Virat : ప్రత్యర్థిని సవాల్ చేసే విషయంలో అతడి కంటే కోహ్లీనే బెటర్‌: బట్

జట్టును దూకుడుగా నడిపించడంలో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ కంటే టీమ్‌ఇండియా.. 

Updated : 13 Dec 2021 07:15 IST

ఇంటర్నెట్ డెస్క్: జట్టును దూకుడుగా నడిపించడంలో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ కంటే టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ చాలా ముందున్నాడని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ సల్మాన్‌ బట్ అభిప్రాయపడ్డాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా గబ్బా టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆసీస్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తుది జట్టు ఎంపిక నుంచి టీమ్‌ను నడిపించిన తీరు వరకు రూట్‌ విఫలమయ్యాడని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. పాక్‌ మాజీ సారథి బట్ అయితే విరాట్ కోహ్లీ, జో రూట్‌ నాయకత్వ తీరును సరిపోల్చాడు. ‘‘ప్రత్యర్థి జట్టును సవాల్‌ చేసే దృక్పథం విరాట్ కోహ్లీది. ఆసీస్‌ పరిస్థితుల్లో అతడి మాదిరిగా దూకుడుగా బ్యాటింగ్ చేయడం అవసరం. అయితే ఇలాంటి వైఖరి జో రూట్‌లో కనిపించలేదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కాస్త టెన్షన్‌గా కనిపించాడు. అయితే విరాట్ ముఖంలో మాత్రం ఎప్పుడూ చూడలేం. ఆసీస్‌తో ఆడేటప్పుడు రూట్‌ కంటే కోహ్లీ బాడీలాంగ్వేజ్, గెలవాలనే కసి తీవ్రంగా కనిపిస్తుంది’’ అని వివరించాడు. 

యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 147 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసి 278 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ (89), డేవిడ్ మలన్ (82) రాణించడంతో ఇంగ్లాండ్‌ మళ్లీ రేసులోకి వచ్చినట్లు అనిపించింది. అయితే కీలకమైన సమయాల్లో వికెట్లను చేజార్చుకున్న పర్యాటక జట్టు 297 పరుగులకే ఆలౌటైంది. ఆఖరి ఎనిమిది వికెట్లకు 74 పరుగులను మాత్రమే జోడించడం గమనార్హం. అనంతరం 20 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని