RCB vs LSG: బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లిన నికోలస్‌ పూరన్‌

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ అదరగొట్టింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని లఖ్‌నవూ 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి వరకు పోరాడి ఛేదించింది.

Updated : 10 Apr 2023 23:46 IST

బెంగళూరు: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ అదరగొట్టింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని లఖ్‌నవూ 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి వరకు పోరాడి ఛేదించింది. నికోలస్‌ పూరన్‌ (62; 19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 105 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లఖ్‌నవూను నికోలస్‌ ఆదుకుని విజయం దిశగా నడిపించాడు. మంచి నీళ్లప్రాయంలా సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పూరన్‌ 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కీలక సమయంలో పూరన్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. చివరి ఓవర్‌లో లఖ్‌నవూ విజయానికి ఐదు పరుగులు అవసరం కాగా.. రెండో బంతికి మార్క్ వుడ్ (1), ఐదో బంతికి ఉనద్కత్‌ (9) ఔట్ కావడంతో మ్యాచ్‌ మరింత ఉత్కంఠగా మారింది. చివరి బంతికి బైస్‌ రూపంలో ఒక పరుగు రావడంతో లఖ్‌నవూ శిబిరం సంబరాల్లో మునిగి తేలింది. స్టాయినిస్‌ (65; 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా రాణించాడు. బదోని (30) పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్‌ 3, పార్నెల్ 3, హర్షల్ పటేల్ 2, కర్ణ్ శర్మ 1 వికెట్ పడగొట్టారు. 

విరాట్ కోహ్లీ (61; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), డు ప్లెసిస్ (79*; 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (59; 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) ముగ్గురూ అర్ధ శతకాలు బాదడంతో తొలుత బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. చివరి ఏడు ఓవర్లలో బెంగళూరు బ్యాటర్లు 108 పరుగులు రాబట్టారు. అమిత్‌ మిశ్రా వేసిన 12 ఓవర్లో మూడో బంతికి కోహ్లీ.. స్టాయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మ్యాక్స్‌వెల్.. మార్క్‌వుడ్ వేసిన చివరి ఓవర్లో ఐదో బంతికి క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని