IPL 2023: ఐపీఎల్‌ స్టంప్స్‌ అంత ఖరీదా..!

ఇటీవల ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ ఆటగాడు అర్ష్‌దీప్‌ చివరి ఓవర్‌లో ఇద్దరు ముంబయి బ్యాటర్లను ఔట్‌ చేశాడు. ఆ రెండు బంతులకు వికెట్లు విరిగిపోయాయి. దీంతో టోర్ని నిర్వాహకులకు లక్షల్లో నష్టం వాటిల్లిందని కథనాలు వెలువడ్డాయి. నిజంగా అంత ఖరీదైన వికెట్లు వాడుతున్నారా..!

Published : 24 Apr 2023 17:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఐపీఎల్‌ (IPL 2023) టోర్నీలో పంజాబ్‌ కింగ్స్‌ - ముంబయి ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ వేసిన చివరి ఓవర్‌.. ఐపీఎల్‌లో అత్యంత ‘ఖరీదైనది’గా మీడియా, నిపుణులు చెబుతున్నారు. ఖరీదంటే ఇక్కడ ఎక్కువ పరుగులు ఇవ్వడం కాదు.. రెండు వికెట్లు తీసుకోవడం..! అది కూడా యార్కర్లతో మిడిల్‌స్టంప్స్‌ను విరగ్గొట్టి మరీ విజయం అందించడం. ఆ విరిగిన స్టంప్స్‌ ధర ఎంత లేదన్నా లక్షల్లో ఉంటుంది. మీడియా మాత్రం ఐపీఎల్‌ నిర్వాహకులకు రూ.60 లక్షల వరకు నష్టం ఉంటుందని కథనాల్లో పేర్కొంది. అంటే ఈ లీగ్‌లో ముగ్గురు ఆటగాళ్ల కనీస ధరకు సమానం..!

క్రికెట్‌లో తొలిసారి రూల్స్‌ రాసుకొన్న 1744 సంవత్సరంలో కేవలం రెండు స్టంప్స్‌ మాత్రమే ఉండేవి. వాటిపై ఒక పెద్ద బెయిల్‌ పెట్టి ఆడేవారు. కానీ, బంతి రెండు స్టంప్స్‌ మధ్య నుంచి వెళ్లి.. బెయిల్‌ పడకుండా ఉన్న సందర్భాలు చోటుచేసుకున్నాయి. దీంతో 1775లో లంపీస్టీవెన్సన్‌ అనే వ్యక్తి తొలిసారిగా మూడు స్టంప్స్‌ను ఆటకు పరిచయం చేశాడు. ఆ తర్వాత కాలంలో ఆ నియమం ఆటలో స్థిరపడిపోయింది. కాకపోతే చెక్కతో చేసిన ఈ స్టంప్స్‌, బెయిల్స్‌ అప్పుడప్పుడు బంతి తాకినా కిందపడేవి కాదు. దీంతో బ్యాటర్లు బతికిపోయేవారు. 2008లో ఆస్ట్రేలియాకు చెందిన బీబీజీ స్పోర్ట్స్‌ అనే కంపెనీ కెమెరాలను అమర్చిన స్టంప్స్‌ను పరిచయం చేసింది. ఆ తర్వాత సదరు కంపెనీని స్టంప్స్‌ కామ్‌ లిమిటెడ్‌ అనే సంస్థ కొనుగోలు చేసింది. 2008 మార్చిలో జరిగిన ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్‌లో వీటిని తొలిసారి వినియోగించారు.

ఆ తర్వాత ఆస్ట్రేలియా మాజీ గ్రేడ్‌ క్రికెటర్‌ బ్రాంటే ఎకెర్మెన్‌ తొలిసారి ఎల్‌ఈడీ స్టంప్స్‌, బెయిల్స్‌ను తయారు చేశాడు. తన కుమార్తె వద్ద ఉన్న చిన్న ఆటబొమ్మను చూసి స్ఫూర్తి పొంది దీనిని రూపొందించారు. వీటిల్లో అమర్చిన సూక్ష్మమైన మైక్రోప్రాసెసర్‌ బెయిల్స్‌, స్టంప్స్‌ మధ్య కదలికలను సెకన్‌లో 1000వ వంతులో గుర్తిస్తుంది. అది కూడా బెయిల్‌ రెండు వైపులా స్వల్ప కదలిక ఉండాలి. బెయిల్స్‌లోని మైక్రోప్రాసెసర్‌ స్టంప్స్‌కు  సంకేతాలను పంపుతుంది. అప్పుడు దానిలోని లైట్లు కూడా వెలుగుతాయి. ఆ తర్వాత వీటిని జింగ్‌ కంపెనీ తయారు చేయడం మొదలుపెట్టింది. 2012 బిగ్‌బాష్‌ లీగ్‌లో తొలిసారి జింగ్‌ స్టంప్స్‌ను, బెయిల్స్‌ను వాడారు. అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ జింగ్‌ పేటెంట్‌ ఉన్న ఎలక్ట్రానిక్‌ క్రికెట్‌ వికెట్‌ వ్యవస్థకు ఆమెదముద్ర వేసింది. 2014 అండర్‌-19 ప్రపంచకప్‌లో దీనిని తొలిసారి ఐసీసీ వినియోగించింది. ఇక ఐపీఎల్‌లో 2016 నుంచి ఈ రకం స్టంప్స్‌ను వినియోగించడం మొదలుపెట్టారు.

ఇవి ఖరీదైనవేనా..

జింగ్‌ సంస్థ ఆట అవసరాలకు అనుగుణంగా పలు రకాలుగా స్టంప్స్‌ను తయారు చేస్తోంది. ఆయా స్థాయిలను బట్టి వేర్వేరు ధరలు ఉన్నాయి. ఓ ఆంగ్లపత్రిక ప్రతినిధి ఈ సంస్థకు ఫోన్‌ చేసి ధర అడగ్గా.. కంపెనీ ప్రతినిధి కచ్చితంగా చెప్పలేదు. కానీ, ‘చౌకగా మాత్రం లభించవు’ అని పేర్కొన్నారు. దీనిపై జింగ్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌, ఈ వికెట్ల రూపకర్త బ్రాంటే ఎకెర్మెన్‌ మాట్లాడుతూ.. ‘‘వీటి నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్‌, సెన్సర్లు ప్రతిసారి కచ్చితంగా పనిచేసేట్లు ఉండాలి. మేము వీటిల్లో అన్నిటిని పలు మార్లు పరీక్షించి స్టంప్స్‌ తయారు చేస్తాము. అందుకే కచ్చితంగా చౌకకాదు’’ అని పేర్కొన్నారు. బీసీసీఐ ఎంత చెల్లించిందన్నది కూడా గోప్యంగా ఉంచారు.

సాధారణంగా ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో వాడే వికెట్‌ సెట్‌ ధర 40 వేల డాలర్లు ఉంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అదే స్థానిక క్రికెట్‌లకు వాడే సెట్‌ ధరలు కొన్ని వేలల్లోనే ఉంటాయని వెల్లడించారు. కానీ, ఈ రెండింటి నాణ్యత వేర్వేరుగా ఉంటుందని తెలిపారు. ఇకపోతే బీసీసీఐ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు బోర్డులు జింగ్‌ సంస్థ నుంచి నేరుగా వికెట్లను కొనుగోలు చేయకండా కేవలం అద్దెకు మాత్రమే తీసుకొనే అవకాశం ఎక్కువగా ఉంది. 

గతంలో క్రికెట్‌ మ్యాచ్‌ గెలవగానే క్రీడాకారులు జ్ఞాపకం కోసం మ్యాచ్‌లో స్టంప్స్‌ను తీసుకొనేవారు. కానీ, ఇప్పుడు అది సాధ్యం కాదు. 2015 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ధోని సారథ్యంలో భారత్‌ సేన పాకిస్థాన్‌ను ఓడించింది. ఆ తర్వాత భారత సారథి ధోని తన అలవాటు ప్రకారం వికెట్‌ను తీసుకొంటుండగా అంపైర్‌ ఇయాన్‌ గౌల్డ్‌ అడ్డుకొన్నాడు. దీంతో మ్యాచ్‌ అనంతరం క్రీడాకారులు స్టంప్స్‌ను తీసుకోవడం అనేది క్రికెట్‌లో ఓ చరిత్రగా మిగిలిపోయిందన్నది స్పష్టమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని