IND vs SA: అదరగొట్టి.. ఆశలు నిలిపి.. నాలుగో టీ20లో భారత్‌ విజయం

56/3.. ఇదీ దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20లో మొదట బ్యాటింగ్‌లో 10 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోరు. విశాఖలో చెలరేగిన ఆటగాళ్ల మెరుపులు ఒక్క మ్యాచ్‌కే పరిమితమా? ఈ మ్యాచ్‌లో జట్టు కనీసం 120 పరుగులైనా చేస్తుందా? ఇక సిరీస్‌ పోయినట్టేనా?.. ఇలా ఎన్నో ప్రశ్నలు!

Updated : 18 Jun 2022 07:24 IST

సత్తాచాటిన దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌

విజృంభించిన అవేశ్‌ ఖాన్‌

సిరీస్‌ సమం

రాజ్‌కోట్‌

56/3.. ఇదీ దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20లో మొదట బ్యాటింగ్‌లో 10 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోరు. విశాఖలో చెలరేగిన ఆటగాళ్ల మెరుపులు ఒక్క మ్యాచ్‌కే పరిమితమా? ఈ మ్యాచ్‌లో జట్టు కనీసం 120 పరుగులైనా చేస్తుందా? ఇక సిరీస్‌ పోయినట్టేనా?.. ఇలా ఎన్నో ప్రశ్నలు!

కానీ దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య తమ విధ్వంసంతో జట్టుకు ఊహించని మొత్తాన్ని అందించారు. వాళ్ల బాదుడుతో చివరి అయిదు ఓవర్లలో జట్టు 73 పరుగులు రాబట్టింది. అనంతరం అవేశ్‌ఖాన్‌ బౌన్సర్లతో
చెలరేగడం.. మిగతా బౌలర్లూ సమష్టిగా రాణించడంతో విజయం భారత్‌దే. ఈ గెలుపుతో సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-2తో సమం చేసింది. ఇక నిర్ణయాత్మక పోరు ఆదివారం బెంగళూరులో.

క్షిణాఫ్రికాతో అయిదు టీ20ల సిరీస్‌ గెలిచే అవకాశాలను టీమ్‌ఇండియా సజీవంగా ఉంచుకుంది. శుక్రవారం నాలుగో మ్యాచ్‌లో ఆ జట్టు 82 పరుగుల తేడాతో సఫారీ సేనను చిత్తుచేసింది. మొదట టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దినేశ్‌ కార్తీక్‌ (55; 27 బంతుల్లో 9×4, 2×6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ టీ20ల్లో తొలి అర్ధశతకాన్ని అందుకున్నాడు. హార్దిక్‌ పాండ్య (46; 31 బంతుల్లో 3×4, 3×6) బాదుడు కొనసాగించాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఎంగిడి (2/20) రాణించాడు. ఈ మ్యాచ్‌తో జాన్సన్‌ (1/38) అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే పరిమితమైంది. అవేశ్‌ ఖాన్‌ (4/18) ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించాడు. చాహల్‌ (2/21) కూడా మెరిశాడు.

క్రమం తప్పకుండా..: ఛేదనలో భారత బౌలర్లు ప్రత్యర్థిని గొప్పగా కట్టడి చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. గత మ్యాచ్‌ల్లో విఫలమైన అవేశ్‌ ఈ సారి అదరగొట్టాడు. భువనేశ్వర్‌ (0/8) రెండు వైపులా బంతిని స్వింగ్‌ చేస్తూ బ్యాటర్లకు పరీక్ష పెట్టాడు. మరో ఎండ్‌ నుంచి కొత్తబంతితో బౌలింగ్‌ చేసిన హార్దిక్‌ ఓవర్లో డికాక్‌ (14) రెండు ఫోర్లు రాబట్టినా.. భువీ మాత్రం ఓపెనర్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ తొలి బంతికి పరుగు కోసం ప్రయత్నించిన బవుమా (8) నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో క్రీజులోకి డైవ్‌ చేయడంతో ఎడమ మోచేతికి గాయమైంది. దీంతో అతను రిటైర్డ్‌హర్ట్‌గా మైదానం వీడాడు. ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన హర్షల్‌ (1/3) చురుగ్గా వ్యవహరించి డికాక్‌ను రనౌట్‌ చేశాడు. ఆ తర్వాత అవేశ్‌ వికెట్ల వేట మొదలైంది. ప్రిటోరియస్‌ (0)ను అతను వెనక్కిపంపడంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఆ జట్టు 35/2తో నిలిచింది. స్పిన్నర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. బంతిని ఎక్కువగా స్పిన్‌ తిప్పకుండా క్లాసెన్‌ (8)ను చాహల్‌ బోల్తా కొట్టించాడు. కొద్దిసేపటికే ప్రమాదకర మిల్లర్‌ (9) వికెట్లను హర్షల్‌ ఎగరగొట్టడంతో టీమ్‌ఇండియా విజయం ఖరారైంది. 13 ఓవర్లకు స్కోరు 73/4. బౌన్సర్లతో బెంబేలెత్తించిన అవేశ్‌.. ఒకే ఓవర్లో వాండర్‌ డసెన్‌ (20), జాన్సన్‌ (12), కేశవ్‌ (0)ను ఔట్‌ చేయడంతో భారత్‌ విజయం దిశగా వేగంగా సాగింది. పిచ్‌ పరిస్థితులను చక్కగా అన్వయించుకున్న అతను కచ్చితమైన లెంగ్త్‌తో బౌలింగ్‌ చేసి ఫలితం సాధించాడు. ఎంగిడి (4)ని అక్షర్‌ (1/19) పెవిలియన్‌ చేర్చడంతో ఆ జట్టు కథ ముగిసింది. బవుమా మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు.

ముగింపు అదుర్స్‌..: కీలకమైన మ్యాచ్‌లో భారత్‌కు పేలవ ఆరంభం దక్కినా.. దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ మెరుపులతో గొప్ప ముగింపు లభించింది. పిచ్‌పై ఉన్న కాస్త పచ్చికను ఉపయోగించుకుంటూ అదనపు బౌన్స్‌, స్పిన్‌తో సఫారీ బౌలర్లు చెలరేగారు. దీంతో 7 ఓవర్లకు జట్టు 44/3తో కష్టాల్లో పడింది. ఓపెనర్లు రుతురాజ్‌ (5), ఇషాన్‌ కిషన్‌ (27) ఈ సారి నిరాశపరిచారు. శ్రేయస్‌ (4) విఫలమయ్యాడు. ఆ దశలో హార్దిక్‌, పంత్‌ (17) క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకోవడంతో పరుగుల రాక మందగించింది. ఇలా అయితే లాభం లేదనుకున్న హార్దిక్‌.. షంసి (0/18) బౌలింగ్‌లో వరుసగా రెండు కళ్లు చెదిరే సిక్సర్లు కొట్టాడు. ఇక ఇన్నింగ్స్‌ ఊపు అందుకోవడమే తరువాయి అనుకునేలోపే పంత్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి నిర్లక్ష్యంగా ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. 15 ఓవర్లకు స్కోరు 96/4. హార్దిక్‌, కార్తీక్‌ విధ్వంసంతో అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. ముఖ్యంగా కార్తీక్‌ టాప్‌గేర్‌లోకి వెళ్లిపోయాడు. నోకియా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను.. కేశవ్‌ (1/29) బౌలింగ్‌లో మరో మూడు ఫోర్లు సాధించాడు. రివర్స్‌ పుల్‌తో షార్ట్‌ థర్డ్‌మ్యాన్‌ దిశగా అతను కొట్టిన బౌండరీ ఆకట్టుకుంది. ఆ తర్వాత తనలోని విధ్వంసకారుడు మరింతగా బయటకొచ్చాడు. అప్పటివరకూ పొదుపుగా బౌలింగ్‌ చేసిన ప్రిటోరియస్‌ (1/41) ఓవర్లో అతను వరుసగా 6, 4, 4 కొట్టాడు. కానీ వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ వెనుదిరగడంతో జట్టు 15 పరుగులు తక్కువ చేసిందనే చెప్పాలి. ఎంగిడి వేసిన 19వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్‌ కొట్టిన హార్దిక్‌.. రెండో బంతికి షంసి అందుకున్న అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. చివరి ఓవర్‌ తొలి బంతికి సిక్సర్‌తో 26 బంతుల్లోనే అర్ధశతకం చేరుకున్న కార్తీక్‌.. రెండో బంతికి క్యాచౌటయ్యాడు. ఫోర్‌తో అక్షర్‌ (8 నాటౌట్‌) ఇన్నింగ్స్‌ ముగించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని