Jake Fraser: బుమ్రా బౌలింగ్‌ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్‌ ఫ్రేజర్

దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్‌ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు.

Published : 28 Apr 2024 09:37 IST

ఇంటర్నెట్ డెస్క్: ముంబయి బౌలింగ్‌ను చిత్తు చేస్తూ దిల్లీ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ చెలరేగిపోయాడు. కేవలం 27 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. దీంతో 257/4 భారీ స్కోరు చేయగలిగింది. బుమ్రా వంటి డేంజరస్ బౌలింగ్‌లోనూ ఫ్రేజర్ దూకుడుగా ఆడాడు. ల్యూక్ వుడ్‌ను టార్గెట్‌ చేసిన ఈ ఆసీస్ కుర్రాడు ఉన్నంతసేపు దిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గానూ నిలిచాడు. తన అటతీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఫ్రేజర్‌.. ముంబయి బౌలింగ్‌ను ఎదుర్కోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్లను కొట్టాలంటే చాలా తెగువ కావాలి. అతడి వీడియో ఫుటేజీలను విపరీతంగా చూశా. ప్రతి బంతిని నిశితంగా గమనించి హిట్టింగ్‌ చేయడానికి ప్రయత్నించా. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొనే అవకాశం ఐపీఎల్‌ ద్వారా దక్కింది. ఈ ఇన్నింగ్స్‌తో నా ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా.. జట్టుకు ఎంతో ఉపయోగపడటం ఆనందంగా ఉంది. బయట నుంచి చూస్తే.. ఈ లీగ్‌లో పోటీ ఎలా ఉంటుందో తెలియదు. అందుకే, ఇతర లీగ్‌లతో పోలిస్తే భారీ ఎత్తున సక్సెస్ కాగలిగింది’’ అని జేక్ ఫ్రేజర్ వ్యాఖ్యానించాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

  • ఒక ఐపీఎల్‌ సీజన్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన తొలి జట్టుగా ముంబయి నిలిచింది. దిల్లీపై 481 పరుగులు (234/5, 247/9) చేసింది.
  • ఐపీఎల్‌లో ముంబయికిదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. దిల్లీపై 247/9 స్కోరు చేసింది. అంతకుముందు హైదరాబాద్‌పై ఇదే సీజన్‌లో 246/5 స్కోరు చేసింది. ఈ రెండు మ్యాచుల్లోనూ ముంబయి ఓడిపోయింది.
  • ఒక సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ముగిశాక.. అతి తక్కువ విజయాలను నమోదు చేయడం ఇది నాలుగోసారి. 2022 సీజన్‌లో ఒకే ఒక్క విజయం సాధించగా.. 2014, 2018, 2024లో మూడు మ్యాచుల్లోనే ముంబయి గెలిచింది.
  • ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌లో 500+ కంటే ఎక్కువ పరుగులు నమోదు కావడం ఇది నాలుగోసారి. అవన్నీ ఇదే సీజన్‌లోనే జరగడం మరో విశేషం. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 504 పరుగులు చేశాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని