Cricket in Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్‌ వచ్చేసింది... ఇక సందడే సందడి!

ప్రపంచంలో ఆదరణ ఉన్న రెండో అతి పెద్ద క్రీడగా నిలిచిన క్రికెట్‌ను ఒలింపిక్స్‌ ఈవెంట్లో చేరుస్తూ ఐవోసీ నిర్ణయం తీసుకుంది. 2028 లాస్‌ ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌లో టీ20 టోర్నీ నిర్వహించనున్నారు.

Updated : 13 Oct 2023 15:58 IST

నాలుగేళ్లకు ఒకసారి జరిగే విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌ (Olympics) అంటే అభిమానుల్లో అంచనాలు.. ఆసక్తి పతక స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా భారత అథ్లెట్లు బరిలో దిగుతున్నప్పుడు ఫ్యాన్స్‌ కళ్లన్నీ వారిపైనే. అలాంటిది ఈ క్రీడల్లో క్రికెట్‌ (Cricket)ను చేరిస్తే!! వినడానికే చాలా థ్రిల్లింగా ఉంది కదా! 2028 లాస్‌ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌ (2028 Los Angeles Olympics)లో ఇది నిజం కాబోతోంది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2028 ఈవెంట్‌లో టీ20 టోర్నీ నిర్వహించనున్నారు.

క్రికెట్‌.. ఎంతో పురాతనమైన ఆట.. మరెంతో ప్రాచుర్యంలో ఉన్న క్రీడ. కేవలం టెస్టులాడే పది దేశాల్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న గేమ్‌ ఇది. దీనిని ఒలింపిక్స్‌లో చేర్చడం అంటే... క్రికెట్‌ ప్రేమికులకు పెద్ద శుభవార్తే. ఇన్నాళ్లూ ఒలిపింక్స్‌లో క్రికెట్‌ను ఎందుకు చేర్చలేదా? అని మదనపడుతున్న అభిమానులు.. తాజా వార్తతో ఉబ్బితబ్బిబవుతున్నారు.

ఎంత క్రేజ్‌ ఉన్నా..

క్రికెట్‌ అంటే ఉర్రూతలూగిపోతారు చాలా దేశాల్లోని అభిమానులు. ముఖ్యంగా ఆసియా ఖండ దేశాల్లో క్రికెట్‌ను ఓ మతంగానే భావిస్తారు. అమెరికాతో పాటు యూరోప్‌లోని చాలా దేశాల్లో క్రికెట్‌ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఫుట్‌బాల్‌ను మాత్రమే చూసిన అక్కడి అభిమానులు ఇప్పుడు క్రికెట్‌ వైపు కన్నేస్తున్నారు. ఇక బ్రిటన్‌, ఆస్ట్రేలియా, ఆఫ్రికాల్లో క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఫుట్‌బాల్, టెన్నిస్‌నే ఎక్కువగా ఆదరించే ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, చిలీ, పోర్చుగల్‌ లాంటి ఐరోపా దేశాల్లో ఇప్పుడు క్రికెట్‌ సీరియస్‌ క్రీడగా మారింది. ఏదో సరదాగా ఆడడం కాదు. క్వాలిఫయింగ్‌ టోర్నీల్లోనూ ఆయా దేశాల జట్లు ఆడుతున్నాయి. దీంతో ప్రపంచంలో ఆదరణ ఉన్న రెండో అతి పెద్ద క్రీడగా క్రికెట్‌ నిలిచింది.

కానీ ఒలింపిక్స్‌ లాంటి మెగా ఈవెంట్లో గత వందేళ్లలో క్రికెట్‌కు ఒక్కసారి మాత్రమే స్థానం దక్కడం ఆశ్చర్యం. ఒలింపిక్స్‌ ముంగిట ప్రతిసారీ ప్రతిపాదనలు చేయడం అక్కడితోనే ఆగిపోవడం జరుగుతుంది. చివరగా 1900 పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడారు. అంటే 128 ఏళ్ల క్రితం. ఆ తర్వాతి నుంచి ఈ ఆటను పక్కనపెట్టేశారు. కానీ లాస్‌ఏంజిల్స్‌లో జరిగే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ మళ్లీ పునరాగమనం చేయడానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకి ఉన్న క్రేజ్‌ని గుర్తించిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (IOC) క్రికెట్‌ ఆటను ఈ క్రీడల్లో చేర్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

ఆసియా క్రీడలే తొలి అడుగు

ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా హాంగ్‌జౌలో క్రికెట్‌ను నిర్వహించారు. పురుషులు, మహిళలకు టీ20 ఫార్మాట్లో పోటీలు పెట్టారు. ఒలింపిక్స్‌ తర్వాత అంతటి పెద్ద ఈవెంట్‌ అయిన ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చడంతో ఒలింపిక్స్‌లోనూ ఈ ఆటను ఆడించేందుకు మార్గం సుగమమైంది. కామన్వెల్త్‌ క్రీడల్లోనే గతంలో పురుషుల క్రికెట్‌ ఆడించారు. గతేడాది జరిగిన క్రీడల్లో మహిళలకు కూడా పోటీలు పెట్టారు. క్రికెట్‌ అనగానే సుదీర్ఘమైన ఆట.. చాలారోజులు నిర్వహించాలి.. మైదానాలను సిద్ధం చేయాలి అనే భావన ఉంది. దీంతో ఐరోపా దేశాలు దీనిపై పెద్దగా ఆసక్తి కనబరచకపోవడంతో ఒలిపింక్స్‌లో ఈ ఆటను ఇన్నాళ్లూ పరిగణనలోకి తీసుకోలేదు. కానీ విపరీతమైన జనాదరణ ఉన్న క్రికెట్‌ను 2028 క్రీడల్లో చేరిస్తే ఈ క్రీడల విలువ ఎన్నో రెట్లు పెరుగుతుందని నిర్వాహకులు ఎట్టకేలకు నమ్మారు.

ప్రసార హక్కులకు రెక్కలు

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం ద్వారా భారత్‌లో ప్రసార హక్కుల నుంచి భారీగా సొమ్ము రాబట్టాలని కూడా అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ భావించినట్లు సమాచారం. ప్రస్తుతం ఒలింపిక్స్‌ ప్రసార హక్కుల వేలం ద్వారా రూ.158 కోట్ల వరకు ఐవోసీ ఆర్జిస్తోంది. అయితే క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడంతో ప్రసార హక్కుల విలువ భారీగా పెరిగిపోనుంది. సుమారు రూ.15 వేల కోట్లు కేవలం ప్రసార హక్కుల ద్వారానే ఐవోసీకి లభించనున్నాయని అంచనా. దీన్ని బట్టే క్రికెట్‌ విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ప్రసార హక్కులే కాదు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో అభిమానుల వీక్షణ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఈ సమీకరణాలన్నిటిని పరిగణనలోకి తీసుకునే క్రికెట్‌ను ఒలింపిక్స్‌ చేర్చిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు