Riyan Parag: దేశవాళీ క్రికెట్‌లో దంచేస్తున్న పరాగ్‌... జాతీయ జట్టులో స్థానం సంపాదిస్తాడా?

ఆటిట్యూడ్‌ ఎక్కువ.. ఆట తక్కువ అంటూ సోషల్‌ మీడియాలో అతణ్ని ట్రోల్‌ చేసినవాళ్లు.. ప్రస్తుతం అతని ఆట తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. దేశవాళీ మ్యాచ్‌ల్లో అదరగొడుతూ.. బ్యాట్‌తో మాత్రమే కాకుండా బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు.

Updated : 01 Nov 2023 13:14 IST

రియాన్‌ పరాగ్‌ (Riyan Parag).. ఈ పేరు వినగానే ఒక విఫలమైన క్రికెటరే గుర్తుకొస్తాడు. ఒక ఐపీఎల్‌ సీజన్లో బాగా ఆడి పేరు తెచ్చుకున్న ఈ అసోం ఆల్‌రౌండర్‌.. ఆ తర్వాత విఫల బాట పట్టి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు. అలాంటి ఆటగాడు వరుసగా 7 అర్ధసెంచరీలు చేస్తే ఎలా ఉంటుంది. అందులోనూ బంతులు వృథా కాకుండా కచ్చితంగా పరుగులు చేయాలనే ఒత్తిడి ఉండే టీ20 ఫార్మాట్లో ఇంతటి స్థిరత్వం చూపిస్తే ఏమనిపిస్తుంది! కానీ పరాగ్‌ ఇదే చేసి చూపించాడు.

టీ20ల్లో వరుసగా మూడు అర్ధసెంచరీలు చేయడమే కష్టం. ఈ ఫార్మాట్లో నిలకడగా ఆడి 50 దాటాలంటే కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలి. అలాంటిది 3 కాదు.. 7 అర్ధసెంచరీలు చేయడమంటే! కచ్చితంగా విశేషమే. 21 ఏళ్ల రియాన్‌ పరాగ్‌ ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు ఒకవైపు ప్రపంచకప్‌లో రికార్డులు బద్దలవుతుంటే ఇటు దేశవాళీలోనూ అతడీ రికార్డు సృష్టించి వార్తల్లోకి వచ్చాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్లో పరాగ్‌ ఈ ఘనత సాధించాడు. ఇప్పటిదాకా ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో అతడు 490 పరుగులు చేశాడంటే పరాగ్‌ జోరు అర్థం చేసుకోవచ్చు. 

9 మ్యాచ్‌ల్లో 8 అర్ధసెంచరీలు

ఆరు మ్యాచ్‌ల్లో 6 అర్ధసెంచరీలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించడమే కాదు.. ఈ సీజన్‌లో దేవధర్‌ ట్రోఫీ, ముస్తాక్‌ అలీ టోర్నీల్లో కలిపి 9 దేశవాళీ మ్యాచ్‌ల్లో 8 సార్లు 50 పరుగులు దాటాడు పరాగ్‌.. ఇందులో ఓ మెరుపు సెంచరీ కూడా ఉంది. 193 స్టైక్‌రేట్‌తో పరాగ్‌ పరుగులు చేశాడు. ముస్తాక్‌అలీ టోర్నీలో వరుసగా బిహార్, సర్వీసెస్, సిక్కిం, చండీగఢ్, హిమాచల్‌ప్రదేశ్‌పై అర్ధసెంచరీలు చేసి... వీరేంద్ర సెహ్వాగ్, డెవోన్‌ కాన్వే, వార్నర్, మసకద్జ, కమ్రాన్‌ అక్మల్, బట్లర్‌ సరసన నిలిచిన పరాగ్‌.. కేరళపై అజేయంగా 57 పరుగులు సాధించి ఈ కొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ముస్తాక్‌ అలీ టోర్నమెంట్లో అతడే టాప్‌ స్కోరర్‌. ఈ టోర్నీకి ముందు దేవధర్‌ ట్రోఫీలో పరాగ్‌ జోరుకు పునాది పడింది. చెత్త షాట్లను పక్కనపెట్టి తెలివిగా ఆడడం మొదలుపెట్టిన ఈ కుర్రాడు.. కుదురుకున్నాక పరుగుల వరద పారించాడు. 

ఐపీఎల్‌లో చెత్తగా ఆడినా..

2023 ఐపీఎల్‌ సీజన్లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతూ దారుణంగా విఫలమయ్యాడు పరాగ్‌. 7 మ్యాచ్‌లు ఆడి 78 పరుగులే చేశాడు. దీంతో ఆటిట్యూడ్‌ ఎక్కువ.. ఆట తక్కువ అంటూ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకవైపు వరుస వైఫల్యాలు. మరోవైపు విమర్శలు ఈ కుర్రాడిలో నిరాశను నింపాయి. సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ఈ విమర్శలు తననెంతో బాధపెట్టాయని బాహాటంగానే బాధను ప్రదర్శించాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని వదులుకోవడం ఖాయం అనే మాటలు కూడా పడ్డాడు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలోనూ పరాగ్‌ మళ్లీ పుంజుకున్నాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టిన అతడు లోపాలు దిద్దుకుని దేశవాళీ పోటీల్లో దిగాడు. నెమ్మదిగా ఈ అసోం కుర్రాడు ఫామ్‌ అందుకున్నాడు. దేశవాళీ మ్యాచ్‌ల్లో అదరగొడుతున్నాడు. కేవలం బ్యాటింగ్‌లోనే మాత్రమే కాదు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు.

ముస్తాక్‌అలీ టోర్నీలో సర్వీసెస్‌పై 9 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు. ఇప్పటిదాకా 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీకి ముందు దేవధర్‌ ట్రోఫీలో ఈస్ట్‌జోన్‌కు ఆడుతూ 354 పరుగులు, 11 వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌గా నిలిచాడు పరాగ్‌. వెస్ట్‌జోన్‌తో మ్యాచ్‌లో 68 బంతుల్లోనే అజేయంగా 105 పరుగులు చేసి సత్తా చాటాడు. తాజా ప్రదర్శనలతో పరాగ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ను ఆలోచనలో పడేయడమే కాదు... భారత సెలక్టర్ల దృష్టిలో కూడా పడ్డాడు. ఈ జోరు ప్రదర్శిస్తే ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ని మున్ముందు టీ20 సిరీస్‌లో భారత జట్టులో చూడొచ్చు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని