IND vs SL: టీమ్‌ఇండియా ఆటగాళ్ల జెర్సీపై ఈ మార్పు గమనించారా?

శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా యుజ్వేంద్ర చాహల్‌(Yuzvendra chahal) పోస్ట్‌ చేసిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. 

Updated : 03 Jan 2023 16:57 IST

ముంబయి: శ్రీలంకతో టీ20 సిరీస్‌(IND vs SL) ముంగిట సామాజిక మాధ్యమాల్లో టీమ్‌ఇండియా క్రికెటర్లకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో  సహచర ఆటగాళ్లతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను పంచుకున్నాడు. ఆటగాళ్లు ధరించిన జెర్సీలపై ఓ చిన్న మార్పును అభిమానులు గుర్తించారు. కుడి వైపున ఉండే స్ఫాన్సర్‌షిప్‌ లోగో మారినట్టుగా ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. మంగళవారం బీసీసీఐ పంచుకున్న ఓ వీడియోలో సైతం ఆటగాళ్ల జెర్సీపై ఎంపీఎల్‌కు బదులుగా ‘కిల్లర్‌’ అనే లోగో ఉంది. దీనిని బట్టి ఆటగాళ్ల కిట్‌ స్పాన్సర్‌షిప్‌ మారినట్టుగా తెలుస్తోంది. కానీ, దీనిపై ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. 

టీమ్‌ఇండియా(Team India) జెర్సీకి ప్రధాన స్పాన్సర్లలో బైజూస్‌, ఎంపీఎల్‌ కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ రెండు సంస్థలు ఈ ఒప్పందాల నుంచి వైదొలగనున్నాయని గతేడాది డిసెంబర్‌లోనే వార్తలు వచ్చాయి. కేకేసీఎల్‌ అనే సంస్థకు కిట్‌, మర్చండైజ్‌ హక్కులను బదిలీ చేయాలని ఎంపీఎల్‌ భావించింది. 2023 నవంబర్‌ నెల వరకూ స్పాన్సర్‌గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకున్న బైజూస్‌ కొంతకాలానికే దానిని ఉపసంహరించుకోవాలని అనుకుంది. ఈ విషయంపై బీసీసీఐతో ఈ రెండు సంస్థలు చర్చలు కూడా జరిపాయి. కానీ, 2023 వరకూ స్పాన్సర్లుగా కొనసాగాలని బీసీసీఐ అప్పుడు వారిని కోరినట్టుగా సమాచారం. తాజాగా జెర్సీపై లోగో మారడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమవుతోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని