Dhoni and Jadeja: ధోనీతో నీ బంధం సూపర్‌ ‘సర్‌’..!

జడేజా రేసుగుర్రం లాంటోడు.. దూకుడెక్కువ.. మరోవైపు మిన్ను విరిగి మీదపడినా చలించని తత్వం ధోనీది. భారతీయ క్రికెట్‌లో వీరిద్దరి అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఎన్ని వివాదాలు వచ్చినా జడ్డూను మహేంద్రుడు వెనుకేసుకొచ్చాడు. ధోని కోసం ఎంత కఠిన పోరాటమైనా చేసేందుకు రవీంద్రుడు వెనుకాడలేదు.

Published : 30 May 2023 15:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ధోనీ ఓ భావోద్వేగం.. ఇది ఐపీఎల్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో ఈ నెల 27వ తేదీన చేసిన ఓ పోస్టు సారాశం. నిజమే.. భారత క్రికెట్‌లో ప్రతిభను గుర్తించి చేరదీయడం.. అటగాళ్లను ప్రోత్సహించడంలో ధోనీ శైలే వేరు. కోహ్లీ, రోహిత్‌లు అతడి నీడన ఎదిగామని చెప్పేందుకు ఏమాత్రం సంకోచించరు. ఇక జడేజా అయితే తన కెరీర్‌ గురించి ఇటీవల చెబుతూ..‘‘నా క్రికెట్‌ ప్రయాణం ఇద్దరు మహేంద్రుల మధ్యలోనే జరిగింది’’ అని పేర్కొన్నాడు. వీరిలో ఒకరు కోచ్‌ మహేంద్ర సింగ్ చౌహాన్‌ కాగా.. మరొకరు ధోనీ..! జడేజా కెరీర్‌ను ఎంఎస్‌డీ అంతగా ప్రభావితం చేశాడు. జడ్డూ చిక్కుల్లో పడ్డ ప్రతి సారీ ధోనీ అతడికి ఏదో రకంగా అండగా ఉంటూ వచ్చాడు. తాజాగా అద్భుతమైన ఫోర్‌తో చెన్నైకి ఐపీఎల్‌ అందించిన అనంతరం జడ్డూ మాట్లాడుతూ.. ఈ కప్‌ను ధోనీకి అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. గతంలో 2011 ప్రపంచకప్‌ సమయంలో టీమ్‌ఇండియా లెజెండ్‌ సచిన్‌ కోసం కప్‌ సాధించామని యువరాజ్‌ సింగ్‌ చెప్పిన సన్నివేశాన్ని ఇది గుర్తుచేసింది. 

‘సెయింట్‌ లూసియా ఘటన’ తర్వాత అండగా.. 

2009లో జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2010లో భారత్‌ టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయి.. టోర్ని నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి తర్వాత కొన్ని గంటల్లో ఆరుగురు భారత క్రికెటర్లతో కలిసి జడేజా శ్రీలంకలోని సెయింట్‌ లూసియా పబ్‌కు వెళ్లాడు. అక్కడ వారికి కొందరు అభిమానులతో గొడవ జరిగింది. ఈ విషయం వివాదాస్పదమైంది. దీంతో బీసీసీఐ నుంచి జడ్డూ షోకాజ్‌ నోటీస్‌ అందుకొన్నాడు. కెరీర్‌ ప్రారంభంలోనే ఇటువంటి ఘటనలో ఇరుక్కోవడం అతడికి ఇబ్బందికరంగా మారింది. అటువంటి పరిస్థితుల్లో ధోనీ నుంచి అతడికి పూర్తి మద్దతు లభించింది. ఒక క్షమాపణ లేఖతో వివాదం సద్దుమణిగేట్లు చూశాడు. నాటి బీసీసీఐ కార్యదర్శి ఎన్‌.శ్రీనివాసన్‌ సీఎస్‌కే యజమాని కావడం గమనార్హం.

ఐపీఎల్‌లో అండగా..

ఐపీఎల్‌ కెరీర్‌ ప్రారంభంలో జడ్డూ రాజస్థాన్‌ జట్టు తరపున ఆడాడు. అతడు 2010లో కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించడంతో ఐపీఎల్‌ నుంచి ఏడాది దూరంగా ఉండాల్సివచ్చింది. 2011లో కొచ్చి జట్టు అతడిని కొనుగోలు చేసింది... కానీ, అదే ఏడాది ఆ జట్టును ఐపీఎల్‌ నుంచి రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో జడేజా మళ్లీ వేలంకు వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే ధోనీ నేతృత్వంలో అంతర్జాతీయ జట్లలో ఆడుతున్న అతడిని సీఎస్‌కే భారీ మొత్తం చెల్లించి దక్కించుకొంది. ఈ క్రమంలో వేలంలో డెక్కన్‌ ఛార్జర్స్‌తో పోటీపడింది. నాటి నుంచి చెన్నైలోనే జడ్డూ ఐపీఎల్‌ ప్రస్థానం కొనసాగింది. 
2022లో ధోనీ నుంచి నాయకత్వ బాధ్యతలు కూడా అందుకొన్నాడు. కెప్టెన్సీ వహించిన ఎనిమిది మ్యాచ్‌ల్లో వరుసగా నాలుగు ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా అతడి బ్యాటింగ్‌ కూడా దెబ్బతింది. పక్కటెముకల గాయం కారణమని చెబుతూ జడేజా టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో 9వ మ్యాచ్‌ నాటికి మహీ మరోసారి కెప్టెన్సీ భారం తలకెత్తుకొన్నాడు. కానీ, సీఎస్‌కే పరిస్థితి మారలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు జడేజా.. సీఎస్‌కే సోషల్‌ మీడియా ఖాతాను అన్‌ఫాలో చేశాడు. ఎల్లో జెర్సీతో ఉన్న ఫొటోలను కూడా డిలీట్‌ చేశాడు. దీంతో ధోనీ-జడ్డూ మధ్య బంధం బీటలు వారిందని భారీగా ప్రచారం జరిగింది. అప్పటికే సీఎస్‌కే యాజమాన్యంతో పొసగక సురేష్‌ రైనా కూడా జట్టు నుంచి వైదొలిగాడు. దీంతో జడ్డూ కూడా అదే బాట పడతాడని ఫ్యాన్స్‌ అనుకొన్నారు. కానీ, ఆశ్చర్యకరంగా 2022 నవంబర్‌లో తాను చెన్నైకి ఆడుతున్నట్లు జడేజా ట్విటర్‌లో ప్రకటించాడు. దీంతోపాటు ధోనీకి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్న ఫొటోను షేర్‌ చేశాడు.

‘సర్‌’ బిరుదు వెనుక ధోనీ..!

అభిమానులు జడ్డూ పేరుకు ముందు ‘సర్‌’ అని గౌరవ వాచకాన్ని తగిలిస్తారు. తొలిసారి స్వయంగా ధోనీనే జడ్డూకు ఈ బిరుదును ఇచ్చాడు. దీని వెనుక ఓ ఆసక్తికరమైన ఘటన ఉంది. 2013లో ఐపీఎల్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే జట్టు విజయం కోసం ఒక్క బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ఉన్న జడ్డూ ఆర్సీబీ బౌలర్‌ ఆర్‌పీ సింగ్‌ వేసిన షార్ట్‌పిచ్‌ వైడ్‌ బంతిని కొట్టి పరుగు తీశాడు. కానీ, థర్డ్‌మ్యాన్‌ పొజిషన్‌లోని ఫీల్డర్‌ రామ్‌పాల్‌ క్యాచ్‌ అందుకొన్నాడు. వికెట్‌ దక్కిందని కోహ్లీ సంబరాలు మొదలుపెట్టాడు. అంతలోనే అంపైర్‌ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. నోబాల్‌ (1) + ఒక పరుగు తీయడంతో సీఎస్కే ఒక బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ సందర్భంగా జడేజాను పొగడ్తలతో ముంచెత్తుతూ ధోనీ వరుసగా ట్వీట్లు చేశాడు. ‘‘మీరు సర్‌ జడేజాను ఒక బంతికి రెండు పరుగులు చేయమంటే.. అతడు ఒక బంతి మిగిలి ఉండగానే గెలిపిస్తాడు’’ అని పేర్కొన్నాడు. అంతేకాదు.. రజనీ సర్‌ (రజనీకాంత్‌) ఎప్పుడైనా ‘సర్‌ జడేజా’ బౌలింగ్‌ను ఎదుర్కోవాల్సి వస్తే.. ఆ సమరాన్ని ‘క్లాష్‌ ఆఫ్‌ టైటాన్స్‌’ అని పిలుస్తారు’’ అని మరో ట్వీట్‌ చేశాడు. అప్పటి నుంచి ‘సర్‌ రవీంద్ర జడేజా’గా పేరు పాపులర్‌ అయింది. 

టీకప్పులో తుపాను..

2023 ఐపీఎల్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ధోనీ-జడేజా మధ్య మైదానంలో వాగ్వాదం జరిగింది. అంతకు ముందు రోజే జడ్డూ ‘కర్మ’ ట్వీట్‌ను పోస్టు చేశాడు.  మరోవైపు జడ్డూ భార్య రివాబా కూడా ‘నీ సొంత మార్గంలో వెళ్లు’  అంటూ ఆ పోస్టుపై కామెంట్‌ చేసింది. ఈ పరిణామాలు అభిమానుల్లో అనుమానాలు పెంచాయి. ఆ తర్వాత కూడా తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ సందర్భంగా సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ స్వయంగా మైదానం వద్దకు వచ్చి జడ్డూతో ఏదో మాట్లాడి ప్రోత్సహించి వెళ్లాడు. మళ్లీ 2022 పరిస్థితి పునరావృతం అవుతోందా..? అని అభిమానులు ఆందోళన చెందారు. కానీ, ఇవన్నీ కేవలం ఊహాగానాలే అని జడ్డూ ఫైనల్‌లో తేల్చేశాడు. కష్టకాలంలో గిల్‌ను జడ్డూ అవుట్‌ చేయడంతో పాటు చివరి ఓవర్‌లో సాహసోపేతమైన షాట్లతో చెన్నైకు ఐదోసారి ఐపీఎల్‌ కప్‌ అందించాడు. మ్యాచ్‌ అనంతరం భావోద్వేగానికి గురైన ధోనీ.. జడ్డూను ఏకంగా గాల్లోకి ఎత్తేశాడు. ఈ కప్‌ను ధోనీకి అంకితం చేస్తున్నామని జడ్డూ పోస్ట్‌మ్యాచ్‌ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మరోవైపు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఐపీఎల్‌ ట్రోఫీని జడ్డూ భార్యా రివాబా ఒడిలో పెట్టి మరీ ఫొటో దిగాడు. అదీ ధోనీ-జడ్డూ బంధం. ఈ బంధానికి గుర్తుగా జడ్డూ ఇన్‌స్టాలో ‘ధోనీ-జడ్డూ మూమెంట్‌’ ప్రొఫైల్‌పిక్‌గా వెలిసింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని