WI vs IND: ‘తిలక్‌ వర్మకు వద్దని చెప్పి హార్దిక్‌ భారీ షాట్లు ఆడాడు’.. పాండ్య తీరును తప్పుబట్టిన మాజీ క్రికెటర్

విండీస్‌తో మూడో టీ20లో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. హార్దిక్ సిక్స్ కొట్టడంతో మరో ఎండ్‌లో ఉన్న తిలక్ వర్మ అర్ధ శతకానికి ఒక పరుగు దూరంలో నిలిచిపోయాడు. దీంతో పాండ్య వ్యవహరించిన తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Updated : 09 Aug 2023 17:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో (WI vs IND) కీలకమైన మూడో టీ20లో భారత్‌ విజయం సాధించి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సూర్యకుమార్‌ యాదవ్ (83)తోపాటు కొత్త కుర్రాడు, హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ (Tilak Varma) (49) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ హార్దిక్ పాండ్య (Hardik Pandya) (20) సిక్స్‌ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. భారత్‌ 14 బంతుల్లో కేవలం 2 పరుగులు చేయాల్సి ఉండగా పాండ్య సిక్స్‌ కొట్టడంతో  మరో ఎండ్‌లో ఉన్న తిలక్‌ వర్మ అర్ధ శతకానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. ఒక్క పరుగు చేస్తే అతడి ఖాతాలో వరుసగా రెండో అర్ధశతకం చేరేది. తిలక్ వర్మకు హాఫ్‌ సెంచరీ చేసే అవకాశం ఉన్నా హార్దిక్‌ పాండ్య స్వార్థపూరితంగా వ్యవహరించాడని అభిమానులు నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమీ చివరి బంతి కాదు కదా.. నెట్‌రన్‌రేట్‌ మెరుగుపర్చుకోవాల్సిన అవసరం లేదుగా అంటూ హార్దిక్‌పై ట్రోలింగ్ చేస్తున్నారు. భారత మాజీ ఓపెనర్ ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) కూడా హార్దిక్‌ పాండ్య వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

మోదీ మొన్న అన్నారు.. క్రికెటర్లు ఎప్పుడో పాటించారు!

ద్వైపాక్షిక సిరీస్‌లో నెట్ రన్ రేట్ గురించి ఆందోళన లేనప్పుడు అతడు ఎందుకు భారీ షాట్ ఆడాడో అర్థం కాలేదన్నాడు. తిలక్ వర్మను భారీ షాట్లు ఆడొద్దని చెప్పి.. హార్దికే పెద్ద షాట్లు ఆడాడని చోప్రా పేర్కొన్నాడు.  ‘‘సూర్యకుమార్‌ ఔటైన తర్వాత హార్దిక్ పాండ్య బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికే క్రీజులో ఉన్న తిలక్‌ వర్మ వద్దకు వెళ్లి నాటౌట్‌గా ఉండటం ముఖ్యమని చెప్పాడు. కానీ, హార్దికే భారీ షాట్లు ఆడాడు. ఇక్కడ నెట్‌ రన్‌రేట్ అవసరం లేదు. ఎలా గెలిచినా పెద్దగా పోయేదేమి లేదు. తిలక్ వర్మను వద్దని చెప్పి తానే పెద్ద షాట్లు ఆడాడు. 14 బంతుల్లో రెండు పరుగులు కావాలి. హార్దిక్‌ సింగిల్ తీసి తిలక్‌కు అవకాశం ఇస్తే అతడు సిక్స్ కొట్టి ముగించేవాడేమో’’ అని ఆకాశ్ చోప్రా వివరించాడు.

హార్దిక్‌ అందుకే ఇలా చేశాడేమో?

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టులో టీమ్‌ఇండియా కొత్త జట్టును రూపొందించే దిశగా కసరత్తు మొదలెట్టింది. కాబట్టి, వ్యక్తిగత మైలురాళ్ల గురించి చింతించకుండా జట్టు సంస్కృతిని నిర్మించడంలో భాగంగా హార్దిక్‌ అలా చేసి ఉంటాడని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.
‘‘ఆటగాళ్ల మైలురాళ్లు, అర్ధ సెంచరీ చేయడం, నాటౌట్‌గా ఉండటం వంటి పట్టించుకోకూడదనే ఉద్దేశంతో ఓ జట్టు సంస్కృతిని వాళ్లు తీసుకురావాలనుకుంటున్నారు. కానీ, ఇక్కడ నాటౌట్‌గా ఉండటం అనవసరమైన విషయం’’ అని చోప్రా అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు