కప్పు.. ఎవరి కొప్పులో?

నిరుడు టైటిల్‌కు అతి చేరువగా వెళ్లి.. ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డ దిల్లీ క్యాపిటల్స్‌ ఓ వైపు! తొలిసారి తుదిపోరు చేరి.. ట్రోఫీని ముద్దాడాలని చూస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మరోవైపు! ఒకటేమో లీగ్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన జట్టు.

Updated : 17 Mar 2024 07:05 IST

నేడే డబ్ల్యూపీఎల్‌-2 ఫైనల్‌
దిల్లీతో బెంగళూరు పోరు
రాత్రి 7.30 నుంచి

నిరుడు టైటిల్‌కు అతి చేరువగా వెళ్లి.. ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డ దిల్లీ క్యాపిటల్స్‌ ఓ వైపు! తొలిసారి తుదిపోరు చేరి.. ట్రోఫీని ముద్దాడాలని చూస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మరోవైపు! ఒకటేమో లీగ్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన జట్టు.. మరొకటేమో ఒడుదొడుకులను దాటి నిలిచిన జట్టు. ఈ రెండు జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక పోరుకు రంగం సిద్ధమైంది. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) రెండో సీజన్‌ ఫైనల్‌ నేడే. మరి విజేతగా నిలిచేదెవరు?


దిల్లీ: హోరాహోరీ పోరాటాలు.. రసవత్తర మ్యాచ్‌లు.. నాటకీయ మలుపులు.. ఇలా టీ20 క్రికెట్‌ మజాతో అభిమానులను అలరించిన డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌లో ఆఖరి అంకానికి వేళైంది. ఆదివారం ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతోంది. మరి ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఈ ఫ్రాంఛైజీల్లో ఏ పురుషుల జట్టూ విజేతగా నిలవలేదు. ఇప్పుడు అమ్మాయిల్లో ఏ జట్టు జయకేతనం ఎగరేస్తుందో చూడాలి. నిరుడు తుదిపోరులో ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓడిన దిల్లీ ఈ సారి కప్పు వదలకూడదనే లక్ష్యంతో ఉంది. మెగ్‌ లానింగ్‌ సారథ్యంలో ఉత్తమ ప్రదర్శనతో సాగుతోంది. లీగ్‌ దశలో 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్‌ చేరింది. కెప్టెన్‌ లానింగ్‌ (308 పరుగులు) బ్యాటింగ్‌లో రాణిస్తూ జట్టును విజయాల వైపు నడిపిస్తోంది. షెఫాలి వర్మ (265), జెమీమా రోడ్రిగ్‌్్స (235), అలీస్‌ క్యాప్సీ (230) కూడా బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. బౌలింగ్‌లో చూసుకుంటే పేస్‌ ఆల్‌రౌండర్‌ మరిజేన్‌ కాప్‌ (11), స్పిన్నర్లు జొనాసెన్‌ (11), రాధ యాదవ్‌ (10) నిలకడగా రాణిస్తున్నారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అగ్రస్థానంలో ఉన్న కాప్‌ పవర్‌ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఇబ్బందుల్లోకి నెడుతోంది. మరోవైపు తడబాటును దాటి, బలంగా పుంజుకున్న ఆర్సీబీ లీగ్‌ దశలో 8 మ్యాచ్‌ల్లో నాలుగు చొప్పున విజయాలు, ఓటములతో మూడో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయికి షాకిచ్చిన ఈ జట్టు.. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ జట్టులో ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ కీలకంగా మారింది. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో అగ్రస్థానంలో ఉన్న ఆమె (312).. 7 వికెట్లూ పడగొట్టింది. మంధాన (269), రిచా ఘోష్‌ (240) కూడా బ్యాట్‌తో సత్తాచాటితే ఆర్సీబీకి తిరుగుండదు. బౌలింగ్‌లోనే ఆ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఆశ (10), సోఫీ మోలనూ (9)తో పాటు రేణుక, శ్రేయాంక, వేర్‌హామ్‌ కూడా రాణించాల్సి ఉంది. ఈ సారి లీగ్‌్ దశలో రెండు మ్యాచ్‌లతో సహా డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటివరకూ ఆర్సీబీపై అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన దిల్లీ మరోసారి ఫేవరెట్‌గా కనిపిస్తోంది. పైగా సొంతగడ్డపై ఆడుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చేదే.


‘‘ఫైనల్‌కు ముందు మంచి లయతో ఉన్నాం. ఈ మ్యాచ్‌ గొప్పగా ఉండబోతోంది. ఎంతో ఉత్తేజితంగా ఉన్నాం. టోర్నీలోనే అత్యుత్తమ ప్రదర్శనతో తుదిపోరులో గెలిచేందుకు ప్రయత్నిస్తాం. ఆర్సీబీ కూడా అద్భుతంగా ఆడింది. ఒత్తిడిలోనూ రాణించింది. ఆ జట్టుతో మ్యాచ్‌ మాకు సవాలే. మేం అనుకున్నది చేస్తామనే నమ్మకంతో ఉన్నాం’’

మెగ్‌ లానింగ్‌


‘‘పురుషుల ఆర్సీబీ జట్టు కోణంలో చూస్తే కాస్త ఒత్తిడి తప్పదు. ఇది మాకు రెండో సీజనే. అందుకే ఎక్కువ ఒత్తిడికి లోను కాకూడదనే అనుకుంటున్నాం. పురుషుల జట్టుకు జరిగిన (ఇప్పటివరకూ ట్రోఫీ గెలవకపోవడం) దానితో మాకు సంబంధం లేదు. వర్తమానంలో జీవించాలని క్రికెట్‌ నేర్పింది. ఎవరైతే ఉత్తమ క్రికెట్‌ ఆడతారో వాళ్లే ఫైనల్లో గెలుస్తారు. నిరుడు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. ఈ సారి ప్రక్రియపై దృష్టి పెట్టి సాగుతున్నాం’’

స్మృతి మంధాన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని