Shryeas Iyer: తిరిగొస్తే దిల్లీ సారథి అయ్యరే

శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి దిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించే అవకాశం ఉందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్...

Updated : 14 May 2021 12:16 IST

ఆకాశ్‌ చోప్రా అంచనా

ముంబయి: శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి దిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించే అవకాశం ఉందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. గాయంతో టోర్నీకి దూరమై కోలుకొని తిరిగొస్తే జట్టులోకి తీసుకోకూడదన్న నియమమేమీ లేదని పేర్కొన్నాడు. నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌ మొదలైతే అతడే పగ్గాలు తీసుకోవచ్చని అంటున్నాడు. సోషల్‌ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అతడు జవాబిచ్చాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్‌కు శ్రేయస్‌ దూరమైన సంగతి తెలిసిందే. సరిగ్గా సీజన్‌కు ముందు టీమ్‌ఇండియాకు ఆడుతూ అతడు గాయపడ్డాడు. భుజం స్థానభ్రంశం కావడంతో ఐపీఎల్‌, కౌంటీ క్రికెట్‌కు దూరమయ్యాడు. దాంతో యువ రిషభ్ పంత్‌కు దిల్లీ పగ్గాలు అప్పజెప్పింది. అతడు జట్టును సమర్థంగా నడిపించాడు. 6 విజయాలతో 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో జట్టును నిలబెట్టాడు. నాయకత్వంలో త్వరగా పాఠాలు నేర్చుకున్నాడు. దాంతో శ్రేయస్‌ తిరిగొస్తే అతడికి సారథ్యం ఇస్తారా లేదా అన్న సందిగ్ధం నెలకొంది.

‘కచ్చితంగా.. అందులో సందేహమే లేదు. గాయం నుంచి కోలుకొని తిరిగొస్తే శ్రేయస్‌ అయ్యర్‌కు సారథ్యం ఇస్తారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు. అప్పుడు హెట్‌మైయిర్‌, స్టాయినిస్‌, రబాడతో కలిసి నార్జె ఆడతాడు. ఇప్పటికే దిల్లీ గట్టి జట్టు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. శ్రేయస్‌ రాకతో మరింత బలం పుంజుకుంటుంది. టోర్నీకి దూరమయ్యాక తిరిగి రావొద్దన్న నిబంధనలు ఎక్కడా లేవు. అతడు ఫిట్‌నెస్‌ సాధిస్తే కచ్చితంగా పునరాగమనం చేస్తాడు’ అని ఆకాశ్ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని