FIFA: 54 క్షణాల్లో 24 పాస్‌లతో కళ్లు చెదిరే గోల్‌..!

2006లో అర్జెంటీనా జట్టు ఆటగాడు ఎస్టెబాన్‌ కాంబియాస్సో కొట్టిన గోల్‌ సంచలనం సృష్టించింది. దీనిపై పత్రికలు ప్రత్యేకంగా కథనాలు రాశాయంటే ఆ గోల్‌ ఎంత అందంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

Updated : 23 Nov 2022 11:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫుట్‌బాల్‌లో ప్రత్యర్థి జట్టును ఏకంగా నిమిషం పాటు ప్రేక్షకులుగా మార్చేసిన ఘటన 2006లో ఫిపా ప్రపంచకప్‌లో చోటు చేసుకొంది. లీగ్‌ దశలో అర్జెంటీనా జట్టు సెర్బియా-మాంటెనెగ్రోతో తలపడింది. ఈ మ్యాచ్‌ను అర్జెంటీనా 6-0 తేడాతో అలవోకగా గెలిచింది. కానీ, ఈ మ్యాచ్‌లో ఫుట్‌బాల్‌ చరిత్రలో అపురూపంగా నిలిచిపోయే గోల్‌ ఒకటి కొట్టారు. ఈ మ్యాచ్‌ ఆరో నిమిషంలోనే అర్జెంటీనా గోల్‌ కొట్టి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

ఇక మ్యాచ్‌ 29 నిమిషంలో అర్జెంటీనా ఆటగాళ్లు బంతిని ఆధీనంలోకి తెచ్చుకొన్నారు. ఆ తర్వాత వారు దాదాపు 54 సెకన్లపాటు 24 పాస్‌లతో సెర్బియా-మాంటెనెగ్రో క్రీడాకారులను ఓ ఆట ఆడుకొన్నారు. ఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాళ్లు బంతిని మైదానం నలుమూలలకు తరలిచారు. చివరికి ప్రత్యర్థి గోల్‌పోస్టు వద్ద అర్జెంటీనా ఆటగాడు ఎస్టెబాన్‌ కాంబియాస్సో కళ్లు చెదిరే షాట్‌తో దానిని గోల్‌గా మలిచాడు. 

అర్జెంటీనా ఆటను ప్రత్యర్థి జట్టు అలా చూస్తుండటం తప్ప ఏమీ చేయలేకపోయింది. సెర్బియా-మాంటెనెగ్రో  తిరిగి కోలుకోలేదు. మాక్సి రోడ్రిగ్జ్‌, హెర్నాస్‌ క్రెస్పో,కార్లోస్‌, అప్పట్లో కుర్రాడైన మెస్సీ ఈ మ్యాచ్‌లో గోల్స్‌ చేశారు. మ్యాచ్‌లో 6 గోల్స్‌ చేసినా.. 29 నిమిషంలో కొట్టిన గోల్‌పై మాత్రమే పత్రికలు పెద్ద సంఖ్యలో కథనాలు ప్రచురించాయంటే ఆ గోల్‌ ఎంత అద్భుతంగా ఉందో ఊహించుకోవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని