Rohit on workload: అదంతా వ్యూహాత్మక నిర్ణయం.. అందులో నేనూ భాగమే: రోహిత్

సీనియర్లపై పని ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని సిరీస్‌లకు విశ్రాంతి ఇస్తూ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది. రోహిత్, విరాట్ ఇటీవల టీ20 సిరీసుల్లో ఆడటం లేదు.

Updated : 07 Aug 2023 14:34 IST

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు పది నెలల నుంచి భారత (Team India) కొందరు సీనియర్‌ క్రికెటర్లు టీ20ల్లో భాగం కావడం లేదన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) లేకుండానే హార్దిక్‌ పాండ్య నాయకత్వంలో టీమ్‌ఇండియా పొట్టి సిరీస్‌లను ఆడుతోంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ను (T20 World Cup 2023) దృష్టిలో పెట్టుకుని యువకులతో కూడిన జట్టును సిద్ధం చేసేందుకు మేనేజ్‌మెంట్ ఇలా చేస్తోందని, అందుకే సీనియర్లను పక్కన పెట్టినట్లు వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తనతోపాటు మరికొందరు సీనియర్లు అంతర్జాతీయ టీ20ల్లో ఆడకపోవడమనేది వ్యూహాత్మక నిర్ణయమని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్‌ ప్రకారం అందరూ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ను ఆడటం కష్టమేనని వ్యాఖ్యానించాడు. 

నా తొలి హాఫ్ సెంచరీ.. సమైరాకి అంకితం: తిలక్ వర్మ

‘‘మా ముందున్న అతి కీలక టోర్నీ వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023). ఈ సందర్భంగా అందరికీ ఒకటి చెబుదామనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ను ఆడటం అసాధ్యం. క్రికెట్‌ షెడ్యూల్‌ను చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. వరుసగా మ్యాచ్‌లు ఉండటంతో కొన్నింటికి విరామం తీసుకోవాల్సి ఉంటుంది. వర్క్‌లోడ్‌ను మేనేజ్‌ చేయడానికి ఇది చాలా అవసరం. నేను కూడా ఇదే కేటగిరీలోకి వస్తా. ఇటీవల మ్యాచ్‌ల సంఖ్య పెరగడంతో ఆటగాళ్లపై పని ఒత్తిడి అధికంగా ఉంటోంది. అందుకే, ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకొన్నారు’’ అని రోహిత్ తెలిపాడు. రోహిత్‌, విరాట్‌తోపాటు రవీంద్ర జడేజా కూడా విండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడి టీ20ల నుంచి విరామం తీసుకున్నారు. ఆసియా కప్, వన్డే వరల్డ్‌ కప్‌ ఉన్న నేపథ్యంలో సీనియర్లకు తగినంత విశ్రాంతి దక్కేలా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని