Hardik On fifth t20: నేను బ్యాటింగ్‌కు వచ్చేటప్పటి జోరును కొనసాగించలేకపోయాం: హార్దిక్‌

సూర్యకుమార్‌ యాదవ్, తిలక్‌ వర్మ మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో కీలకమైన ఐదో టీ20లో భారత్‌ (WI vs IND) ఓటమిపాలైంది. సిరీస్‌నూ చేజార్చుకుని నిరాశతో ఇంటిముఖం పట్టింది.

Published : 14 Aug 2023 08:19 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో తొలి రెండు టీ20ల్లో (WI vs IND) ఓడిపోయి సిరీస్‌ రేసులో వెనుకబడిన భారత్‌.. ఆ తర్వాత పుంజుకొని సమం చేసింది. తీరా, కీలకమైన ఐదో టీ20లో మాత్రం చేతులెత్తేసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఫ్లోరిడా పిచ్‌పై భారీగా పరుగులు చేయడంలో విఫలమైంది. ఎప్పటిలాగే కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ప్రభావం చూపించలేదు. పాండ్య బ్యాటింగ్‌లో 18 బంతుల్లో కేవలం 14 పరుగులు చేయగా.. మూడు ఓవర్లు వేసి 32 పరుగులు సమర్పించాడు. తొలిసారి అతడి కెప్టెన్సీలో సిరీస్‌ ఓడిపోవడం గమనార్హం. ఈ క్రమంలో మ్యాచ్‌లో జట్టు వైఫల్యంపై హార్దిక్‌ పాండ్య మాట్లాడాడు. 

IND vs WI: ఏడేళ్ల తర్వాత పోయింది సిరీస్‌

‘‘నేను బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి ఉన్న జోరును కొనసాగించడంలో విఫలమయ్యాం. ఆ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని పరుగులు సాధించలేకపోయాం. సవాళ్లు ఎదురవుతాయని తెలుసు. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నించాం. ఈ ఓటమి గురించి మరీ ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మా ఆటగాళ్లు ఎలా ఆడారనేది నాకు తెలుసు. ఒక్కోసారి ఓటమి కూడా మంచి చేస్తుంది. చాలా విషయాలను నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. యువకులు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించారు. వాళ్లే ముందుకొచ్చి కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం ఆనందాన్ని ఇచ్చింది. మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఇక్కడే జరగనుంది. అప్పుడు మరింతమంది అభిమానులను కలుస్తాం’’ అని పాండ్య తెలిపాడు. 

నికోలస్ పూరన్‌ వల్లే ఇదంతా: పావెల్

‘‘సిరీస్‌ను గెలవడంపై మాట్లాడేందుకు మాటలు దొరకడం లేదు. మ్యాచ్‌ ముందు మేమంతా కూర్చుని మాట్లాడుకున్నాం. సిరీస్‌ నెగ్గడం వెనుక కోచింగ్ సిబ్బంది పాత్ర కూడా ఉంది. నికోలస్‌ పూరన్ ప్రదర్శన అద్భుతం. అతడు మాకు కీలక ఆటగాడు. ఒక్కరు మెరుగ్గా ఆడినా జట్టుకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఐదు మ్యాచుల్లో కనీసం మూడింట్లోనైనా ఆడమని పూరన్‌ను కోరాం. ప్రతి మ్యాచ్‌లోనూ తన ప్రభావం చూపించాడు. కీలకమైన ఐదో టీ20లో మా బౌలర్లు పుంజుకున్న తీరు అద్భుతం. మాకు మద్దతుగా నిలిచేందుకు వచ్చిన ప్రేక్షకులతోపాటు సామాజిక మాధ్యమాల్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని విండీస్‌ కెప్టెన్ పావెల్ తెలిపాడు. 

మ్యాచ్‌కు సంబంధించి మరికొన్ని విశేషాలు

  • భారత్‌పై ఛేదన సందర్భంగా అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా విండీస్ ఆటగాడు బ్రాండన్‌ కింగ్‌ (85*) నిలిచాడు. విండీస్‌కే చెందిన ఎవిస్‌ లూయిస్‌ (125*) భారీ సెంచరీని భారత్‌పై సాధించాడు. 
  • ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌కు ఇదే తొలి ఓటమి. న్యూజిలాండ్‌పై (2020లో) 5-0, ఇంగ్లాండ్‌పై (2021లో) 3-2, దక్షిణాఫ్రికాపై (2022లో) 2-2తో డ్రా, విండీస్‌పైనే (2022లో) 4-1తో సిరీస్‌లను దక్కించుకోగా.. ఇప్పుడు విండీస్‌పైనే 2-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. 
  • ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా నికోలస్‌ పూరన్, బ్రాండన్ కింగ్‌ నిలిచారు. ఈ సిరీస్‌లో పూరన్ 178 పరుగులు చేయగా.. కింగ్‌ 173 పరుగులు చేశాడు.  
  • భారత్‌పై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌ రొమారియో షెఫెర్డ్‌ (9 వికెట్లు). గతేడాది మెకాయ్‌ కూడా 9 వికెట్లు పడగొట్టాడు. వ్యక్తిగత అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాల్లో మూడోది కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో షెఫెర్డ్‌ 4/31 గణాంకాలను నమోదు చేశాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని