Hanuma Vihari: నన్నెందుకు తప్పించారో..: హనుమ విహారి

2019 వెస్టిండీస్‌ పర్యటనలో హనుమ విహారి టెస్టు శతకంతో చిన్ననాటి కలను నిజం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత.. 10 టెస్టులు ముగిశాక చూసుకుంటే అతను టీమ్‌ఇండియాలో లేడు.

Updated : 12 Jul 2023 09:38 IST

బెంగళూరు: 2019 వెస్టిండీస్‌ పర్యటనలో హనుమ విహారి టెస్టు శతకంతో చిన్ననాటి కలను నిజం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత.. 10 టెస్టులు ముగిశాక చూసుకుంటే అతను టీమ్‌ఇండియాలో లేడు. గతేడాది ఆరంభంలో శ్రీలంకతో సిరీస్‌కు పుజారా లేకపోవడంతో మూడో స్థానంలో ఆడిన విహారి.. ఆ స్థానంలో మూడు టెస్టులకే పరిమితమయ్యాడు. నిరుడు జులై తర్వాత తిరిగి జట్టులోకి రాలేదు. ఈ నేపథ్యంలో అజింక్య రహానెలాగా సత్తాచాటి, టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేస్తానని 29 ఏళ్ల విహారి ధీమా వ్యక్తం చేశాడు. ఏడాదిన్నర తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో రహానె జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెస్టిండీస్‌తో సిరీస్‌లో అతనే వైస్‌కెప్టెన్‌. ‘‘పునరాగమనం ఎప్పుడూ కష్టమైందే. ఒక్కసారి చోటు కోల్పోతే మానసికంగానూ ప్రభావం పడుతుంది. గత సీజన్‌లో నేనది అనుభవించా. ఈ సీజన్‌లో మాత్రం కేవలం బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టా. ప్రేరణ పొందడమనేది చాలా కష్టమైంది. ఈ గడ్డు పరిస్థితులు దాటేలా కుటుంబం మద్దతుగా ఉంది. జట్టు నుంచి ఎందుకు తప్పించారో ఇప్పటికీ అర్థమవడం లేదు. నా ఉత్తమ ప్రదర్శన జట్టుకు సరిపోలేదేమో. కానీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటా. నాకిప్పుడు 29 ఏళ్లే. రహానె 35 ఏళ్ల వయసులో తిరిగి జట్టులోకి వచ్చాడు. టెస్టు ఆటగాడిగా నాపై ముద్ర వేయడం సరికాదు. ఐపీఎల్‌తో సహా అన్ని ఫార్మాట్లలో ఆడాలనుకుంటున్నా’’ అని విహారి పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా తరపున విహారి 28 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 839 పరుగులు సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని