Wrestlers Protest: ‘మోదీజీ.. మా మన్‌ కీ బాత్‌ కూడా వినండి’: మహిళా రెజ్లర్లు

మహిళా రెజ్లర్ల బాధను చెప్పుకునేందుకు తమకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ (PM Modi)కి విజ్ఞప్తి చేశారు. మా ఆవేదన పెద్దలకు చేరడం లేదనకుంటా.. అందుకే మేమంతా ప్రధానిని కలిసి మా బాధను చెప్పాలనుకుంటున్నామని అన్నారు.

Published : 26 Apr 2023 20:17 IST

దిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan)పై కేను నమోదు చేయాలని కోరుతూ ఏడుగురు మహిళా రెజ్లర్లు దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆదివారం నుంచి నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు అతనిని అరెస్ట్‌ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలు చేశారు. త్వరలోనే వీరంతా ప్రధాని మోదీని కలిసి తమ బాధను వివరిస్తామని తెలిపారు. 

‘‘ ప్రధాని మోదీ సార్‌ మీరు బేటీ బచావ్‌.. బేటీ బచావ్‌ గురించి చెబుతారు. మన్‌ కీ బాత్‌ (Mann Ki Baat) ద్వారా అందరితో మాట్లాడుతారు. అలానే మా మన్‌ కీ బాత్‌ కూడా వినలేరా?. దేశం కోసం పతకాలు సాధించిన సమయంలో మమ్మల్ని ఇంటికి ఆహ్వానించారు. ఈ రోజు మా బాధ చెప్పుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.’’ అని ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌ (Sakshi Malik) కోరారు. నాలుగు రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని వినేశ్ ఫొగట్‌ (Vinesh Phogat) ప్రశ్నించారు. మా ఆవేదన పెద్దలకు చేరడం లేదనకుంటా.. అందుకే మేమంతా ప్రధానిని కలిసి మా బాధ వ్యక్తం చేయాలనుకుంటున్నామని అన్నారు. 

‘‘శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను భోజనం కూడా సిద్ధం చేసుకోనివ్వడంలేదు. బ్రిజ్‌ భూషణ్‌ పరపతి గురించి చెప్పి మమ్మల్ని కొందరు భయపెట్టాలని చూస్తున్నారు. మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదు. క్రీడాకారులుగా ఐకమత్యంగా రెజ్లర్లకు మద్దతు పలకాలని కోరుతున్నాం’’ అని బజరంగ్ పునియా (Bajaran Punia) విజ్ఞప్తి చేశారు. మరోవైపు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన  సుప్రీం కోర్టు  దిల్లీ పోలీసులకు (Delhi Police) నోటీసులిచ్చింది. దీనిపై దిల్లీ పోలీసులు స్పందిస్తూ.. కేసు నమోదుకు ముందు కొంత ప్రాథమిక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని