IND vs SL: ఓటమికి అర్ష్‌దీప్‌ ఒక్కడే బాధ్యుడు కాదు.. !

శ్రీలంకతో రెండో మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా (Team India)  ఓటమికి అర్ష్‌దీప్‌ ఒక్కడినే బాధ్యుడిని చేస్తే.. బ్యాటర్లను కాపాడినట్లే. మిడిల్‌ ఆర్డర్‌, పార్ట్‌టైం బ్యాటర్లు ఆడినట్లు మన టాప్‌ ఆర్డర్‌ ఆడలేదు.  బంతితో, బ్యాట్‌తో భారత్‌ ఓపెనింగ్‌ ఏమాత్రం బాగోలేదు.

Published : 06 Jan 2023 14:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ రెండో మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా(Team India)ను టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం, అదనపు పరుగులే ముంచేశాయని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. దీనికి తోడు పవర్‌ప్లేలో మన బౌలింగ్‌తోపాటు, బ్యాటింగ్‌ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఒక దశలో మిడిల్‌ ఓవర్లలో స్పిన్నర్లు, సీమర్లు శ్రీలంక బ్యాటర్లను అదుపు చేసినా.. తిరిగి స్లాగ్‌ ఓవర్లలో బంతి సీమర్ల చేతికి  వచ్చాక భారీగా పరుగులు సమర్పించుకొన్నారు. 200 పరుగుల లక్ష్య ఛేదన ఏ జట్టుకైనా ఒత్తిడి పెంచుతుంది. కానీ, ప్రణాళిక ప్రకారం ఆడితే టీ20ల్లో ఇదే ఛేదించలేని లక్ష్యం కాదు.

కుదరుకోని ఓపెనింగ్‌ జోడీ..

టీమ్‌ ఇండియా(Team India) ఇటీవల కాలంలో ఆడిన టీ20 మ్యాచ్‌ల్లో పవర్‌ ప్లేను సద్వినియోగం చేసుకొన్న సందర్భం దాదాపు ఒక్కటి కూడా లేదు.  టీ20 ప్రపంచకప్‌ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో కూడా భారత్‌ పవర్‌ ప్లే రన్‌రేట్‌ 6 అంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో పవర్‌ ప్లే ముగిసే సరికే 39 పరుగులకు టాప్‌ ఆర్డర్‌ పెవిలియన్‌కు చేరుకొంది. భారత్‌ విజయం సాధించిన తొలి మ్యాచ్‌లో కూడా పవర్‌ ప్లే ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. మ్యాచ్‌ను దాదాపు ఏకపక్షం చేయాల్సిన తొలి 6 ఓవర్లను టాప్‌ ఆర్డర్‌ వైఫల్యంతో వృథా చేస్తూనే ఉన్నారు. కొత్తగా అవకాశం దక్కించుకొన్న ఆటగాళ్లు శుబ్‌మన్‌గిల్‌, రాహుల్‌ త్రిపాఠిలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. గిల్‌, త్రిపాఠి ఇద్దరూ ఆవేశపడి వికెట్లను సమర్పించుకొన్నారు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా(Team India) తరఫున తొలి ఆరుగురు బ్యాటర్లలో ఒక్క సూర్యకుమార్‌ను పక్కన పెడితే మిగిలిన ఐదుగురు కలిసి చేసిన స్కోరు 33 పరుగులు..! రోహిత్‌, కోహ్లీలను పక్కన పెట్టి ఇచ్చిన అవకాశాలను కొత్త బ్యాటర్లు నేలపాలు చేసుకొన్నారు.

వైడ్లు.. నోబాల్స్‌ కొంప ముంచాయి..

శ్రీలంక బ్యాటింగ్‌లో 20వ ఓవర్‌ ప్రారంభ సమయానికి 186/6 స్కోర్‌తో ఉంది. టీమ్‌ ఇండియా(Team India) కూడా బ్యాటింగ్‌ సమయంలో 20వ ఓవర్‌ మొదలయ్యే సరికి 186/6 స్కోర్‌ వద్దే ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌, శ్రీలంక మధ్య ఒక్కటే తేడా. అవి నోబాల్స్‌..! శ్రీలంక 10 వైడ్‌ బాల్స్‌ వేసింది.. కానీ, ఒక్క నోబాల్‌ కూడా ఇవ్వలేదు. ఇక భారత బౌలర్లు నాలుగు వైడ్లు, ఏడు నోబాల్స్ వేశారు. ముఖ్యంగా ఈ ఏడు నోబాల్స్‌.. వాటికి ఇచ్చిన ఫ్రీ హిట్లతో కలిపి మొత్తం 38 పరుగులు సమర్పించుకొన్నారు. ఇందులో 18.5 ఓవర్‌లో శానక ఇచ్చిన క్యాచ్‌ కూడా నోబాల్‌ రూపంలో వృథాగా మారి పోయింది. దీంతో చివరి ఓవర్‌లో శానక రెచ్చిపోయి ఒక్కడే 19 పరుగులు సాధించాడు. దీంతో ఆ జట్టు 206 పరుగులను చేరుకొంది. టీ20ల్లో 200 పరుగులు మానసికంగా ప్రత్యర్థులను దెబ్బతీసే స్కోరు. నోబాల్స్‌ లేకపోతే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది.

పాండ్యా నీకిది తగునా..!

ఈ మ్యాచ్‌ ఓటమిలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా పాత్రను విస్మరించలేం. బౌలింగ్‌ వనరుల వినియోగంలో ప్రణాళికా లోపం కచ్చితంగా కనిపిస్తోంది. తొలి ఓవర్‌ వేసిన పాండ్యా కేవలం  రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక గాయం నుంచి కోలుకొని వచ్చిన అర్ష్‌దీప్‌ తొలి ఓవర్‌లో 19 పరుగులు సమర్పించుకున్నాడు. సహజంగా అతడి ఆత్మవిశ్వాసంపై ఇది ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో అతడిని 19వ ఓవర్‌ వరకు పక్కన పెట్టాడు. సాధారణంగా టీ20ల్లో 19, 20వ ఓవర్లు బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లు ఆడతారు. అలాంటి సమయంలో అర్ష్‌దీప్‌ చేతికి బంతి ఇచ్చాడు.. అప్పటికే భీకర షాట్లతో రెచ్చిపోయిన శానక అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లకు 6.50 ఎకానమీతో 13 పరుగులే ఇచ్చిన కెప్టెన్‌ పాండ్యా బౌలింగ్‌ చేయడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. తొలి మ్యాచ్‌లో కూడా వివిధ కారణాలతో చివరి ఓవర్‌ వేయడానికి పాండ్యా ఇష్టపడలేదు. రెండో మ్యాచ్‌లో అలాంటి కారణాలు ఏమీ లేకపోయినా కీలక సమయంలో బంతిని తీసుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు