Team India: ఇలా గెలుస్తుంటే ఏదో కంగారు.. టీమ్ఇండియా ప్రదర్శనతో సంతోషమే.. అయినా భయమే

ఏదైనా మ్యాచ్ పోయినా పర్వాలేదనో, లేదంటే ఫలానా మ్యాచ్ ఓడిపోతే బాగుంటుందనో మన అభిమానులు అనుకోవడం ఎప్పుడైనా చూశామా? కానీ ఈ ప్రపంచకప్‌లో అదే భావన కలుగుతోంది.

Published : 06 Nov 2023 14:19 IST

ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత్ ఆడుతుంటే.. ఏదైనా మ్యాచ్ పోయినా పర్వాలేదనో, లేదంటే ఫలానా మ్యాచ్ ఓడిపోతే బాగుంటుందనో మన అభిమానులు అనుకోవడం ఎప్పుడైనా చూశామా? కానీ ఈ ప్రపంచకప్‌లో అదే భావన కలుగుతోంది. మ్యాచ్ మ్యాచ్‌కూ దుర్బేధ్యంగా మారుతూ.. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థినీ చిత్తుగా కొట్టేస్తుంటే.. లోలోన అభిమానుల్లో కంగారు పుడుతోంది. లీగ్ దశలో మరీ ఇంత ఆధిపత్యం చలాయించి.. ఏ సెమీస్‌లోనో, ఫైనల్లోనో ఎక్కడ మనవాళ్లు చేతులెత్తేస్తారో అనే భయం అభిమానులను వెంటాడుతోంది. ఆ దిశగా కొన్ని ప్రతికూల సెంటిమెంట్లు కూడా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఐతే వీటన్నింటినీ అధిగమించి ప్రపంచకప్ సాధించాలన్నది అభిమానుల ఆకాంక్ష.

సొంతగడ్డపై టీమ్ ఇండియా (Team India) ప్రపంచకప్ ఆడుతుంటే.. అంచనాలు ఎక్కువే ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ రోహిత్ సేన ఆ అంచనాలన్నింటినీ మించిపోయింది. మన జట్టు టోర్నీలో ఈ స్థాయిలో ఆధిపత్యం చలాయిస్తుందని.. ఎనిమిదికి ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ గెలిచేస్తుందని.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి జట్లపై ఇంతటి ఘనవిజయాలు సాధిస్తుందని ఊహించి ఉండరు. ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేయడమే కాక.. ఇంకో మూడుసార్లు 350 పైచిలుకు స్కోర్లు సాధించిన దక్షిణాఫ్రికాపై ఏకంగా 243 పరుగుల తేడాతో నెగ్గడం, ఆ జట్టును కేవలం 83 పరుగులకే కుప్పకూల్చడం అనూహ్యం. నిజానికి ముందే సెమీస్ చేరడంతో ఈ మ్యాచ్‌లో ఓడినా పర్వాలేదన్న భావనలో ఉన్నారు అభిమానులు. దక్షిణాఫ్రికా చేతిలో ఓడితే మనకు కలిసొస్తుందన్న ఆలోచన కూడా అభిమానుల్లో లేకపోలేదు. ఎందుకంటే 2011లో భారత్ సొంతగడ్డపై విజేతగా నిలిచినపుడు.. టోర్నీ మొత్తంలో ధోనీసేన ఓడింది ఒక్క దక్షిణాఫ్రికా చేతిలో మాత్రమే. ఆ సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా దక్షిణాఫ్రికా చేతిలో ఓడితే కప్పు మన సొంతమవుతుందేమో అని మ్యాచ్‌కు ముందు సామాజిక మాధ్యమాల్లో చర్చ జరగడం విశేషం. కానీ మన జట్టు అలాంటి సెంటిమెంట్లేమీ పెట్టుకోకుండా సఫారీ జట్టును చిత్తు చేసింది.

అయినా భరోసానే..

2011లో ఛాంపియన్ అయ్యాక గత రెండు వన్డే ప్రపంచకప్‌ల్లోనూ భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్.. ఆ రెండుసార్లూ గ్రూప్ దశలో అగ్రస్థానం సాధించడం గమనార్హం. 2015లో 12 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి లీగ్ దశలో తలపడగా.. గ్రూప్-బిలో ఆరుకు ఆరు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్ అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. కానీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక 2019లో ప్రస్తుత ఫార్మాట్లో మాదిరే పది జట్లూ మిగతా తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్‌లో తలపడ్డాయి. భారత్ 7 విజయాలతో అప్పుడు కూడా అగ్రస్థానం సాధించింది. కానీ ఆ టోర్నీలోనూ సెమీస్‌లోనే మన జట్టు ప్రయాణం ముగిసింది. అప్పుడు న్యూజిలాండ్.. టీమ్ఇండియాకు చెక్ పెట్టింది. ఇప్పుడు వరుసగా మూడో ప్రపంచకప్‌లోనూ భారత్ గ్రూప్ దశలో అగ్రస్థానం సాధించడం అభిమానులను కొంచెం కంగారు పెట్టిస్తోంది. కాకపోతే ఈసారి ఆడుతోంది సొంతగడ్డపై. పైగా మన జట్టు ఫామ్ మామూలుగా లేదు. గత రెండు ప్రపంచకప్పుల్లో మన జట్టు గ్రూప్ దశలో అదరగొడుతున్నప్పటికీ.. జట్టులో కొన్ని లోపాలు కనిపించాయి. కూర్పు పరంగా ఇబ్బందులున్నాయి. ఇప్పటి స్థాయిలో బౌలింగ్ భీకరంగా లేదు. ఎక్కువగా బ్యాటింగ్ మీదే ఆధారపడేది. కానీ ఇప్పుడు జట్టులో అందరూ నిలకడగా రాణిస్తున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం జట్టు ముందుకు సాగుతోంది. బలాబలాల్లో ఏ జట్టూ రోహిత్ సేన ముందు నిలిచేలా కనిపించడం లేదు. కాబట్టి ప్రతికూల సెంటిమెంట్లన్నింటినీ పక్కకు నెట్టి.. సెమీస్, ఫైనల్‌లోనూ జట్టు ఇదే ఆటతీరుతో జయకేతనం ఎగురవేసి దేశానికి మూడో కప్పు అందిస్తుందని ఆశిద్దాం.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని