Team India: అతడే మ్యాచ్‌ను 50% గెలిపిస్తాడు.. యశస్వి అద్భుతమే కానీ...: కైఫ్

ఇప్పుడంతా వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) మీదనే చర్చ. ప్రస్తుతం విండీస్‌ పర్యటనలో ఉన్న భారత్‌ టీ20 సిరీస్‌ ఆడుతోంది. అయితే, సీనియర్లు విరాట్, రోహిత్ లేకుండానే పాండ్య నాయకత్వంలో తలపడుతోంది.

Updated : 08 Aug 2023 18:15 IST

రాహుల్‌, శ్రేయస్‌ పునరాగమనం చేస్తే...

వెస్టిండీస్‌ పర్యటనలో (WI vs IND) యశస్వి జైస్వాల్, తిలక్‌ వర్మ వంటి యువ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన ఇస్తున్నారని భారత మాజీ ఆటగాడు మహమ్మద్‌ కైఫ్ (Kaif) అభినందించాడు. అయితే, వచ్చే వన్డే ప్రపంచకప్‌లో మాత్రం యువకులు కాకుండా సీనియర్లతోనే బరిలోకి దిగితే బాగుంటుందని సూచించాడు. స్టార్‌ పేసర్ బుమ్రా (Bumarh) తిరిగి పుంజుకొని వస్తే టీమ్‌ఇండియాకు లాభిస్తుందని పేర్కొన్నాడు. అతడే మ్యాచ్‌ విన్నర్‌గా అభివర్ణించాడు. జట్టులో బుమ్రా ఉంటే సగం మ్యాచ్‌ను అతడే గెలిపిస్తాడని కైఫ్ వ్యాఖ్యానించాడు. 

‘‘వెస్టిండీస్‌తో భారత్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం వల్ల నష్టమేం లేదు. దానిపై చర్చ కూడా అనవసరం. సోషల్‌ మీడియాలో చాలా నెగిటివ్‌ స్పందనలను చూశా. అయితే, వీటన్నింటితో సంబంధం లేకుండా మన జట్టు అద్భుతంగా ఆడిందని మాత్రం చెప్పగలను. కీలక ఆటగాళ్లు లేకుండానే విండీస్‌ జట్టుతో పోరాడుతోందని గమనించాలి. ఇక వరల్డ్‌ కప్‌ నాటికి సీనియర్ బౌలర్ బుమ్రా ఫిట్‌నెస్‌ సాధిస్తే భారత్‌కు ఎంతో ప్రయోజనం. అతడు ఉంటే టీమ్ఇండియా 50% మ్యాచ్‌ గెలిపించేస్తాడు. కేఎల్ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ కూడా జట్టులోకి పునరాగమనం చేస్తే భారత్‌ బలంగా మారుతుంది. మరోవైపు కొత్త ప్లేయర్లు కూడా చోటు కోసం రేసులో ఉన్నారు. మరీ ముఖ్యంగా యశస్వి జైస్వాల్ అద్భుత ప్రతిభ కలిగిన ఆటగాడు. ఇషాన్ కిషన్ కూడా ఉన్నప్పటికీ అతడికి కూడా కష్టమే అవుతుంది’’ అని కైఫ్ తెలిపాడు.

కనీసం పిచ్‌పై గ్రాస్‌ లేదు.. నెట్స్‌ కూడా పాతవే: అశ్విన్


వారి వ్యూహం అదే: అశ్విన్‌

‘‘వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ను టార్గెట్‌ చేస్తూ ఫేవరేట్‌ జట్టుగా చెబుతుంటారు. ఇదంతా కొందరు ప్రదర్శించే వ్యూహం. వారి జట్ల మీద ఉన్న ఒత్తిడిని తగ్గించి టీమ్‌ఇండియాపై దృష్టి పడేలా చేస్తుంటారు. ప్రతి ఐసీసీ ఈవెంట్‌కు ముందు ఇదే తంతు. ఆస్ట్రేలియా జట్టు కూడా చాలా పటిష్ఠంగా ఉంది. కాబట్టి, ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. ఇక మెగా టోర్నీల సందర్భంగా అభిమానుల కోలాహలం భారీగా ఉంటుంది. క్రికెట్‌ మ్యాచ్‌ పట్ల ఆసక్తిని వారే మార్చేస్తుంటారు. ఈసారి వన్డే ప్రపంచ కప్ మన దగ్గరే జరగనుంది. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఇక్కడకు వచ్చే క్రికెటర్లను సాదరంగా స్వాగతించాలి. మన ఆతిథ్యం అద్భుతంగా ఉండాలి’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు. 


ద్రవిడ్‌ నుంచి హార్దిక్‌కు ఇంకాస్త సహకారం: పార్థివ్‌

‘‘ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను సమర్థవంతంగా నడిపించిన హార్దిక్‌కు విండీస్‌ పర్యటనలో చేదు అనుభవం ఎదురవుతోంది. తప్పిదాలు చేయడంతో జట్టు ఓటములను చవిచూడాల్సి వస్తోంది. గుజరాత్‌ తరఫున ఆడేటప్పుడు ఆశిశ్‌ నెహ్రా మద్దతుగా ఉండేవాడు. బౌలింగ్‌ విషయంలో ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ నడిపించేవాడు. ఇప్పుడు రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి కూడా ఇలాంటి మద్దతే హార్దిక్‌కు కావాలి. టీ20ల్లో క్షణంలోనే ఫలితం మారిపోతూ ఉంటుంది. ఒక్క పొరపాటు చేసినా ఓటమి చూడాల్సిన పరిస్థితి’’ అని పార్థివ్‌ వ్యాఖ్యానించాడు.

ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని