నాదల్‌ తొలి ప్రత్యర్థి ఫ్రాన్సిస్కో

: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. సోమవారం ఆరంభమయ్యే ఈ టోర్నీ డ్రాను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌, ఈ ఏడాది ఇప్పటికే రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన నాదల్‌ వేర్వేరు పార్శ్వాల్లో ఉన్నారు.

Updated : 25 Jun 2022 02:42 IST

వింబుల్డన్‌ డ్రా విడుదల

లండన్‌: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. సోమవారం ఆరంభమయ్యే ఈ టోర్నీ డ్రాను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌, ఈ ఏడాది ఇప్పటికే రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన నాదల్‌ వేర్వేరు పార్శ్వాల్లో ఉన్నారు. ఫైనల్‌ వరకు వీళ్లు ఎదురు కారు. ఏడో వింబుల్డన్‌ టైటిల్‌పై కన్నేసిన టాప్‌ సీడ్‌ జకో.. సూన్‌వూ (కొరియా)తో పోరుతో టోర్నీ ఆరంభిస్తాడు. స్పెయిన్‌ యువ సంచలనం, అయిదో సీడ్‌ కార్లోస్‌ అల్కరజ్‌ నుంచి క్వార్టర్స్‌లో తనకు ప్రమాదం పొంచి ఉంది. పాదం గాయాన్ని పక్కకునెట్టి బరిలో దిగుతున్న రెండో సీడ్‌ నాదల్‌ తొలి రౌండ్లో ఫ్రాన్సిస్కో (అర్జెంటీనా)తో తలపడతాడు. సిలిచ్‌, ఫెలిక్స్‌ అగర్‌, బెరెట్టిని, సిట్సిపాస్‌ లాంటి ప్రత్యర్థులు నాదల్‌కు ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు నిరుడు ఇదే టోర్నీలో కాలి గాయంతో తొలి రౌండ్‌ మధ్యలోనే నిష్క్రమించిన మాజీ నంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌.. ఏడాది విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు వింబుల్డన్‌లోనే తిరిగి సింగిల్స్‌లో పోటీపడుతుంది. టోర్నీకి ముందు సన్నాహకం కోసం ఆమె రెండు డబుల్స్‌ మ్యాచ్‌లాడింది. 12 నెలలు కోర్టు బయటే ఉండడంతో ఆమె ర్యాంకు 1204కు పడిపోయింది. కానీ టోర్నీ నిర్వాహకులు తనకు వైల్డ్‌కార్డు ప్రవేశం కల్పించారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆమె.. 113వ ర్యాంకర్‌ హార్మోనీ టాన్‌ (ఫ్రాన్స్‌)తో తలపడుతుంది. రికార్డు స్థాయిలో ఏడు సార్లు వింబుల్డన్‌ విజేతగా నిలిచిన 40 ఏళ్ల సెరెనాకు.. మూడో రౌండ్లో ఆరో సీడ్‌ ప్లిస్కోవా ఎదురయ్యే అవకాశం ఉంది. వరుసగా 35 విజయాలు, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌తో జోరుమీదున్న నంబర్‌వన్‌ ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌).. క్వాలిఫయర్‌ జానా ఫెట్‌తో పోరుతో టోర్నీ మొదలెడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని