Team India: సూర్యపై నమ్మకముంది.. పాండ్య ధోనీ కానక్కర్లేదు.. భారత్‌పై ఒత్తిడి ఎక్కువే!

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) నాలుగో స్థానంలో బరిలోకి దిగే ఆటగాడు ఎవరనే దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అలాగే టీమ్‌ఇండియాను ఒత్తిడికి గురి చేసేలా ప్రత్యర్థులు మాటల వ్యూహం మొదలుపెట్టేశారు. 

Published : 12 Aug 2023 11:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్డిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో (WI vs IND) కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సూర్యకుమార్ యాదవ్‌ (Suryakumar Yadav) భారత్‌ను గెలిపించాడు. నేడు విండీస్‌తో నాలుగో మ్యాచ్‌ కోసం భారత్‌ సిద్ధమవుతోంది. టీ20ల్లో అదరగొడుతున్న సూర్య వన్డేల్లో మాత్రం గొప్ప ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. దీంతో వచ్చే వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) జట్టులో స్థానం దక్కడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం సూర్యకుమార్‌పై నమ్మకం ఉందని పేర్కొన్నాడు.

Ambati Rayudu: కరీబియన్‌ లీగ్‌లో రాయుడు

‘‘వన్డేల్లో రాణించడానికి సూర్య చాలా కష్టపడుతున్నాడు. దీనికోసం సీనియర్లతో తరచూ మాట్లాడుతూ సలహాలు తీసుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి పరుగులు చేయడం మొదలుపెడితే అద్భుతంగా ఆడేస్తాడు. దానికి ఉదాహరణగా గత ఐపీఎల్‌లో తొలి నాలుగైదు మ్యాచుల్లో పెద్దగా పరుగులు చేయలేదు. కానీ, ఆ తర్వాత చెలరేగుతూ హాఫ్ సెంచరీలు సాధించాడు. అలాగే వన్డేల్లోనూ కాస్త కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడేయగలడు. అందుకే ఇలాంటి ఆటగాడికి మద్దతు అందించడం మా బాధ్యత. ఒకటీ రెండు మ్యాచుల్లో రాణించకపోయినా ఫర్వాలేదు. మ్యాచ్‌లను ఎలా గెలవాలనేది మిగతా ఆటగాళ్లకు తెలుసు. మూడో టీ20లో సూర్యకుమార్‌ ఆడిన ఇన్నింగ్స్‌ అద్భుతం. అయితే వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడతాడో లేదో ఇప్పుడే చెప్పలేం’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. 


అలా ఎందుకు ఆలోచిస్తారు? : ఆకాశ్ చోప్రా

మూడో టీ20 మ్యాచ్‌లో తిలక్‌ వర్మ 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడికి స్ట్రైకింగ్ ఇవ్వకుండా హార్దిక్‌ పాండ్య సిక్స్‌ కొట్టడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ధోనీతో పోలుస్తూ ట్రోలింగ్‌ చేశారు. ఒక మ్యాచ్‌లో ధోనీకి విన్నింగ్‌ షాట్‌ కొట్టే అవకాశం వచ్చినా విరాట్ కోహ్లీకి ఛాన్స్‌ ఇచ్చి మరీ అందరితో ప్రశంసలు అందుకొన్నాడు. కానీ, హార్దిక్‌ మాత్రం చాలా బంతులు మిగిలి ఉన్నప్పటికీ సింగిల్‌ ఇద్దామనే ఆలోచన చేయకపోవడం గమనార్హం. తాజాగా ఇదే విషయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. ‘‘ధోనీని మార్గదర్శకంగా భావించే హార్దిక్‌ పాండ్య.. అతడిలా కానక్కర్లేదు. అసలు టీ20ల్లో మైలురాళ్లు గురించి ఎందుకు మాట్లాడతారు? ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆలోచన ఉంటుంది. గతంలో ధోనీ డిఫెన్స్‌ ఆడి మరీ విన్నింగ్‌ షాట్‌ను కొట్టే అవకాశం విరాట్‌కు ఇచ్చిన సంఘటన నాకు గుర్తుంది’’ అని చోప్రా తెలిపాడు.


స్వదేశంలో వరల్డ్‌ కప్.. అంచనాలు అధికం: పాక్‌ మాజీ పేసర్

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్‌ కోసం అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. అయితే, టీమ్‌ఇండియాను ఒత్తిడికి గురి చేసేలా ప్రత్యర్థి జట్ల మాజీ క్రికెటర్లు తమ వ్యాఖ్యలకు పదును పెడుతూనే ఉన్నారు. పాకిస్థాన్‌ మాజీ పేసర్ సర్ఫరాజ్‌ నవాజ్‌ కూడా భారత్‌ కంటే తమ జట్టే నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించాడు. ‘‘ఇప్పటికీ భారత్‌ జట్టు కాంబినేషన్‌ కుదరలేదు. ఆసియా కప్‌ మరో కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయినా, టీమ్‌ఇండియా మిడిలార్డర్‌లో ఎవరు ఉంటారు? ఎవరు ఆడతారు? అనే విషయాలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కెప్టెన్లు మారుతూ వస్తున్నారు. ఆటగాళ్ల కాంబినేషన్‌ ఇంకా కుదరలేదు. కొత్త ప్లేయర్లను ప్రయత్నిస్తున్నారు. అలాగే ఐసీసీ ట్రోఫీని నెగ్గి పదేళ్లవుతుందనే విషయం కూడా ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్వదేశంలో జరగనుండటం కూడా అదనపు ఒత్తిడికి గురి చేస్తుంది. అయితే, కొందరు సీనియర్‌ ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసిరానుంది’’ అని నవాజ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు