Dhruv vs Rishabh: ధ్రువ్-రిషభ్‌ పంత్.. ఎవరిని తీసుకోవాలంటే?.. ఆసీస్ మాజీ సమాధానమిదే!

వికెట్‌ కీపర్‌ విషయంలో సెలక్టర్లకు తలనొప్పి తప్పేలా లేదు. రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్‌ పంత్‌ కోలుకుని పునరాగమనం చేసేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

Published : 11 Mar 2024 00:02 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ((IND vs ENG) అరంగేట్రం చేసిన ధ్రువ్‌ జురెల్ ఆకట్టుకున్నాడు. కేఎస్ భరత్‌ స్థానంలో అవకాశం దక్కించుకున్న అతడు కీలక ఇన్నింగ్స్‌లే ఆడాడు. మరోవైపు రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్‌ పంత్ కోలుకుని జాతీయ జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. దీంతో స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్‌గా ఎవరిని తీసుకుంటారు? అనే సందిగ్ధత నెలకొంది. ఐపీఎల్‌ తర్వాత జూన్‌లో టీ20 ప్రపంచ కప్‌ మొదలు కానుంది. పంత్‌ దేశవాళీ క్రికెట్‌లో నిరూపించుకున్న తర్వాతే సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలని ఆసీస్‌ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్‌ సూచించాడు. నేరుగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటం వల్ల మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు. 

‘‘ఇప్పటికప్పుడే రిషభ్‌ పంత్‌ను తీసుకోవాల్సిన అవసరం లేదు. ధ్రువ్‌కు అవకాశం ఇవ్వాలి. పంత్‌ను ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్ ఆడాలని చెప్పాలి. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడితే ఫామ్‌ అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బ్యాటింగ్‌ పరంగా పంత్‌ అద్భుతంగా రాణించగలడనే నమ్మకం ఉంది. ప్రమాదానికి ముందు ఎలాంటి దూకుడు ప్రదర్శించాడో.. అలానే ఆడగలడు. కీపింగ్‌ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. వికెట్ల వెనుక ఉండటం చాలా కష్టం. అందుకోసమే దేశవాళీలో ఆడాలని చెబుతా. తప్పకుండా పంత్ టెస్టుల్లో తిరిగి అడుగు పెడతాడు’’ అని హాగ్‌ తెలిపాడు. 

బోథమ్‌ కంటే హార్ట్‌లీతో స్టోక్స్‌ను పోల్చొచ్చు: ఆకాశ్‌ చోప్రా

ఇంగ్లాండ్‌ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బోథమ్‌తో బెన్ స్టోక్స్‌ను పోల్చడం సరికాదని భారత మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యానించాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌లో అతడి గణాంకాలు దాదాపు కొత్త స్పిన్నర్‌ హార్ట్‌లీతో సమంగా ఉన్నాయని పేర్కొన్నాడు. ‘‘ ఇంగ్లిష్‌ మీడియా ఇయాన్‌ బోథమ్‌తో బెన్‌ స్టోక్స్‌ను పోలుస్తూ కథనాలు వెలువరిస్తోంది. ఆల్‌రౌండర్‌గా అతడి స్థాయిని కాస్త ఎక్కువగా చెబుతోంది. భారత్‌తో సిరీస్‌లో బ్యాటర్‌గా స్టోక్స్‌ తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. తొలి మ్యాచ్‌లో 70 పరుగులు మినహా.. ఎక్కడా రాణించలేకపోయాడు. ఆ జట్టు స్పిన్నర్ టామ్‌ హార్ట్‌లీ స్కోరుతో సమంగా నిలిచాడు. బెన్ స్టోక్స్‌ తన స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయాడు. అతడిలో ఆత్మవిశ్వాసం కొరవడింది. భారత బౌలింగ్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు’’ అని చోప్రా అన్నాడు. ఐదు టెస్టుల్లో స్టోక్స్‌ కేవలం 199 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క వికెట్‌ (రోహిత్‌ శర్మ వికెట్) పడగొట్టాడు. అదే హార్ట్‌లీ 185 పరుగులు చేసి 22 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్‌ తరఫున టాప్‌ వికెట్‌ టేకర్.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని