Delhi Vs Mumbai: భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్‌ పాండ్య

దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్‌ పంత్ సేన ఛాన్స్‌లు మెరుగయ్యాయి.

Updated : 28 Apr 2024 12:41 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో మరో భారీ లక్ష్య ఛేదన మ్యాచ్‌ను చూసిన అనుభూతిని అభిమానులు కాస్తలో మిస్‌ అయ్యారు. రెండు రోజుల క్రితం కోల్‌కతాను పంజాబ్‌ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. శనివారం దిల్లీపైనా ముంబయి 258 పరుగుల లక్ష్య ఛేదనలో దగ్గరగా వచ్చింది. కేవలం 10 పరుగుల తేడాతోనే ఓటమిపాలైంది. టాస్‌ నెగ్గిన ముంబయి తొలుత బౌలింగ్‌ ఎంచుకోవడంపై చాలా విమర్శలు వచ్చాయి. మధ్యాహ్నం వేళ మ్యాచ్‌లో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని.. అలాంటప్పుడు హార్దిక్‌ పాండ్య నిర్ణయం సరైంది కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి వాదనకు కెప్టెన్ హార్దిక్ సమాధానం ఇచ్చాడు. 

‘‘భారీ టార్గెట్‌కు సమీపంలో వచ్చి ఆగిపోయాం. ఇప్పుడు ప్రతి బంతీ కీలకంగా మారింది. బౌలర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఓటమి చెందినప్పటికీ మా ఆటతీరు బాగుంది. మిడిల్‌ ఓవర్లలో ఇంకాస్త దూకుడుగా ఆడి ఉంటే గెలిచేందుకు అవకాశాలు ఉండేవి. మేం తొలుత బౌలింగ్‌ ఎంచుకోవడానికిగల కారణాలను చాలా మంది అన్వేషిస్తున్నారు. అయితే, ఇలాంటి పిచ్‌పై మేం ఎంత భారీ టార్గెట్‌ను ఛేదించగలమో తెలుసుకొనేందుకు పరీక్ష పెట్టుకున్నాం. ఒక్కోసారి ప్రణాళికలు అనుకున్నంత మేర సక్సెస్ కావు. దిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ అద్భుతంగా ఆడాడు. ఓ లెక్క ప్రకారం రిస్క్‌ తీసుకొని ఆడినట్లు అనిపించింది. యువ క్రికెటర్లలో ఎలాంటి భయం లేదని మరోసారి నిరూపించాడు. టాస్‌ విషయంలో మరోలా చేసి ఉంటే బాగుండేదని అనిపించలేదు’’ అని పాండ్య తెలిపాడు. ముంబయి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు మ్యాచ్‌ ఫీజ్‌లో 10 శాతం కోత పడింది. క్రీడా పరికరాలను అవమానించినందుకు ఈ మేరకు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. 

ఇంపాక్ట్‌ సబ్‌తో కష్టమే: పంత్

‘‘స్కోరు బోర్డుపై 250+ స్కోరును చూశాక కాస్త ఆనందం కలిగింది. కానీ, ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్ వల్ల మనసులో ఆందోళన ఉంది. ప్రతి రోజూ గండమే. ఇలాంటప్పుడే బౌలర్లలో నమ్మకం కలిగించాలి. టిమ్‌ డేవిడ్‌ వంటి హార్డ్‌ హిట్టర్ క్రీజ్‌లోకి వచ్చాక పరిస్థితులు వేగంగా మారిపోయాయి. మా యువ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ తొలిరోజు నుంచి తనకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రతి గేమ్‌లోనూ మెరుగ్గా ఆడుతున్నాడు. ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయి. ఒక్కో మ్యాచ్‌ను గెలుస్తూ ముందుకు సాగుతాం’’ అని దిల్లీ కెప్టెన్ రిషభ్‌ పంత్ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని