Virat Kohli: సెలవు తీసుకోవడం విరాట్‌ హక్కు.. యువ ఆటగాళ్లు రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడాల్సిందే: జై షా

విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత సెలవు తీసుకోవడాన్ని బీసీసీఐ యాజమాన్యం వెనకేసుకొచ్చింది. అదే సమయంలో ఫిట్‌గా ఉండీ.. దేశవాళీ క్రికెట్‌ ఆడని ఆటగాళ్లకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది.

Updated : 15 Feb 2024 13:20 IST

ఇంటర్నెట్‌డెస్క్: వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌ సిరీస్‌కు విరాట్‌ (Virat Kohli) దూరం కావడాన్ని బీసీసీఐ యాజమాన్యం సమర్థించింది. అతడు అకారణంగా సెలవులు తీసుకోడని కోహ్లీకి మద్దతుగా నిలిచింది. బోర్డ్‌ కార్యదర్శి జై షా స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. బుధవారం రాజ్‌కోట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం స్టేడియం పేరును బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్‌ షా మైదానంగా మార్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఎవరైనా ఆటగాడు 15ఏళ్ల కెరీర్‌లో వ్యక్తిగత సెలవు తీసుకోకపోతే.. వాటిని అడిగి వాడుకోవడం అతడి హక్కు. విరాట్‌ అకారణంగా వ్యక్తిగత సెలవు అడిగే రకం కాదు. మేం కచ్చితంగా మా ఆటగాళ్లను నమ్ముతాం.. వారికి అండగా ఉంటాం’’ అని వ్యాఖ్యానించాడు. కానీ, రోహిత్‌ టీ20 ప్రపంచకప్‌లో నాయకత్వం వహిస్తాడని వెల్లడించిన షా.. కోహ్లీ ఈ టోర్నీలో ఉంటాడా అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ‘విరాట్‌ గురించి తర్వాత మాట్లాడుకుందాంలే’ అని దాటవేశాడు. 

సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్లు దేశవాళీ సుదీర్ఘ ఫార్మాట్లు ఆడాల్సిందే..

బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కింద ఉన్న ఆటగాళ్లు దేశవాళీలో రెడ్‌బాల్‌ (సుదీర్ఘ ఫార్మాట్‌) క్రికెట్‌ను ఆడి తీరాల్సిందేనని జై షా తేల్చిచెప్పాడు. ఈ విషయంలో బోర్టు ఎలాంటి మినహాయింపులు ఇవ్వదని పేర్కొన్నాడు. జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలను పాటించని ఆటగాళ్ల విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకొనే స్వేచ్ఛను తాము సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌కు ఇచ్చామన్నాడు. ‘‘ఇప్పటికే ఈ విషయాన్ని ఆటగాళ్లకు ఫోన్‌ చేసి సమాచారం అందజేశాం. త్వరలోనే నేను వ్యక్తిగతంగా లేఖలు రాస్తాను. సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌, కోచ్‌, కెప్టెన్‌ మిమ్మల్ని రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడమంటే.. ఆడాల్సిందే అని వారికి వెల్లడిస్తాను. ఎన్‌సీఏ నుంచి ఏ సూచన వచ్చినా పాటిస్తాము. ఉదాహరణకు ఎవరి శరీరమైన వైట్‌బాల్‌, రెడ్‌బాల్‌ ఫార్మాట్లను తట్టుకోలేదని చెబితే మేము దానిలో జోక్యం చేసుకోం. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న యువ ఆటగాళ్ల ప్రవర్తనలో ఎలాంటి ఆవేశకావేషాలును సహించం. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లోని ఆటగాళ్లందరికీ ఇది వర్తిస్తుంది’’ అని షా చెప్పాడు. 

టీ20 ప్రపంచకప్‌లో రోహితే కెప్టెన్‌

ఇటీవల కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడటానికి అయిష్టత చూపుతూ ఐపీఎల్‌పైనే దృష్టి పెట్టడంపై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో రంజీ మ్యాచ్‌లను ఆటగాళ్లకు తప్పనిసరి చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ కార్యదర్శి జై షా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుత చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌, ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ ..తదితరులు షా వ్యాఖ్యానించే సమయంలో అక్కడే ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని