Mohsin Naqvi - BCCI: ఒకట్రెండు రోజుల్లో ఆసియా కప్‌ ట్రోఫీ భారత్‌కు.. : బీసీసీఐ

Eenadu icon
By Sports News Team Published : 01 Nov 2025 00:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా క్రికెట్‌  కౌన్సిల్‌ చీఫ్‌ నఖ్వీ ఒకటి లేదా రెండు రోజుల్లో ఆసియా కప్‌ (Asia Cup) ట్రోఫీని భారత్‌కు అప్పగించే అవకాశముందని బీసీసీఐ (BCCI) ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా (Team India)  విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు నెలరోజులు గడుస్తున్నా.. ఇంకా ట్రోఫీ, మెడల్స్‌ను అందించకపోవడంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్‌ సైకియా అసంతృప్తి వ్యక్తం చేశారు. నవంబర్‌ 4న ఐసీసీ త్రైమాసిక సమావేశం జరగనుంది. ఈలోగా నఖ్వీ.. ఆ ట్రోఫీని భారత్‌కు అప్పగించాలని, లేకపోతే ఈ విషయాన్ని ఐసీసీ (ICC) దృష్టికి తీసుకువెళతామని ఆయన హెచ్చరించారు. 

‘దాదాపు నెల గడుస్తున్నా.. ఇప్పటికీ ఆసియా ట్రోఫీని మాకు అందించలేదు. ఇది సరికాదు’ అని సైకియా ఓ న్యూస్‌ ఏజెన్సీతో అన్నారు. అలాగే ట్రోఫీ విషయమై ఏసీసీకి లేఖ పంపిన విషయాన్నీ ధ్రువీకరించారు. అయితే దానికి బదులుగా నఖ్వీ.. ఏసీసీ కార్యాలయంలోనే ట్రోఫీని తీసుకోవాలని బదులిచ్చినట్లు తెలిపారు. ‘మేం ఏసీసీ ఛైర్మన్‌కు ఆసియా కప్‌ ట్రోఫీ విషయమై లేఖ పంపాం. అయినా పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. ట్రోఫీ ఇప్పటికీ వారి స్వాధీనంలోనే ఉంది. ఒకట్రెండు రోజుల్లో తప్పకుండా అది ముంబయిలోని బీసీసీఐ కార్యాలయానికి వస్తుంది’ అని సైకియా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆసియా కప్‌లో భారత్‌ మొత్తంగా మూడుసార్లు పాకిస్థాన్‌తో తలపడితే, అన్ని మ్యాచ్‌లనూ టీమ్‌ఇండియా గెలిచింది. ఫైనల్‌లోనూ పాక్‌పై నెగ్గి ట్రోఫీని కైవసం చేసుకుంది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు.. పాక్‌ క్రికెటర్లతో కరచాలనానికి ఆసక్తి చూపని విషయం తెలిసిందే. అలాగే పాకిస్థాన్‌కు చెందిన ఏసీసీ చీఫ్‌ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికీ ఇష్టపడలేదు. అయితే ఆ ట్రోఫీని మరొకరి చేతుల మీదుగా భారత జట్టుకు అందించకుండా.. నఖ్వీ పిల్ల చేష్టలకు పాల్పడ్డాడు. ట్రోఫీ, మెడల్స్‌ను మైదానం నుంచి తనతోపాటు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాటిని ఆసియా కప్‌ విజేతగా నిలిచిన టీమ్‌ఇండియాకు అందించకుండా నఖ్వీ.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు