Chennai vs Hyderabad: హైదరాబాద్‌కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై

ఐపీఎల్‌ 2024లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్‌లో హైదరాబాద్‌ను పరుగులకే కట్టడి చేసింది.  

Updated : 28 Apr 2024 23:57 IST

చెన్నై: చెపాక్‌లో చెన్నై జట్టు అదరగొట్టింది. హైదరాబాద్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆ జట్టులో మార్‌క్రమ్‌ (32; 26 బంతుల్లో 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. ట్రావిస్‌ హెడ్‌ (13), అభిషేక్‌ శర్మ (15), అన్మోల్‌ప్రీత్‌సింగ్‌ (0), నితీశ్‌ రెడ్డి (15), క్లాసెన్‌ (20) సమద్‌ (19) తీవ్ర నిరాశ పరిచారు. చెన్నై బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండే (4/22) టాపార్డర్‌ను దెబ్బతీశాడు. పతిరన, ముస్తాఫిజుర్‌ చెరో రెండు వికెట్లు తీయగా, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన  నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. డారిల్ మిచెల్ (52; 32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకం బాదాడు. శివమ్‌ దూబె (39*; 20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ (5*; 2 బంతుల్లో) ఒక ఫోర్ బాదాడు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్, జయ్‌దేవ్ ఉనద్కత్ తలో వికెట్ పడగొట్టారు.

మ్యాచ్‌ విశేషాలు

  • త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్న రుతురాజ్ గైక్వాడ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. 

  • ఈ మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు డారిల్ మిచెల్ ఐదు క్యాచ్‌లు అందుకున్నాడు. అతనికంటే ముందు మహ్మద్‌ నబీ (2021) మాత్రమే ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించాడు.
  • ఐపీఎల్‌లో ఆటగాడిగా ధోనీకిది 150వ విజయం. ఈ రికార్డు సాధించిన తొలి ఆటగాడు కూడా ధోనీనే. 
  • చెపాక్‌ స్టేడియంలో చెన్నైకిది 50వ విజయం. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని