IPL 2023: ఢీ అంటున్న దిల్లీవాలాలు..!

ఇద్దరూ దిల్లీ వాలాలే.. పాక్‌తో మ్యాచ్‌ అంటే వీరిద్దరూ కదం తొక్కాల్సిందే.. మైదానంలో దూకుడులోనూ ఏమాత్రం తగ్గరు. విజయం కోసం చివరి వరకు పోరాడటంలో వెనుకంజ వేయరు. ఇన్ని సారూప్యతలున్న ఇద్దరూ విరోధుల వలే ప్రవర్తించి ఐపీఎల్‌ జరిమానాకు గురయ్యారు. 

Updated : 02 May 2023 14:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir), కోహ్లీ (Virat Kohli) ఇద్దరూ దిల్లీ నుంచి వచ్చిన వారే. దూకుడులో ఏమాత్రం తగ్గని ఆటగాళ్లు.. మైదానంలో విజయమే ఊపిరిగా పోరాడుతారు. వీరిద్దరి మధ్య ఒకప్పుడు అద్భుతమైన మధురజ్ఞాపకాలు ఉన్నాయి. ఓ సందర్భంలో గంభీర్‌ తనకు వచ్చిన ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డును జూనియర్ అయిన కోహ్లీకి ఇవ్వాలని వేదికపైనే కోరాడు. 2009లో శ్రీలంకతో జరిగిన వన్డేలో వీరిద్దరు కలిసి 224 పరుగుల భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు. ఆ మ్యాచ్‌లో శ్రీలంక విసిరిన 316 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించింది. గంభీర్‌ 150 పరుగులు చేయగా.. కోహ్లీ 114 బంతుల్లో 107 పరుగులు బాదాడు. వన్డేల్లో విరాట్‌ తొలి శతకం అది. కోహ్లీ ఎంతో ప్రతిభావంతుడని.. భవిష్యత్తులో 100 శతకాలు పూర్తి చేస్తాడని గంభీర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అప్పటికే గంభీర్‌ జట్టులో సీనియర్‌ ఆటగాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో 54 బంతుల్లో 75 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. అటువంటి అద్భుతమైన అనుబంధం ఉన్న ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

  • 2013లో ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌ ఈ బంధాన్ని బీటలు వార్చింది. ఆ ఏడాది బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ-కేకేఆర్‌ జట్లు తలపడ్డాయి. ఆర్సీబీకి కోహ్లీ నాయకత్వం వహించగా.. కేకేఆర్‌కు గంభీర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆర్సీబీ విజయానికి 11 ఓవర్లలో 80 పరుగులు అవసరమైన సమయంలో కేకేఆర్‌ బౌలర్‌ బాలాజీ బంతికి కోహ్లీ ఔటయ్యాడు. దీంతో కేకేఆర్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకొన్నారు. గౌతమ్‌ గంభీర్‌ వైపు నుంచి ఏవో కామెంట్లు వినిపించగానే డగౌట్‌కు వెళుతున్న కోహ్లీ ఒక్కసారిగా భగ్గుమన్నాడు. ఆ సమయంలో కోహ్లీ-గంభీర్‌ మధ్య వాగ్వాదం నడిచింది. అక్కడే ఉన్న రజత్‌ భాటియా, ఇతర ఆటగాళ్లు, అంపైర్లు వారిని శాంతింపజేశారు.
  • 2016లో మరోసారి వీరిద్దరి మధ్య ఐపీఎల్‌లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ఏడాది ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 183 పరుగులు సాధించింది. గంభీర్‌ 34 బంతుల్లో 51 పరుగులు చేశాడు. లక్ష్యఛేదనకు దిగిన ఆర్సీబీ విజయం దిశగా సాగుతోంది. అప్పటికే కోహ్లీ క్రీజులోనే ఉన్నాడు. 19వ ఓవర్లో కోహ్లీ పరుగు తీసి నాన్‌స్ట్రైకర్‌ వైపు చేరుకోగా.. గంభీర్‌ దూకుడుగా బంతిని అతడివైపు విసిరాడు. ఈ ఘటన మరోసారి వివాదానికి కారణమైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 51 బంతుల్లో 75 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకొన్నాడు. 
  • గతేడాది దాదాపు 1,020 రోజుల తర్వాత విరాట్‌ అంతర్జాతీయ శతకం సాధించడంపై గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘విరాట్‌ స్థానంలో మరెవరైనా జట్టులో ఉండి.. మూడేళ్లు శతకం సాధించకపోతే అతడు జట్టులో కొనసాగేవాడు కాదు’’ అని వ్యాఖ్యానించాడు. వ్యాఖ్యాతగా మారిన తర్వాత కూడా గంభీర్‌ చాలా సార్లు విరాట్‌ విషయంలో ప్రతికూల వ్యాఖ్యలు చేశాడు.
  • అయితే, తమ మధ్య వ్యక్తిగత వైరం లేదని.. కేవలం మ్యాచ్‌ వరకే దూకుడుతనం పరిమితమని గంభీర్ 2016లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మైదానం బయట విరాట్‌ తనకు మంచి మిత్రుడని పేర్కొన్నాడు. మరో వైపు మంగళవారం ఉదయం కోహ్లీ (Virat Kohli) తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టాడు. ‘‘మనం వినేదంతా అభిప్రాయం మాత్రమే.. వాస్తవం కాదు. మనం చూసేదంతా దృష్టికోణం మాత్రమే.. నిజం కాదు’’ అని మార్క్‌స్‌ అరిలియస్‌ (రోమన్ చక్రవర్తి) అన్న మాటలను విరాట్‌ పోస్ట్‌ చేశాడు. దీంతో గంభీర్‌ (Gautam Gambhir)తో వాగ్వాదానికి సంబంధించి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న కథనాలకు సమాధానంగానే కోహ్లీ ఈ పోస్ట్‌ పెట్టినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు