Shami: కష్టాలపై ఎగసిన బౌన్సర్‌.. షమీ..!

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌.. నేనేంటో చూపిస్తాను.. అన్నాడా వెటరన్‌ బౌలర్‌. ఆ ఛాన్స్‌ వచ్చింది.. అంతే.. మళ్లీ తనను వదులుకోవాలంటే మేనేజ్‌మెంట్‌ పదిసార్లు ఆలోచించేలా చేశాడు. తన స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడే లేడని టీమ్‌ ఇండియా అభిమానులకు చెప్పాడు. ఇది 2023 ప్రపంచకప్‌లో షమీ ప్రస్థానం. ఈ నిప్పులు చెరిగే బంతుల వెనుక ఎన్నో కష్టాలున్నాయి.

Updated : 01 Nov 2023 10:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గృహ హింస కేసులు, ఫిక్సింగ్‌ ఆరోపణలు.. ఆత్మహత్య చేసుకొందామన్న ఆలోచనలు.. రోడ్డు ప్రమాదం.. ఇవేవీ మహమ్మద్‌ షమీ(Mohammed Shami)ని  కుంగదీయలేదు. 2013లోనే కెరీర్‌ ప్రారంభించినా.. ఆటగాడిగా అతడికి దక్కాల్సినంత కీర్తి లభించలేదు. ప్రతిభ లేక కాదు.. జహీర్‌ ఖాన్‌.. ఇషాంత్‌ శర్మ వంటి దిగ్గజాల చాటున మరుగునపడిపోయాడు. ఆ తర్వాత బుమ్రా రావడంతో మరో సారి అతడి నీడలోనే ఉండిపోవాల్సి వచ్చింది. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక శాతం (33%) వికెట్లు క్లీన్‌ బౌల్డ్‌లుగా సాధించిన ఆటగాడు షమీనే. ఇక ప్రపంచంలో మిచెల్‌ స్టార్క్‌ (38%), వకార్‌ యూనిస్‌ (36%), వసీం అక్రమ్‌ (35%) షోయబ్ అక్తర్‌ (34%) మాత్రమే కెరీర్‌లో అత్యధిక శాతం బౌల్డ్‌లు చేశారు. ఇలాంటి బౌలర్‌ కెరీర్‌ ఒక దశలో ముగిసి పోయిందనుకొన్నారు.. కానీ, బౌన్సింగ్‌ పిచ్‌ను తాకిన బంతిలా ఎగిశాడు.

అతడి 11 ఏళ్ల కెరీర్‌లో ఐదేళ్లపాటు గాయాలు, కుటంబ వివాదాల కారణంగా కేవలం 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ముఖ్యంగా అతడి జీవితంలో 2018లో పెనుతుపానే వచ్చింది. భార్య పెట్టిన గృహ హింస కేసు, ఫిక్సింగ్‌ ఆరోపణలు అతడి కెరీర్‌నే కుదిపేశాయి. అదే ఏడాది బీసీసీఐ కాంట్రాక్ట్‌ నిలిచిపోయింది. ఈ పరిణామాలపై టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఒక్కసారిగా విలపించాడు. ఆ తర్వాత ఫిక్సింగ్‌ ఆరోపణల నుంచి బయటపడ్డాడు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా ఆడుతున్న దిల్లీ డేర్‌ డెవిల్స్‌ కూడా 2019 సీజన్‌కు ముందు ఐపీఎల్‌లో అతడిని వదులుకుంది. ఇవన్నీ అతడికి షాకులే. కానీ, షమీ(Mohammed Shami) కుంగిపోలేదు. 2019లో 21 వన్డేల్లో ఏకంగా 177.2 ఓవర్లు బౌలింగ్‌ చేసి.. అత్యధికంగా 42 వికెట్లు సాధించాడు.

కష్టాలనే అవకాశంగా మలచుకొని..

2020లో ఆస్ట్రేలియా సిరీస్‌లో వివిధ కారణాలతో షమీ(Mohammed Shami)ని జట్టు నుంచి డ్రాప్‌ చేశారు. నాటి నుంచి 2022 వరకు జట్టు నుంచి పిలుపు రాలేదు. ఆ సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహ గ్రామీణ ప్రాంతంలోని తన ఫామ్‌ హౌస్‌లోని సొంత పొలంలో ఏర్పాటు చేసుకున్న మైదానంలో సాధన చేశాడు. ఈ విషయాన్ని అతడి చిన్ననాటి కోచ్‌ మహమ్మద్‌ బద్రుద్దీన్‌ కొన్నాళ్ల కిందట పీటీఐకి వెల్లడించారు. ఈ గ్రౌండ్‌ను షమీ(Mohammed Shami) తన సొంత డబ్బుతో నిర్మించుకున్నట్లు చెప్పాడు. ఈ పిచ్‌ పనులను స్వయంగా షమీ(Mohammed Shami), తన సోదరుడు మహమ్మద్‌ కైఫ్‌తో కలిసి చేసుకొనేవాడు.

ఇన్ని సెంచరీలు, పరుగులు ఊహించలేదు

షమీ(Mohammed Shami) ఏర్పాటు చేసుకొన్న గ్రౌండ్‌లో మూడు రకాల పిచ్‌లు ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఫ్లాట్‌ పిచ్‌.. ఇక్కడ బౌలర్‌ బంతులు విసరాలంటే రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిందే. మరో పిచ్‌ కొంచెం పచ్చికతో ఉంటుంది.. ఇక మూడో పిచ్‌ పూర్తిగా బౌలింగ్‌కి అనుకూలమైనది. నిజమైన మ్యాచ్‌లోని పరిస్థితులను సృష్టించుకొని.. వాటికి అనుకూలంగా గంటల తరబడి సాధన చేసేవాడు. 

అతడు ఇక్కడితో ఆగలేదు.. సొంతగా ఫ్లడ్‌లైట్లను కూడా ఏర్పాటు చేయించుకొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాత్రివేళల్లో బౌలింగ్‌ చేసే నైపుణ్యాలకు పదును పెట్టుకొన్నాడు. అంతేకాదు.. అండర్‌-19, అండర్‌-23లో అద్భుతమైన యువ బ్యాటర్లను తన మైదానానికి ఆహ్వానించేవాడు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో యూపీ సీమర్‌ మొహసీన్‌ ఖాన్‌తో కలిసి షమీ (Mohammed Shami) తన సొంత మైదానంలో సాధన చేశాడు. అప్పట్లో అతి తక్కువ మంది మాత్రమే అతడితో కలిసి సాధన చేసేవారు. అంతేకాదు.. మొహసీన్‌ ఖాన్‌ పురోగతిని కూడా స్వయంగా షమీ సమీక్షించేవాడు. యూపీలో అత్యుత్తమ యువ బౌలర్లలో మొహసీన్‌ కూడా ఒకడు.

పొలాల్లో పరుగులు తీసి..

ఇక బౌలర్‌ అంటే కేవలం వేగంగా బంతులు విసరడమే కాదు.. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం కూడా ముఖ్యమే. అదే సీమర్‌కు అయితే భుజాలే కాదు..  కాళ్లు కూడా చాలా బలంగా ఉండాలి. ఇందు కోసం షమీ(Mohammed Shami) సొంతంగా ఇంట్లోనే ఒక మినీ జిమ్‌ను ఏర్పాటు చేసుకొన్నాడు. అంతేకాదు.. తన పొలంలోనే  మట్టిపై చాలా సమయం రన్నింగ్‌ చేసేవాడు. సాధారణంగా పొలం మట్టి మెత్తగా ఉండటంతో అక్కడ ఎక్కువ శక్తిని ఉపయోగించి పరిగెత్తాల్సి ఉంటుందని షమీ కోచ్‌ బద్రుద్దీన్‌ వెల్లడించాడు.

ఈ శ్రమ షమీ(Mohammed Shami)కి అక్కరకొచ్చింది. అతడు లాక్‌డౌన్‌ తర్వాత గుజరాత్‌ టైటాన్స్ తరపున అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక ఈ ఏడాది భీకరఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 14 వన్డే మ్యాచ్‌లు ఆడిన షమీ 101 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఏకంగా 28 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లకు షమీని తుది జట్టులోకి తీసుకోలేదు. హార్దిక్‌ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన షమీ.. తొలి మ్యాచ్‌లోనే పటిష్ఠమైన న్యూజిలాండ్‌ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఏకంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేసి జట్టులో తన స్థానం ఏంటో నిరూపించుకున్నాడు. ఇక ఆ తర్వాతి మ్యాచ్‌లోనూ నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు సాధించాడు. వీటిల్లో ఆరు క్లీన్‌ బౌల్డ్‌లే. ప్రపంచకప్‌ సాగే కొద్దీ మరిన్ని రికార్డులు సాధించాలని ఆశిద్దాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని