WI vs IND: భారత్‌కు గెలవాలి అనే కసి మరింత అవసరం: వెంకటేశ్ ప్రసాద్‌

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు చాలా సాధారణ ఆటతీరు కనబర్చిందని టీమ్‌ఇండియా మాజీ ఫాస్ట్‌బౌలర్ వెంకటేశ్‌ ప్రసాద్‌ (Venkatesh Prasad) అన్నాడు.

Published : 07 Aug 2023 15:58 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌ టూర్‌ (WI vs IND)లో టెస్టు, వన్డే సిరీస్‌లను సునాయసంగా కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా (Team India).. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో మాత్రం తడబడుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌లో 0-2 తేడాతో వెనకబడి పోయింది. సిరీస్‌ చేజిక్కించుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. రెండో టీ20లో చివర్లో భారత్‌కు విజయం సాధించే అవకాశం వచ్చినా మరోసారి పట్టు విడిచి ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఆటతీరుపై భారత మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) బౌలర్లను వినియోగించుకున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఫాస్ట్ బౌలర్  వెంకటేశ్‌ ప్రసాద్‌ (Venkatesh Prasad) కూడా భారత జట్టు ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

నా తొలి హాఫ్ సెంచరీ.. సమైరాకి అంకితం: తిలక్ వర్మ

‘‘విండీస్‌తో రెండో టీ20లో భారత్‌  చాలా సాధారణంగా ఆడింది. 2007 టీ20 ప్రపంచ కప్ తర్వాత ఐపీఎల్ (2008లో) ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 7 సార్లు టీ20 ప్రపంచకప్‌ జరగ్గా.. మనం (భారత్‌) ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయాం. ఫైనల్‌కు ఒకేసారి చేరాం. భారత జట్టుకు గెలవాలి అనే కసి మరింత అవసరం’’ అని వెంకటేశ్ ప్రసాద్‌ ట్విటర్‌లో రాసుకొచ్చాడు. రెండో టీ20లో భారత కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య బౌలర్లను వినియోగించుకున్న తీరును కూడా వెంకటేశ్‌ ప్రసాద్‌ తప్పుబట్టాడు. కీలక సమయంలో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి భారత్‌ను పోటీలోకి తెచ్చిన యుజువేంద్ర చాహల్‌తో పూర్తి కోటా ఓవర్లు  బౌలింగ్‌ చేయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి సమయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు. వెస్టిండీస్‌, భారత్‌ మధ్య మూడో టీ20 ఆగస్టు 8న జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని