మాయగాడు

బంతిని అధీనంలోకి తెచ్చుకుంటాడు. ఎక్కడ పడాలో.. ఎటు తిరగాలో.. ఎక్కడికి వెళ్లాలో అని బంతిని నియంత్రిస్తాడు.

Updated : 08 Mar 2024 06:53 IST

బంతిని అధీనంలోకి తెచ్చుకుంటాడు. ఎక్కడ పడాలో.. ఎటు తిరగాలో.. ఎక్కడికి వెళ్లాలో అని బంతిని నియంత్రిస్తాడు. బ్యాటర్‌ బుర్రను ముందే చదివేసి.. ఆశ్చర్యకర బౌలింగ్‌తో అబ్బురపరుస్తాడు. మణికట్టు మాయాజాలంతో మెప్పిస్తాడు.  ఈ ఉపోద్ఘాతమంతా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ గురించే. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న అతను చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరింత మెరుగైన బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. అయిదు వికెట్లతో ఇంగ్లాండ్‌ నడ్డివిరిచాడు. ఈ వికెట్ల కంటే కూడా వీటిని సాధించిన తీరు కుల్‌దీప్‌ను ప్రత్యేకంగా నిలుపుతోంది. పిచ్‌ స్పిన్‌కు విపరీతంగా సహకరించలేదు. కానీ కుల్‌దీప్‌ అవకాశాలను సృష్టించుకున్నాడు. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో.. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో సాగిపోయాడు. లెగ్‌ స్పిన్‌తో ఓ బంతిని ఆఫ్‌స్టంప్‌కు దూరంగా తిప్పేస్తూ.. మరో బంతిని లోపలికి గురిపెడుతూ.. వైవిధ్యంతో బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. ముఖ్యంగా పోప్స్‌ స్టంపౌట్‌, క్రాలీ బౌల్డ్‌, స్టోక్స్‌ ఎల్బీ గురించి చెప్పుకోవాలి. బంతిని ముందుకు వచ్చి డిఫెండ్‌ చూద్దామని పోప్‌ ప్రయత్నించగా.. అది స్పిన్‌ అయి వికెట్‌కీపర్‌ చేతుల్లో పడింది. క్రాలీని బౌల్డ్‌ చేసిన బంతి గురించి.. ఇదే అత్యుత్తమ బంతి అంటూ పెద్ద చర్చే సాగుతోంది. ఆఫ్‌స్టంప్‌కు చాలా దూరంగా కుల్‌దీప్‌ బంతి పడింది. అది బయటకు వెళ్తుందని లేదా మహా అయితే కాస్త లోపలికి తిరుగుతుందని క్రాలీ అనుకున్నాడు. కానీ అనూహ్యగా తిరిగిన బంతి బ్యాట్‌, ప్యాడ్‌ మధ్యలో నుంచి వెళ్లి లెగ్‌స్టంప్‌కు అటువైపు తగిలింది. ఇక స్టోక్స్‌ను వరుసగా లెగ్‌స్పిన్‌ బంతులతో కుల్‌దీప్‌ పరీక్షించాడు. ఆ తర్వాత ఒక్కసారిగా లోపలికి బంతిని తిప్పి, గూగ్లీతో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్టులో ఆడని కుల్‌దీప్‌.. ఇప్పటివరకూ 17 వికెట్లు సాధించాడు. గత కొన్నేళ్లుగా కుల్‌దీప్‌ కెరీర్‌ ఒడుదొడుకులతో సాగింది. ఫామ్‌ కోల్పోవడం, మోకాలి శస్త్రచికిత్సతో వెనుకబడ్డాడు. దీంతో పాటు అశ్విన్‌, జడేజా, అక్షర్‌ ఉండటంతో జట్టులో చోటు దొరకలేదు. 2019 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి మధ్యలో రెండు టెస్టులే ఆడాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో విశాఖ టెస్టుతో పునరాగమనం చేసి నిలకడగా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌కు వన్డే తరహా బౌలింగ్‌తో చెక్‌ పెడుతున్నాడు. శస్త్రచికిత్స తర్వాత చేతి వేగాన్ని పెంచుకున్న కుల్‌దీప్‌ మరింత ప్రమాదకరంగా మారాడు. బరువు తగ్గడంతో ఫిట్‌నెస్‌ మెరుగై మరింత కచ్చితత్వం అందుకున్నాడు. 12వ టెస్టు ఆడుతున్న అతను 51 వికెట్లు సాధించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా టెస్టుల్లో 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.


భావోద్వేగాల మిళితం

ర్మశాల టెస్టు ఆటగాళ్ల భావోద్వేగాలకు వేదికగా మారింది. అశ్విన్‌, బెయిర్‌స్టోకు ఇది వందో టెస్టు కావడమే కారణం. ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చేతుల మీదుగా అశ్విన్‌కు బీసీసీఐ ప్రత్యేక టోపీని బహూకరించింది. ఈ సందర్భంగా ద్రవిడ్‌ మాట్లాడుతుండగా.. అశ్విన్‌ భావోద్వేగాలను నియంత్రించుకుంటూ కనిపించాడు. అనంతరం భార్య ప్రీతి, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అశ్విన్‌ మైదానంలో వచ్చేటప్పుడు సహచర ఆటగాళ్లు రెండు వైపులా నిలబడి చప్పట్లు కొట్టారు. మరోవైపు రూట్‌ నుంచి బెయిర్‌స్టో తన వందో టెస్టు టోపీని అందుకున్నాడు. అతని తల్లి, భార్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బెయిర్‌స్టో ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. వందో టెస్టు నేపథ్యంలో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ముగిశాక పెవిలియన్‌ చేరే క్రమంలో ముందు నడవాలని అశ్విన్‌కు కుల్‌దీప్‌ బంతిని విసిరాడు. కానీ కుల్‌దీప్‌ ఉత్తమంగా బౌలింగ్‌ చేశాడని అశ్విన్‌.. అతణ్నే ముందు నడవాల్సిందిగా బంతిని తిరిగి ఇచ్చాడు. అశ్విన్‌ వెళ్లాల్సిందిగా కుల్‌దీప్‌ కోరినా.. చివరకు  కుల్‌దీప్‌నే ముందు నడిచేలా చేశాడు అశ్విన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని