వాళ్లకి క్రికెట్‌ పరిజ్ఞానం లేదేమో: ఏబీ

విరాట్‌ కోహ్లి స్ట్రైక్‌రేట్‌ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్‌ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్‌ ఏబీ డివిలియర్స్‌ అన్నాడు. మిడిల్‌ ఓవర్లలో విరాట్‌ సరిగా రాణించలేకపోతున్నాడని..

Published : 03 May 2024 01:55 IST

దిల్లీ: విరాట్‌ కోహ్లి స్ట్రైక్‌రేట్‌ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్‌ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్‌ ఏబీ డివిలియర్స్‌ అన్నాడు. మిడిల్‌ ఓవర్లలో విరాట్‌ సరిగా రాణించలేకపోతున్నాడని.. వేగంగా పరుగులు సాధించలేకపోతున్నాడన్న విమర్శలకు ఏబీ ఇలా స్పందించాడు. ‘‘కోహ్లి స్ట్రెక్‌రేట్‌ గురించి చాలారోజులుగా విమర్శలు విని విసిగిపోయా. విమర్శకులకు ఒక్కటే చెబుతున్నా.. క్రికెట్‌ అందించిన ఉత్తమ ఆటగాళ్లలో విరాట్‌ ఒకడు. ఐపీఎల్‌నూ అతడు గొప్పగా రాణించాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అయినా ఇప్పటికీ అతడిని ట్రోలింగ్‌ చేసేవాళ్లకు క్రికెట్‌పై పరిజ్ఞానం లేదని అనిపిస్తోంది. ఇలా మాట్లాడుతున్నవాళ్లు ఎన్ని మ్యాచ్‌లు ఆడారు? ఐపీఎల్‌లో ఎన్ని సెంచరీలు సాధించారు? స్ట్రెక్‌రేట్‌, స్పిన్‌ బౌలింగ్‌లో సరిగా ఆడకపోవడం అనేవి నా దృష్టిలో పెద్ద విషయాలు కావు. జట్టు విజయానికి ఎంతగా ఉపయోపడుతున్నామో చూడాలి. గెలవడానికి చేయాల్సిందంతా చేస్తున్నాడు కాబట్టే విరాట్‌ 15 ఏళ్లుగా ఆర్సీబీకి ఆడుతున్నాడు’’ అని ఏబీ చెప్పాడు. కోహ్లి ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని..తన ఆటపై దృష్టి సారించాలని డివిలియర్స్‌ సలహా ఇచ్చాడు. ‘‘2016లో ఐపీఎల్‌ చరిత్రలోనే ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించాడు విరాట్‌. అప్పటికన్నా ప్రస్తుత సీజన్లోనే అతడి స్ట్రెక్‌రేట్‌ మెరుగ్గా ఉంది. మరి అతడిని విమర్శించాల్సిన అవసరం ఏంటి? కోహ్లి ఇంకా ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆటపై దృష్టి పెడితే చాలు’’ అని ఏబీ అన్నాడు. డుప్లెసిస్‌, జాక్స్‌ను ఓపెనింగ్‌లో దించి విరాట్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే ఆర్సీబీకి మేలని.. అతడు తమ వెనుక ఉన్నాడన్న భరోసాతో ఓపెనర్లు వేగంగా పరుగులు చేసే అవకాశం ఉందన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని