WI vs IND: విండీస్‌తో రెండో టీ20.. అతడికి అవకాశం వచ్చేనా?

వెస్టిండీస్ - భారత్ జట్ల మధ్య (WI vs IND) ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్‌ జరగనుంది. తొలి టీ20లో ఓడిపోవడంతో సిరీస్‌ రేసులో వెనుకబడింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి పుంజుకోవాలని టీమ్ఇండియా చూస్తోంది. 

Published : 06 Aug 2023 16:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను (WI vs IND) భారత్‌ ఓటమితో మొదలుపెట్టింది. తొలి టీ20 మ్యాచ్‌లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయంపాలైంది. స్వల్ప లక్ష్య ఛేదనలో డెబ్యూ బ్యాటర్ తిలక్ వర్మ (39) మినహా మిగతా బ్యాటర్లు విఫలమై నిరాశపరిచారు. దీంతో రెండో టీ20 విజయం సాధించి సిరీస్‌ రేసులోకి రావాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. ఈ క్రమంలో జట్టులో మార్పులు ఉండే అవకాశం ఉంది. మరి ఎవరిని ఉంచుతారు? పక్కన పెట్టే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరు? కీలక విషయాలపై ఓ లుక్కేద్దాం.. 

అప్పటి వరకూ ఆడాలని ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

మూడో వన్డే మ్యాచ్‌లో చెలరేగి ఆడిన ఓపెనర్లు విండీస్‌తో తొలి టీ20లో మాత్రం తేలిపోయారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్ గిల్ విఫలమైన క్రమంలో ఓపెనింగ్‌ స్థానాలు మారే అవకాశం ఉంది. ఎడమచేతి వాటం బ్యాటర్ ఇషాన్‌కిషన్‌ను పక్కన పెట్టి ఐపీఎల్‌లో సంచలన ఆటతీరు ప్రదర్శించి.. టెస్టు అరంగేట్రంలోనే  భారీ శతకంతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్‌కు స్థానం దక్కే అవకాశం ఉంది. అప్పుడు శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి యశస్వి ఇన్నింగ్స్‌ ప్రారంభించాల్సి ఉంటుంది. తొలి టీ20లో సంజూ శాంసన్ మెరుగ్గా ఆడలేకపోయాడు. అయినా రెండో టీ20లో అవకాశం ఇవ్వొచ్చు. మిగతా బ్యాటర్ల విషయంలో పెద్దగా మార్పులు ఉండవు. 

బౌలర్ల విషయంలో.. 

స్పిన్‌కు అనుకూలంగా ఉండే ఛాన్స్‌ ఉండటంతో సమస్యలు లేవు.. కానీ వారిని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య వినియోగించుకున్న తీరే సరిగా లేదు. ఒకే ఓవర్‌లో కీలక వికెట్లను తీసిన చాహల్‌ను ఎనిమిది ఓవర్లపాటు బౌలింగ్‌కు ఆపాడు. అతడినే కంటిన్యూ చేయించి బౌలింగ్‌ ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అక్షర్‌ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, చాహల్‌తో కూడిన స్పిన్‌ విభాగం పటిష్ఠంగానే ఉంది. అయితే, అక్షర్‌ పటేల్ బౌలింగ్‌లో విఫలమైనప్పటికీ.. బ్యాటింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించాడు. రిజర్వ్‌ బెంచ్‌పై  వన్డేల్లో ప్రభావం చూపిన ముకేశ్‌ కుమార్‌ ఈసారి రాణించలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో ఉమ్రాన్‌ లేదా అవేశ్‌ ఖాన్‌ను బరిలోకి దింపినా ఆశ్చర్యం లేదు. 

వారిద్దరితో జాగ్రత్త..

తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జట్టులో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రాణించారు. బ్రాండన్ కింగ్‌, నికోలస్‌ పూరన్, రోవ్‌మన్‌ పావెల్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మిగతా బ్యాటర్లలో ఓపెనర్ కేల్ మేయర్స్, హెట్‌మయేర్ డేంజరస్‌ ఆటగాళ్లు. వీరు క్రీజ్‌లో కుదురుకుంటే మాత్రం భారీ షాట్లు కొట్టేస్తారు. రెండో టీ20లో వీరితోనూ భారత బౌలర్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై కేవలం ఒక్క స్పిన్నర్‌తోనే బరిలోకి దిగినా విండీస్‌ విజయం సాధించింది. నలుగురు పేసర్లు కలిసి భారత బ్యాటర్లకు అడ్డుకట్ట వేశారు.

పిచ్‌, వాతావరణం

గయానాలో పిచ్‌ కూడా భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. తొలి   మ్యాచ్‌లోలాగే స్పిన్నర్లకు సహకారం లభించవచ్చు. వెస్టిండీస్‌ చివరిసారి ఇక్కడ ఆడిన మ్యాచ్‌లో స్పిన్‌ చాలా కీలక పాత్ర పోషించింది. బంగ్లాతో జరిగిన ఆ వన్డే మ్యాచ్‌లో బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు చేయడానికి చాలా ఇబ్బందిపడ్డారు.  ఆ తర్వాత టీ20లో తలపడ్డప్పుడూ అంతే. ఈ నేపథ్యంలో రెండో టీ20లో భారీ స్కోర్లు సందేహమే. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌ గయానా వేదికగా రాత్రి  8 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్‌ను వీక్షించాలంటే జియో సినిమా, ఫ్యాన్‌కోడ్‌ ఓటీటీలతోపాటు దూరదర్శన్‌ టీవీలో చూసే అవకాశం ఉంది. 

తుది జట్లు

భారత్: శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్), సంజూ శాంసన్‌ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్ ఖాన్ / ఉమ్రాన్‌ మాలిక్

విండీస్‌: కేల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్‌ ఛార్లెస్‌, నికోలస్‌ పూరన్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్‌మయెర్, రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్‌, రొమారియో షెఫెర్డ్‌, అకీస్ హుసేన్, అల్జారీ జోసెఫ్, ఓబెద్ మెకాయ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని