FIFA: మానసిక క్షోభను జయించి.. ప్రపంచకప్‌ విన్నింగ్‌ గోల్‌ కొట్టి..!

ఆండ్రెస్‌ ఇనెయెస్టా ఒంటిచేత్తో స్పెయిన్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించాడు. ఈ టోర్నీకి ముందు వరకు అతడు మానసిక కుంగుబాటుతో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. కానీ, ఈ టోర్నీలో అద్బుతంగా రాణించాడు. 

Updated : 27 Nov 2022 11:27 IST

(ఫొటో: ఫిఫా టీవీ) 

ఇంటర్నెట్‌డెస్క్‌: 2010 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో స్పెయిన్‌ ఆటగాడు ఆండ్రెస్‌ ఇనెయెస్టా ఓ పెను సంచలనం. ఈ టోర్నీకి దాదాపు ఏడాది ముందు తన సన్నిహిత మిత్రుడు, జట్టులో సెంట్రల్‌ డిఫెండర్‌ డేనియల్‌ జార్క్‌ గుండెపోటుతో మరణించాడు. నాటి నుంచి ఇనెయెస్టా మానసికంగా కుంగిపోయాడు. టోర్నీకి ముందు చాలా సార్లు మానసిక చికిత్స పొందాడు. ట్రైనింగ్‌ సెషన్లను అర్ధాంతరంగా ముగించేవాడు. ఆ పరిస్థితుల్లోనే స్పెయిన్‌ తరఫున  బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో స్పెయిన్‌, నెదర్లాండ్స్‌ ఫైనల్స్‌కు చేరుకొన్నాయి. 

డేవిడ్‌ విల్లా, ఇకర్‌ కాసిల్లస్‌ వంటి స్టార్లతో స్పెయిన్‌ జట్టు బలంగా ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌లో అది ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఈ విషయం గ్రహించిన నెదర్లాండ్స్ అటాకింగ్‌ గేమ్‌ కంటే.. రక్షణాత్మకంగా ఆడటానికి ప్రాధాన్యం ఇచ్చింది. గోల్‌ పోస్టును దుర్బేధ్యంగా మార్చేసింది. దీంతో మ్యాచ్‌ టైమ్‌ (90 నిమిషాలు)లో గోల్‌ చేయడం స్పెయిన్‌ ఆటగాళ్ల వల్ల కాలేదు. ఇరు జట్లు 0-0 స్కోర్‌తో ఉన్నాయి. దీంతో అదనపు సమయం కేటాయించారు.  కాలం కరుగుతున్నా.. ఇరుపక్షాలకు గోల్‌ దక్కలేదు. మరో 4 నిమిషాల్లో సమయం ముగుస్తుందనగా.. ఆండ్రెస్‌ ఇనెయెస్టా ఓ వాలీడ్‌ షాట్‌తో అద్భుతమైన గోల్‌ చేసి స్పెయిన్‌కు ఆధిక్యం అందించాడు. ఈ సమయంలో సంబరాలు చేసుకొంటూ చొక్కావిప్పాడు. అతడి బనియన్‌పై ‘డేని జార్క్‌.. ఎప్పుడూ మాతోనే ఉన్నావు’ అని రాసి ఉంది. అతడు షర్ట్‌ విప్పినందుకు ఎల్లోకార్డుకు గురయ్యాడు. ఈ మ్యాచ్‌ను స్పెయిన్‌ గెలిచింది. దీంతో తొలిసారి ప్రపంచకప్‌ ఆ దేశానికి సొంతమైంది. 

ఈ మ్యాచ్‌లో రెఫరీలు 14 సార్లు ఎల్లోకార్డులు చూపించారు. ఇదొక రికార్డు. 1986 అర్జెంటీనా-వెస్ట్‌ జర్మనీ మ్యాచ్‌లో ఆరు ఎల్లో కార్డులే రికార్డుగా ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని