Virat Kohli : నా జర్నీ ఇక్కడే ప్రారంభమైంది.. సొంత మైదానంలో చరిత్ర సృష్టించడంపై కోహ్లీ

పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన మైలురాయి చేరుకున్నాడు. ఈ టోర్నీలో 7 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

Updated : 07 May 2023 14:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : దిల్లీ(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు(Royal Challengers Bangalore) ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) చరిత్ర సృష్టించాడు. దిల్లీపై 46 బంతుల్లో విరాట్‌ 55 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌ చరిత్రలో 7 వేల పరుగులు దాటిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. ఈ మైలురాయిని కోహ్లీ.. తన సొంత మైదానంలో సాధించడం విశేషం.

50.. 50.. 50

విరాట్‌ కోహ్లీ ఐపీఎల్‌ల్లో మొత్తం 233 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఇందులో 5 శతకాలు ఉన్నాయి. అతడి తర్వాత శిఖర్‌ ధావన్‌(6536) ఉన్నాడు. అయితే.. కోహ్లీ నిన్న దిల్లీపై చేసిన అర్ధ శతకం అతడికి 50వది. మరోవైపు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇది 50వ మ్యాచ్‌. 50వ మ్యాచ్‌లో విరాట్‌ 50వ హాఫ్‌ సెంచరీ బాదాడని అతడి అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ రికార్డులపై కోహ్లీ మ్యాచ్‌ అనంతరం మాట్లాడాడు.

ఇది నాకెంతో ప్రత్యేకమైన సందర్భం..

‘నా ప్రయాణంలో ఇది మరో మైలు రాయి. ఇది నైస్‌ నంబర్‌. బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో స్కీన్‌పై చూశాను. ఎంతో సంతోషంగా ఉంది. ఇది నాకెంతో ప్రత్యేకమైన సందర్భం. నా కుటుంబం ఇక్కడే ఉంది. నా కోచ్‌ కూడా ఇక్కడే ఉన్నారు. అనుష్క కూడా మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చారు’ అని కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ఈ పరుగుల వీరుడి క్రికెట్‌ జర్నీ దిల్లీలోనే మొదలైందన్న విషయం తెలిసిందే. తన సొంత మైదానంలో వస్తోన్న ప్రశంసలు తనకెంతో ప్రత్యేకమని తెలిపాడు.

‘నా క్రికెట్‌ జర్నీ ఇక్కడే ప్రారంభమైంది. ఇక్కడే నా ఆటను చూసి సెలక్టర్లు నన్ను ఎంపిక చేశారు. ఈ మైదానం పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది. ఇలాంటి అద్భుతమైన విషయాలతో దేవుడు నన్ను ఆశీర్వదించాడు’ అని కోహ్లీ చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌ను చూసేందుకు తన కుటుంసభ్యులు హాజరుకావడం.. మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టిందని విరాట్‌ అన్నాడు.

క్రికెట్‌ నా జీవితంలో ఓ భాగం మాత్రమే..

‘నా సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma) ఈ పర్యటనలో నాతోపాటే ఉండటం నాకు ఎంతో ప్రత్యేకం. నాకు అన్నింటికంటే కుటుంబానికి సమయం కేటాయించడమే ఎంతో ముఖ్యం. క్రికెట్‌ నా జీవితంలో ఓ భాగం మాత్రమే. స్టేడియంలో నా మ్యాచ్‌లను అనుష్క చూస్తుండటాన్ని నేను గొప్పగా ఫీలవుతాను’ అని విరాట్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో బెంగళూరు తొలుత 181 పరుగులు చేయగా.. దిల్లీ బ్యాటర్లు చెలరేగి ఆడి 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని