Team India: విరాట్ కెప్టెన్సీ వదిలేశాక.. టెస్టుల్లో భారత్‌కు గొప్ప విజయాలు లేవు: సల్మాన్‌ భట్

గత పదేళ్లుగా భారత్ (Team India) ఖాతాలో ఐసీసీ టైటిల్‌ లేదు. వరుసగా రెండు సీజన్లలో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లినప్పటికీ టెస్టు ‘గద’ను మాత్రం దక్కించుకోలేకపోయింది. 

Updated : 15 Jun 2023 15:11 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final 2023) ఫైనల్‌లో ఓటమితో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు రేగాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌ను జూన్‌లోనే ఎందుకు పెడతారు..? ఇంగ్లాండ్‌ నుంచి మరో చోటుకు మార్చాలని రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే రోహిత్ వ్యాఖ్యలను కొట్టిపడేస్తూ పాక్‌మాజీ కెప్టెన్ సల్మాన్‌ భట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తర్వాత భారత టెస్టు క్రికెట్‌ క్రమంగా దిగజారుతోందని వ్యాఖ్యానించాడు. సరైన సన్నద్ధత లేకుండా ఇంగ్లాండ్‌కు వెళ్లడమే భారత్‌ ఓటమికి కారణమని భట్‌ విశ్లేషించాడు. విరాట్ తర్వాత రోహిత్ జట్టు పగ్గాలను అందుకున్న విషయం తెలిసిందే.

‘‘టెస్టు మ్యాచ్‌ ముగిశాక.. జూన్‌లో ఎందుకు పెడతారు? ఇంగ్లాండ్‌లోనే ఎందుకు ఆడిస్తారు? అని అడిగాడు. మనకు అనుకూలంగా ఫలితాలు రానప్పుడే ఇలాంటి చర్చ బయటకు వస్తుంది. అలా కాకుండా, మన ప్రాధాన్యత గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముఖ్యమని భావిస్తే.. ఐపీఎల్‌ను 20 రోజుల ముందే పూర్తి చేసుకుని ఇంగ్లాండ్‌కు రావాల్సింది. కనీసం 15 రోజుల ముందైనా జట్టును ఇంగ్లాండ్‌కు పంపించి ఉంటే బాగుండేది. కౌంటీ జట్లతో వార్మప్ మ్యాచ్‌లను ఆడి ఉండాల్సింది. ఎంఎస్ ధోనీ నుంచి జట్టు పగ్గాలను అందుకున్న విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ అద్భుతమైన ఫలితాలను సాధించింది. విదేశాల్లో రికార్డులు కొట్టింది. విరాట్ జట్టులో లేకపోయినా విజయాలను నమోదు చేసిన సందర్భాలను చూశాం. ఎప్పుడైతే విరాట్ కెప్టెన్సీ నుంచి దిగిపోయాడో.. నిలకడగా ఫలితాలను సాధించలేకపోతోంది’’ అని సల్మాన్ భట్‌ పేర్కొన్నాడు. విరాట్ తర్వాత టెస్టు జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించిన రోహిత్‌.. స్వదేశంలో ఆసీస్‌పై భారత్‌ బోర్డర్‌ గావస్కర్ ట్రోఫీని గెలిచింది. కానీ, విదేశాల్లో విజయాలు నమోదు చేయడంలో తడబాటుకు గురైంది. అదే విరాట్ నాయకత్వంలో ఆసీస్‌, ఇంగ్లాండ్‌ గడ్డపైనే గెలిచి టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది.

విరాట్ మరో ఆసక్తికర ‘ఇన్‌స్టా స్టోరీ’

విరాట్ కోహ్లీ తరచూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో కొటేషన్స్‌ పెడుతూ ఉండటం తెలిసిందే. తాజాగా మరో ఇన్‌స్టా స్టోరీస్‌తో విరాట్ ముందుకొచ్చాడు. ‘‘మార్పులను అందిపుచ్చుకోవాలంటే మనం కూడా అదే మార్గంలోకి వెళ్లాలి. అప్పుడే కలిసిపోయి ముందుకు సాగగలం’’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌ పెట్టాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఇటీవల కోహ్లీపై సానుకూల దృక్పథంతో కామెంట్లు చేస్తున్నాడు. దీంతో గంగూలీ వ్యాఖ్యలపైనే విరాట్ ఇలా స్పందించి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని