Arshdeep Singh: సఫారీ జట్టుపై ఐదు వికెట్లు.. తొలి పేసర్‌గా అర్ష్‌దీప్‌ సింగ్‌ రికార్డు

దక్షిణాఫ్రికాపై (SA vs IND) తొలి వన్డేలో చెలరేగిన భారత పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Published : 17 Dec 2023 17:13 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో (SA vs IND) టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ (5/37) ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. అతడితోపాటు అవేశ్‌ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు. దీంతో సౌతాఫ్రికా 116 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh) అరుదైన ఘనతను సాధించాడు. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి పేసర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు వన్డేల్లో దక్షిణాఫ్రికాపై భారత స్పిన్నర్లే ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. 

అప్పుడు పిచ్‌పై పెద్దగా మూమెంట్‌ లేదు

మ్యాచ్‌ ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సందర్భంగా అర్ష్‌దీప్‌ సింగ్‌ ప్యాడ్‌కాస్ట్‌తో మాట్లాడాడు. ‘‘వన్డేల్లో ఇప్పటి వరకు గొప్ప గణాంకాలు నమోదు చేయలేకపోయా. ఈసారి మాత్రం అద్భుతమైన ఆరంభం దక్కింది. పిచ్‌ నుంచి చాలా సహకారం దొరికింది. మ్యాచ్‌కు  ముందు పిచ్‌ గురించి మాట్లాడుకున్నప్పుడు పెద్దగా మూమెంట్‌ ఉండదని అనుకున్నాం. అనూహ్యంగా బౌలింగ్‌ చేసే సమయంలో స్వింగ్‌కు బాగా అనుకూలంగా మారింది. దీంతో వికెట్‌ టు వికెట్‌ బంతులను సంధిస్తే చాలని భావించాం. అలాగే బౌలింగ్‌ వేయడంతో వికెట్లు దక్కాయి. చాలా రోజుల తర్వాత 50 ఓవర్ల క్రికెట్‌ ఆడా. ఇబ్బంది పడతానేమోనని అనిపించినా.. త్వరగానే కుదురుకున్నా. ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం కొత్త ఉత్సాహాన్నిస్తోంది’’ అని అర్ష్‌దీప్‌ వ్యాఖ్యానించాడు. 

మరికొన్ని విశేషాలు..

  • ఒకే మ్యాచ్‌లో 9 వికెట్లను భారత పేసర్లు తీయడం ఇదే తొలిసారి. అంతకుముందు మొహాలీలో (1993) 8 వికెట్లు, సెంచూరియన్‌లో (2013) 8 వికెట్లను పడగొట్టారు. 
  • దక్షిణాఫ్రికాపై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్లు నలుగురు. ఇప్పుడు అర్ష్‌దీప్‌ కాకుండా.. సునీల్ జోషి (నైరోబి 1999లో) 5/6, చాహల్ (సెంచూరియన్ 2018లో) 5/22, రవీంద్ర జడేజా (కోల్‌కతా 2023లో) 5/33.
  • గతంలో 2018లో సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికా 118 పరుగులకే ఆలౌటైంది. ఇప్పుడు 116 పరుగులకు ఆలౌటై..  అత్యల్ప స్కోరును నమోదు చేసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని