Asia Cup Super 4 : ఒక్క విజయమూ లేదు.. మరి భారత్‌కు ఫైనల్‌ ఛాన్స్‌ ఉందా..?

ఆసియా కప్‌ సూపర్‌-4లో వరుసగా రెండు ఓటములు.. భారత్‌ ఫైనల్‌ అవకాశాలను సంక్లిష్టంగా మార్చాయి. ఇక మిగిలింది ఒకే ఒక మ్యాచ్‌.. అదీనూ అఫ్గానిస్థాన్‌తో...

Updated : 07 Sep 2022 14:15 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ సూపర్‌-4లో వరుసగా రెండు ఓటములు.. భారత్‌ ఫైనల్‌ అవకాశాలను సంక్లిష్టంగా మార్చాయి. ఇక మిగిలింది ఒకే ఒక మ్యాచ్‌.. అదీనూ అఫ్గానిస్థాన్‌తో గురువారం తలపడనుంది. అయితే అఫ్గానిస్థాన్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. సూపర్‌-4 దశలో ఇప్పటి వరకు ఒక్క విజయం సాధించని టీమ్ఇండియా ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా..? అనే సందేహం రావడం సహజం. అయితే.. అవకాశాలు కాస్త ఉన్నాయనే చెప్పాలి. కానీ ఆచరణలో మాత్రం అది అంత తేలికైన విషయం కాదు. మరి అవేంటో ఓసారి చూద్దాం.. 

పాక్‌ ఓడాలి: ఇవాళ అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇందులో పాక్‌ గెలిస్తే ఇక భారత్‌ ఇంటి ముఖం పట్టినట్లే. ఇప్పటికే పాకిస్థాన్‌ ఒక విజయంతో ముందడుగు వేసింది. అదీనూ టీమ్ఇండియాపైనే గెలిచింది. ఒక వేళ మ్యాచ్‌ రద్దైనప్పటికీ పాక్‌ మూడు పాయింట్లు సాధించి ముందడుగు వేస్తుంది. కాబట్టి ఇవాళ్టి మ్యాచ్‌లో అఫ్గాన్‌ చేతిలో పాక్‌ కచ్చితంగా ఓడాలి. అయితే పాక్‌ ఫామ్‌ను చూస్తే కష్టమేనని చెప్పాలి. అఫ్గాన్‌ కూడా తక్కువేమీ కాదు. లంకపై తృటిలో ఓటమిపాలైంది కానీ గ్రూప్‌ స్టేజ్‌లో అఫ్గాన్‌ అదరగొట్టేసి మరీ సూపర్‌-4లోకి అడుగుపెట్టింది.

అఫ్గాన్‌పై భారత్ గెలవాలి: అఫ్గాన్‌ మీద ఇవాళ పాక్‌ విజయం సాధిస్తే టీమ్‌ఇండియా ఇంటిబాట పడుతుంది. గురువారం అఫ్గాన్‌తో మ్యాచ్‌ నామమాత్రమవుతుంది. ఒకవేళ పాక్‌ ఓడితే మాత్రం భారత్‌కు అద్భుత అవకాశం వచ్చినట్లే. అఫ్గాన్‌ మీద మంచి విజయంతో భారీగా నెట్‌రన్‌రేట్‌ను సాధిస్తే ఫైనల్‌ రేసులో నిలుస్తుంది. సూపర్‌-4లో తొలి రెండు మ్యాచుల్లో ఆడినట్లు కాకుండా టీమ్‌ఇండియా విజృంభించాలి. భారీ తేడాతో విజయం సాధిస్తేనే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే టీ20ల్లో ఏదైనా సాధ్యమే. అఫ్గాన్‌ మంచి ఫామ్‌లో ఉండటంతో భారత్‌ తన స్థాయి ఆటను ప్రదర్శించాల్సిందే.

మళ్లీ లంక విజయం సాధిస్తేనే.. : సూపర్‌-4లో భారత్‌, అఫ్గాన్‌ జట్ల మీద వరుసగా విజయాలు నమోదు చేసిన శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంది. ఇక రెండో బెర్తు కోసం మూడు జట్లు బరిలో ఉన్నాయి. అందులోనూ పాక్‌ కాస్త ముందంజలో ఉంది. అయితే రేసులో నిలవాలంటే అఫ్గాన్‌ మీద భారత్‌ గెలవడం ఎంత ముఖ్యమో.. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో లంక చేతిలో పాక్‌ ఓడాలి. అప్పుడే నెట్‌రన్‌రేట్‌ ఆధారంగా రెండో జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. అలా జరగాలంటే అఫ్గాన్‌, లంకపై పాకిస్థాన్‌ ఓడితేనే భారత్‌కు అవకాశం ఉంటుంది. ఈ రెండు మ్యాచుల్లో పాక్‌ ఒక్కటి గెలిచినా అఫ్గాన్‌తోపాటు భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు ఇవాళ అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్‌ విజయం సాధిస్తే మాత్రం సూపర్‌-4లో మిగిలిన రెండు మ్యాచ్‌లు నామమాత్రం అవుతాయి. ఒకవేళ పాక్‌పై అఫ్గానిస్థాన్‌ గెలిస్తే మాత్రం.. భారత్‌ భవితవ్యం లంక చేతిలో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని