళ్లున్నారు.

ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో గుర్బాజ్, ఇక్రమ్, ముజీబ్, నబి, రషీద్‌ సత్తాచాటారు. పాక్‌తో పోరులో నవీన్, నూర్‌ అహ్మద్, గుర్బాజ్, జాద్రాన్, రహ్మత్‌ షా, హష్మతుల్లా రాణించారు. శ్రీలంకపై ఫరూఖీ, ముబీజ్, రహ్మత్‌ షా, హష్మతుల్లా, అజ్మతుల్లా మెరిశారు. ఇలా జట్టు ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా.. సమష్టిగా సత్తాచాటుతూ అద్భుత విజయాలు సాధిస్తోంది. ఇంగ్లాండ్‌పై మొదట బ్యాటింగ్‌ చేసినా.. పాక్, లంకపై ఛేదనలోనైనా సాధికారిక బ్యాటింగ్, నిలకడైన బౌలింగ్‌తో అఫ్గానిస్థాన్‌ విజయాలు నమోదు చేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన ఆ జట్టు సెమీస్‌పై ఆశతో ఉంది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో వరుసగా నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో ఆడనుంది. వీటిపైనా అసాధారణ ప్రదర్శనతో గెలిచి సెమీస్‌ చేరాలనే లక్ష్యంతో అఫ్గాన్‌ ఉంది. ఒకవేళ సెమీస్‌ చేరకపోయినా ఈ టోర్నీలో ఆ జట్టు ప్రదర్శన కచ్చితంగా అఫ్గాన్‌ క్రికెట్‌ను సరికొత్త శిఖరాల వైపు నడిపించేదే!

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని