Sheetal Devi: కాలితో విల్లు ఎత్తి.. నోటితో నారిని లాగి

ఫొకోమేలియా రుగ్మత కారణంగా రెండు చేతులు పోయినా ఆమె అధైర్యపడలేదు. ఓ వైపు పేదరికం వెంటాడుతున్నా.. పట్టుదలతో విల్లును ఎక్కుపెట్టి పసిడి పతకాలు సాధించిన తొలి పారా ఆర్చర్‌గా నిలిచింది. 

Published : 30 Oct 2023 12:08 IST

ఆర్చరీలో అదరగొడుతున్న శీతల్‌

ఆర్చరీలో రాణించాలంటే ఎంతో ఏకాగ్రత కావాలి.. తీక్షణత ఉండాలి. రెండు చేతులు సరిగా ఉన్నవాళ్లే లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమవుతుంటారు. అలాంటిది రెండు చేతులు లేకుండా బాణాలను వేయాలని ప్రయత్నిస్తే! ఈ ఊహే కష్టంగా అనిపిస్తుంది కదా! కానీ శీతల్‌ దేవి (Sheetal Devi)కి మాత్రం కష్టం కాదు! పైగా ఇష్టం కూడా! అందుకే పారా ఆసియా (Asian Para Games 2022) క్రీడల్లో పసిడితో మెరిసింది ఈ అమ్మాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పతకాలు సాధించింది. ఇందులో రెండు స్వర్ణాలు ఉన్నాయి. ఒకే క్రీడల్లో రెండు పసిడి పతకాలు సాధించిన తొలి భారత పారా ఆర్చర్‌ కూడా శీతలే. 

నిరుపేద కుటుంబంలో పుట్టినా..

జమ్ముకశ్మీర్‌కు చెందిన శీతల్‌ ఫొకోమేలియా అనే రుగ్మత కారణంగా రెండు చేతులూ పోగొట్టుకుంది. తల్లిదండ్రులు మాన్‌సింగ్, శక్తిదేవిలు ఇద్దరూ పనికి వెళ్తేనే ఇళ్లు గడిచేది. తండ్రి మాన్‌ పొలం పనులు చేస్తే.. ఆమె అమ్మ మేకలు కాసేది. ఈ నేపథ్యంలో శీతల్‌ కిస్తావర్‌లోని లౌదర్‌ గ్రామంలో ఆమె లోకంలో ఆమె బతికేది. అలాంటిది అంతర్జాతీయ ఆర్చర్‌ అవుతానని అనుకోలేదు. భారత సైన్యం నిర్వహించిన ఓ క్రీడా ఈవెంట్‌ ఆమెకు వరమైంది. ఆమెలో చురుకుదనం చూసిన భారత సైన్యం.. క్రీడల వైపు ప్రోత్సహించింది. అయితే బాగా చదువుకుని ఉపాధ్యాయురాలు అయి కుటుంబానికి అండగా నిలవాలని శీతల్‌ అనుకునేది. తనకు కృత్రిమ చేతులు ఉంటే జీవితంలో ముందుకు వెళ్లొచ్చని భావించేది కానీ ఎప్పుడూ చేతులు అమర్చుకునే ప్రయత్నం చేయలేదు. చేతులు లేవని అమె ఎప్పుడూ బాధపడేది కాదు.. కాళ్లనే చేతులుగా మలుచుకుని పనులు చేసుకునేది. 

అలా ఆర్చరీ మొదలుపెట్టి

భారత సైన్యం ప్రోత్సహంతో ఆటలపై ఆసక్తిని పెంచుకున్న శీతల్‌ను ఆర్చరీ ఆకర్షించింది. అయితే ఆర్చరీలో రెండు చేతులు ఉంటేనే గురి కుదురుతుంది. అలాంటిది చేతులు లేకుండానే ఆర్చరీ నేర్చుకోవాలన్న తన ఆశలు నెరవేరతాయని అనుకోలేదు. పైగా భయపడింది. అయితే కోచ్‌ వేద్వాన్‌ ప్రోత్సాహంతో ఆర్చరీలో అడుగుపెట్టింది. పారా స్విమ్మర్‌ శరత్‌ గైక్వాడ్‌ కూడా ఆమెకు ధైర్యాన్ని నూరిపోశాడు. తన గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే కట్రా గ్రామానికి వచ్చి సాధన చేసేది. చేతులు లేని తాను ఎలా విల్లు పట్టుకుని బాణాలు వేస్తానో అనుకున్న శీతల్‌.. నెమ్మదిగా అలవాటు చేసుకుంది. ఒక కుర్చీలో కూర్చొని కుడి కాలితో బాణాన్ని పట్టుకుని ఆ తర్వాత కుడి భుజం ఆధారం చేసుకుని నోటితో విల్లు నారిని లాగి లక్ష్యాన్ని చూసి కొట్టేది. దీంతో నెమ్మదిగా భయం స్థానంలో ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగింది. టోర్నీల్లోనూ పాల్గొనడం మొదలుపెట్టింది. రెండు చేతులు ఉన్న ఆర్చర్లతో పోటీపడి గెలిచేది. 

ప్రపంచ ఆర్చరీలో సత్తా చాటి

ఈ జులైలో చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచి రెండు చేతులు లేకుండా ఈ ఘనత సాధించిన తొలి ఆర్చర్‌గా శీతల్‌ రికార్డుల్లో నిలిచింది. ఈ టోర్నీకి ముందు జ్వరం, కడుపు నొప్పి లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా పతకం గెలవడం ఆమె పట్టుదలకు నిదర్శనం. ఫైనల్లోనూ పోరాడినా శీతల్‌ 138-140తో ఒజ్‌నూర (టర్కీ) చేతిలో తలొంచింది. ప్రస్తుతం ఒలింపిక్‌ గోల్డ్‌క్విస్ట్‌ మద్దతుతో షీతల్‌ ఇబ్బంది లేకుండా ఆర్చరీలో కొనసాగుతోంది. టోర్నీ టోర్నీకి మెరుగవుతోంది. 10 మీటర్ల ఇన్నర్‌ సర్కిల్‌లో బాణాలను స్థిరంగా వేస్తోంది. వచ్చే ఏడాది పారిస్‌ పారాలింపిక్స్‌లో పాల్గొని పతకం గెలవాలనేది శీతల్‌ లక్ష్యం. 

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని