FIFA: ప్రపంచ పెద్దన్న గుండె బద్దలు కొట్టిన లాస్ట్‌మినిట్‌ గోల్‌..!

1982లో నాటి ప్రపంచ శక్తి సోవియట్‌కు వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లోనే పరాభవం వెక్కిరించింది. మ్యాచ్‌ డ్రా చేసేందుకు అది చేసిన యత్నాలను బ్రెజిల్‌ ఆటగాడు చివరి క్షణాల్లో వమ్ముచేశాడు.   

Updated : 24 Nov 2022 17:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 1982 నాటికి ప్రపంచంలో ఇద్దరు పెద్దన్నలు మిగిలారు. అమెరికా, సోవియట్‌ యూనియన్‌. ఆయుధాల్లోనే కాదు.. ఆటల్లోనూ రారాజులుగా నిలుస్తూ వచ్చారు. క్రీడల్లో సోవియట్‌ కూడా తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి రుచిచూపిస్తున్న రోజులవి. కానీ, ఆ ఏడాది జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో మొదట్లోనే సోవియట్‌కు గర్వభంగం జరిగింది. 1982 జూన్‌ 13న ప్రపంచకప్‌ మొదలైంది. 14వ తేదీన గ్రూప్‌-6లో బ్రెజిల్‌ - సోవియట్‌ యూనియన్‌ తలపడ్డాయి. బ్రెజిల్‌ అప్పటికే మూడుసార్లు (1958, 1962, 1970)ల్లో ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో సోవియట్‌తో జరిగిన తొలి మ్యాచ్ మొదటి నుంచి హోరాహోరీగా సాగింది. సోవియట్‌ ఆటగాడు ఆండ్రీ బల్‌..  మ్యాచ్‌ 35వ నిమిషంలోనే గోల్‌ సాధించి జట్టుకు ఆధిక్యం అందించాడు. దీంతో బ్రెజిల్‌ జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. రష్యన్లు గోల్‌పోస్టుకు అడ్డుగోడవలే నిలిచారు. తొలి అర్ధ భాగంలో బ్రెజిల్‌కు ఎలాంటి గోల్‌ లభించలేదు. ఇక మ్యాచ్‌ 76వ నిమిషంలో స్కార్టెస్‌ అద్భుతమైన గోల్‌ను అందించడంతో బ్రెజిల్‌ స్కోర్‌ను సమం చేసింది. అక్కడి నుంచి అధిపత్యం కోసం హోరాహోరీ పోరు మొదలైంది. 

మ్యాచ్‌ రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా.. బ్రెజిల్‌ మైండ్‌గేమ్‌ మొదలుపెట్టింది. ఇక్కడ బ్రెజిల్‌ ఆటగాడికి అందిన బంతి వెంటనే సోవియట్‌ క్రీడాకారుడి ఆధీనంలోకి వెళ్లింది. అక్కడి నుంచి ఓ బ్రెజిల్‌ ఆటగాడు బంతిని అందిపుచ్చుకొని ఫాల్కావోకు అందేలా షాట్‌ కొట్టాడు. కానీ, అక్కడే ఫాల్కావో తెలివిగా తన కాళ్ల మధ్య నుంచి బంతిని వదిలేశాడు. మరో బ్రెజిల్‌ ఆటగాడు ఎడెర్‌ అలెక్సియో దానిని దొరకబుచ్చుకొని దాదాపు 25 మీటర్ల దూరం నుంచి సూటిగా గోల్‌పోస్టులోకి కొట్టాడు. కళ్లు చెదిరేలా ఉన్న ఈ షాట్‌ కొట్టే సమయంలో దాదాపు 8 మంది సోవియట్‌ ఆటగాళ్లు గోల్‌పోస్టుకు రక్షణగా ఉన్నారు. అయినా వారిని దాటుకొని బంతి 89వ నిమిషంలో గోల్‌పోస్ట్‌కు చేరింది. దీంతో బ్రెజిల్‌ 2-1 తేడాతో సోవియట్‌ను ఓడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని