Kusal Mendis: శ్రీలంక ఓడినా అతడి ఆట తీరు ఉన్నతం

ప్రపంచకప్‌లో జట్టు ఆశలన్నీ అతడిపైనే.. ఛేదన అసాధ్యమని అర్థమైనా.. ప్రత్యర్థి జట్టుపై సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు శ్రీలంక బ్యాటర్ కుశాల్‌ మెండిస్‌. 

Updated : 12 Oct 2023 17:03 IST

ప్రపంచకప్‌లో అదరగొడుతున్న కుశాల్‌

122.. 76.. 158..91,, 50..92.. ఇదీ గత పది ఇన్నింగ్స్‌ల్లో శ్రీలంక స్టార్‌ కుశాల్‌ మెండిస్‌ (Kusal Mendis) మెరుపులు! ప్రపంచకప్‌ (ODI World Cup 2023)కు రాక ముందే అదిరే ఫామ్‌లో ఉన్న అతడు.. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ నుంచే చెలరేగిపోతున్నాడు. భారీ స్కోర్లతో రెచ్చిపోతున్నాడు. రెండు ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లోనే అతడు 14 సిక్స్‌లు బాదాడంటేనే కుశాల్‌ దూకుడు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే అతడెంత బాదుతున్నా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం శ్రీలంకను నిరాశ పరిచే అంశం.

వార్మప్‌ మ్యాచ్‌ నుంచే..

ప్రపంచకప్‌లో కుశాల్‌ విధ్వంసం వార్మప్‌ మ్యాచ్‌ నుంచే మొదలైంది. అఫ్గానిస్థాన్‌తో పోరులో అదరగొట్టిన ఈ కుడి చేతి వాటం బ్యాటర్‌ 87 బంతుల్లోనే 158 పరుగులు చేశాడు. ఇందులో 19 ఫోర్లు, 9 సిక్స్‌లు బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌ ఇచ్చిన స్ఫూర్తితోనే ప్రపంచకప్‌ అసలు మ్యాచ్‌ల్లోనూ దంచేస్తున్నాడు కుశాల్‌. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థి 400 పైన పరుగులు సాధించి భయపెట్టినా.. లంక చివరికి 300 దాటిందంటే అందుకు కారణం కుశాలే. పిడుగల్లే విరుచుకుపడిన ఈ స్టార్‌... సిక్స్‌లు, ఫోర్లతో దడదడలాడించాడు. ఛేదన అసాధ్యమని ముందే అర్థమైనా.. అతడు చేసిన పోరాటం అసమానం. 42 బంతుల్లోనే 76 పరుగులు చేసిన కుశాల్‌.. 4 ఫోర్లు, 8 సిక్స్‌లు బాదేశాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అతడి ఆట మరో స్థాయికి వెళ్లింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన కుశాల్‌ 6 సిక్స్‌లు, 14 ఫోర్లతో 77 బంతుల్లోనే 122 పరుగులు చేసి జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు. పాక్‌ పేసర్లను లెక్క చేయకుండా ఆడిన తీరు అద్భుతం.

కొన్నాళ్లుగా అతడొక్కడే

శ్రీలంక వరుసగా 13 వన్డే విజయాలు సాధించి అత్యధిక విజయాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విజయాల్లో కుశాల్‌ పాత్ర ఎంతో ఉంది. చాలా రోజులుగా లంక బ్యాటింగ్‌ భారాన్ని మోస్తున్న కుశాల్‌.. అవసరమైన ప్రతిసారీ ఆపద్భందు పాత్ర పోషిస్తున్నాడు. గత పది ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీ, 4 అర్ధసెంచరీలు సాధించాడంటే లంక అతడి బ్యాటింగ్‌పై ఎంతగా ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చు. బలమైన లెగ్‌సైడ్‌ ఆటతో విరుచుకుపడే కుశాల్‌..స్పిన్నర్లను ఎదుర్కోవడంలో దిట్ట. బౌండరీల మీద బౌండరీలు కొట్టేస్తూ చూస్తుండగానే భారీ స్కోరు చేసేయడం అతడి స్టయిల్‌. నిజానికి లంక మరిన్ని విజయాలు సాధించేదే. కానీ అతడికి వేరే బ్యాటర్ల నుంచి సాయం అందకపోవడంతో చాలా మ్యాచ్‌ల్లో లంక పోరాడి ఓడిపోయింది. 

ప్రపంచకప్‌ ఆశ అతడే

ప్రస్తుత ప్రపంచకప్‌లో శ్రీలంకకు ఆశ కుశాల్‌ మెండిసే. తొలి రెండు మ్యాచ్‌లో ఓడినా.. చివరి వరకు పోరాడిందంటే కారణం కుశాల్‌ ఆరంభంలో ఇచ్చిన మెరుపుల వల్లే. మున్ముందు మ్యాచ్‌ల్లోనూ అతడు ఇలాగే చెలరేగాలని లంక కోరుకుంటోంది. కుశాల్‌ ఎంతగా బాదుతున్నా లంక ఓడిపోవడం అతడికి నిరాశ కలిగించే అంశమే. అయితే అతడితో పాటు జయవిక్రమ, అసలంక, శానక రాణిస్తున్నా బౌలింగ్‌లో తేలిపోవడం లంకకు చేటు చేస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్‌తో పోరులో దాదాపు 350 లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోవడం ఆ జట్టు బలహీనతకు చిహ్నం. రాబోయే మ్యాచ్‌ల్లో అయినా తప్పులు దిద్దుకోకపోతే కుశాల్‌ ఎంత బాదినా లంకకు ఏ ప్రయోజనం ఉండదు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని